సాక్షి, హైదరాబాద్: మదుపరుల డీ–మ్యాట్ ఖాతాల్లోని షేర్లను వారి అనుమతి లేకుండా ట్రేడింగ్ చేసి, ఆ మొత్తాలు కాజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుగ్రహ్ స్టాండ్ అండ్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు నమోదు చేసిన కేసులో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంస్థ అక్రమాల విషయం తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా పరోక్షంగా సహకరించారని ఆరోపిస్తూ నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు (ఎన్‌ఎస్‌ఈ) చెందిన కీలక వ్యక్తులనూ నిందితులుగా చేర్చారు.
దాని మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విక్రమ్ లిమయేతో పాటు చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ ప్రియ సుబ్బరామన్ ఈ జాబితాలో ఉన్నారు. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన అనుగ్రహ్ సంస్థ నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌తో (ఎన్‌ఎస్‌ఈ) పాటు ది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద రిజిస్టరై ఉంది. ఏళ్లుగా అనేక మంది మదుపర్ల డీమ్యాట్ ఖాతాలను ఈ సంస్థ పర్యవేక్షించింది. ఆయా ఖాతాల్లో క్లైంట్‌కు సంబంధించిన షేర్లతో పాటు కొంత నగదు కూడా ఉండేది. ప్రతి మదుపరుడు తన షేర్లను బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టడం ద్వారా వాటి విలువలో 80 శాతం వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని వినియోగించుకుంటూ అనేక మంది మదుపరులు రుణాలు తీసుకుని ఆ మొత్తాన్ని మరిన్ని షేర్లు ఖరీదు చేయడానికి వినియోగిస్తుంటారు.
దీనిని తనకు అనువుగా మార్చుకున్న అనుగ్రహ్ డైరెక్టర్ పరేష్ ముల్జీ కరియా మదుపరుల అనుమతి లేకుండా వారి డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి మార్చుకున్నాడు. ఇలా దాదాపు రూ.1000 కోట్ల మేర మదుపరుల సొమ్ము కాజేశాడు. ఈ పంథాలో నగరంలోని చిక్కడపల్లికి చెందిన కంపెనీ సెక్రటరీ టి.రవిప్రకాష్ రూ.1,87,47,493 నష్టపోయారు. ఈయన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు బుధవారం అనుగ్రహ్‌పై కేసు నమోదు చేశారు. అనుగ్రహ్ సంస్థ వద్ద ఉండాల్సిన మదుపరుల షేర్లతో భారీ తగ్గుదల ఉన్నట్లు ఎన్‌ఎస్‌సీతో పాటు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్‌కు (సీడీఎస్‌ఎల్) ముందే తెలుసని రవి ప్రకాష్ ఆరోపించారు. సెబీ ఆధీనంలో పని చేసే సీడీఎస్‌ఎల్‌తో పాటు ఎన్‌ఎస్‌ఈ సైతం ఈ విషయాన్ని పట్టించుకోకుండా అనుగ్రహ్‌కు పరోక్షంగా సహకరించినట్లు ఆరోపించారు.
ఇదే విషయాన్ని సెబీ గతేడాది మార్చిలో ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొందని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. 2017–18 నాటికే అనుగ్రహ్ వద్ద ఉండాల్సిన మదుపరుల షేర్లకు సంబంధించి రూ.112 కోట్లు గోల్‌మాల్ అయ్యాయని తెలిసినప్పటికీ ఎన్‌ఎస్‌ఈ, సీడీఎస్‌ఎల్ 2020 వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సెబీ స్పష్టం చేసినట్లు రవి ప్రకాష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఎడిల్‌వైజ్ కస్టోడియన్ సర్వీసెస్ లిమిటెడ్‌కు పాత్ర ఉందని ఆరోపించారు.
ఈయన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు అనుగ్రహ్‌పై నమోదు చేసిన కేసులో ఆ సంస్థతో పాటు దాని యజమాని పరేష్, దీంతో సంబంధం కలిగి ఉన్న తేజిమండి.కామ్ వెబ్‌సైట్ యజమాని అనిల్ గాంధీ, ఎన్‌ఎస్‌ఈ, దీని సీఈఓ, ఎండీగా ఉన్న విక్రమ్ లిమయే, చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ ప్రియ సుబ్బరామన్, ఎడిల్‌వైజ్ కస్టోడియన్ సర్వీసెస్ లిమిటెడ్, సీడీఎస్‌ఎల్‌లను నిందితులుగా చేర్చారు. దీనికి సంబంధించిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘రవి ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల ఆధారంగా ఈ కేసు నమోదు చేశాం. దాని ప్రకారమే నిందితుల జాబితా రూపొందించాం. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే వివరాలను బట్టి తదుపరి చర్యలు ఉంటాయి’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment