21,000 పాయింట్లకు సెన్సెక్స్
ఫిబ్రవరి నెల డెరివేటివ్ ముగింపు రోజున కూడా మార్కెట్లు పురోగమించాయి. వెరసి వరుసగా నాలుగో రోజు సెన్సెక్స్ లాభపడింది. 135 పాయింట్లు పెరిగి 20,987 వద్ద ముగిసింది. నెల రోజుల తరువాత ఇంట్రాడేలో 21,000 పాయింట్లను అధిగమించింది కూడా. అయితే ట్రేడర్లు మార్చి నెల సిరీస్‌కు పొజిషన్లను రోలోవర్ చేసుకోవడంలో కొంతమేర ఒడిదొడుకులకు లోనైంది. ఇక నిఫ్టీ సైతం 39 పాయింట్లు పుంజుకుని 6,239 వద్ద స్థిరపడింది.
కొత్త గరిష్టాలకు
ఐటీ దిగ్గజాలు విప్రో(రూ. 603), ఇన్ఫోసిస్(రూ. 3,804), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్(రూ. 1,573), డాక్టర్ రెడ్డీస్(రూ. 2,823) కొత్త గరిష్టాలను తాకాయి. యూఎస్ సంస్థ కారిలియన్ నుంచి దక్కిన పదేళ్ల కాంట్రాక్ట్ విప్రోకు ఊపునివ్వగా, మైగ్రెయిన్ చికిత్సకు వినియోగించే సుమట్రిప్టన్ ఇంజక్షన్‌ను అమెరికాలో ప్రవేశపెట్టడం రెడ్డీస్ షేరుకు లాభించింది.
సహారా షేర్లు డీలా
సుబ్రతా రాయ్‌పై అరెస్ట్ వారంట్ జారీ నేపథ్యంలో సహారా గ్రూప్ షేర్లు డీలాపడ్డాయి. సహారా హౌసింగ్ ఫైనాన్స్ 3.6% పతనంకాగా, సహారా వన్ మీడియా 1.6% క్షీణించింది. ఇంట్రాడేలో సహారా హౌసింగ్ 5% వరకూ పడింది. అయితే ఈ రెండు షేర్లలోనూ నామమాత్ర ట్రేడింగ్ జరిగింది.
నేడు మార్కెట్లకు సెలవు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం(27న) బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలతోపాటు, ఫారెక్స్, మనీ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బులియన్ మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి.