ఐటీ, ఫార్మా షేర్లలో అమ్మకాలు
సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ షేరు 8.5 శాతం పతనంకావడంతో స్టాక్ సూచీలు వారం రోజుల కనిష్టస్థాయిలో ముగిసాయి. ఈ జనవరి-మార్చి క్వార్టర్లో తమ ఆదాయవృద్ధి మందగించ వచ్చని. వచ్చే ఏడాది కూడా వృద్ధి తగినంతగా వుండకపోవొచ్చని ఇన్ఫోసిస్ యాజమాన్యం ప్రకటించడంతో గత రాత్రి అమెరికా మార్కెట్లో ఇన్ఫీ షేరు పతనమైన సంగతి తెలిసిందే. ఇదే ట్రెండ్‌ను అనుసరిస్తూ గురువారం రూ. 313 క్షీణించి రూ. 3,357 వద్ద ఈ షేరు ముగిసింది. ఇన్ఫీకి స్టాక్ సూచీల్లో 10 శాతంపైగా వెయిటేజి వుండటంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 82 పాయింట్లు తగ్గి 21,775 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 24 పాయింట్లు తగ్గిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 6,493 పాయింట్ల వద్ద ముగిసింది. ర్యాన్‌బాక్సీ 3 శాతం, రియల్టీ షేర్లు డీఎల్‌ఎఫ్ 6.5 శాతం పతనంకాగా, జేపీ అసోసియేట్స్ 3 శాతం క్షీణించింది.
లేచిపడిన బ్యాంకింగ్ షేర్లు: ఫిబ్రవరి నెలలో ద్రవ్యోల్బణం తగ్గిందన్న వార్తలతో తొలుత బ్యాంకింగ్ షేర్లు ర్యాలీ జరిపినప్పటికీ, ముగింపులో చాలావరకూ బ్యాంకు షేర్లు వాటి లాభాలను కోల్పోయాయి. ఏప్రిల్ 1నాటి పాలసీ సమీక్షలో రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించకపోవొచ్చన్న అంచనాలు ఏర్పడటంతో ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంకు షేర్లు ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు గరిష్టస్థాయిలో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే ప్రైవేటు రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2 శాతం పెరిగి ఆల్‌టైమ్ గరిష్టస్థాయి రూ. 741 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ స్వల్పంగా లాభపడగా, యాక్సిస్ బ్యాంక్ 1 శాతం తగ్గింది. వచ్చే నెల నుంచి సహజవాయువు ధరను 8 డాలర్లకు పెంచడానికి అనుమతి కోరుతూ చమురు మంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘాన్ని సంప్రదించిందన్న వార్తలతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు పీఎస్‌యూ ఆయిల్ షేర్లు ర్యాలీ జరిపాయి. ముగింపులో రిలయన్స్ షేరు లాభాల స్వీకరణకు గురైనా, ఒఎన్‌జీసీ 2.5 శాతం పెరుగుదలతో ముగిసింది. బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్‌లు 3-7 శాతం మధ్య పెరిగాయి.
సన్ ఫార్మాకు యూఎస్‌ఎఫ్‌డీఏ షాక్
దేశీయ దిగ్గజం సన్ ఫార్మాకు యూఎస్‌ఎఫ్‌డీఏ షాకిచ్చింది. గుజరాత్‌లోగల కార్ఖాడీ ప్లాంట్‌లో తయారయ్యే ఔషధాల దిగుమతులపై నిషేధాన్ని విధించింది. తయారీ నిబంధనలకు సంబంధించిన పద్ధతులను(జీఎంపీ) పాటించడంలేదన్న కారణంతో ఔషధ దిగుమతులను నిషేధిస్తున్నట్లు యూఎస్‌ఎఫ్‌డీఏ తెలిపిందని సన్ ఫార్మా పేర్కొంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే తగుచర్యలను చేపట్టినట్లు తెలిపింది. ఈ నిషేధంవల్ల నామమాత్ర ప్రభావమే ఉంటుందని వివరించింది. కార్ఖాడీ ప్లాంట్‌లో యాంటీబయోటిక్స్, ఏపీఐలను సన్‌ఫార్మా తయారు చేస్తుంది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈలో సన్ ఫార్మా షేరు 5% పతనమై రూ. 574 వద్ద ముగిసింది.