మూడో రోజూ నష్టాలే
96 పాయింట్ల క్షీణత
25,105కు చేరిన సెన్సెక్స్
రుతుపవనాల ఆలస్యం, ఇరాక్ అంతర్యుద్ధ సంక్షోభం కలగలసి దేశీయంగా సెంటిమెంట్‌ను బలహీనపరచాయి. దీంతో వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్లు నీరసించాయి. సెన్సెక్స్ 96 పాయింట్లు క్షీణించి 25,105 వద్ద నిలవగా, 29 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 7,511 వద్ద ముగిసింది. ఇది రెండు వారాల కనిష్టంకాగా, ఇంతక్రితం జూన్ 5న మాత్రమే సెన్సెక్స్ ఈ స్థాయిలో 25,019 వద్ద ముగిసింది. వెరసి సెన్సెక్స్ మూడు రోజుల్లో 416 పాయింట్లు కోల్పోయింది. కాగా, సెన్సెక్స్ రోజు మొత్తం పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనైంది.
గరిష్టంగా 25,276, కనిష్టంగా 25,056 పాయింట్ల మధ్య కదిలింది. ప్రధానంగా హెల్త్‌కేర్, ఆటో, క్యాపిటల్ గూడ్స్ రంగాలు దాదాపు 1% నష్టపోగా, వినియోగ వస్తు సూచీ 3.5% ఎగసింది. గురువారం రూ. 420 కోట్లకుపైగా విలువైన షేర్లను విక్రయించిన ఎఫ్‌ఐఐలు తాజాగా మరో రూ. 221 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. వర్షాభావంపై భయాలు మార్కెట్‌పై ఉన్నాయి.
26 నుంచి అంజనీ సిమెంట్ ఓపెన్ ఆఫర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంజనీ పోర్ట్‌లాండ్ సిమెంట్‌లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసిన తమిళనాడుకు చెందిన చెట్టినాడ్ సిమెంట్స్ గరిష్టంగా 26 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.10 ముఖ విలువ కలిగిన షేరును రూ.61.75 ధర చెల్లించి గరిష్టంగా 47.81 లక్షల షేర్లను (26 శాతం) కొనడానికి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది.
జూన్ 26న ప్రారంభమయ్యే ఈ ఓపన్ ఆఫర్ జూలై 9తో ముగుస్తుంది. రెండు నెలల క్రితం చెట్టినాడ్ సిమెంట్, అంజనీ సిమెంట్ ప్రమోటర్ అయిన కె.వి.విష్ణు రాజు నుంచి 20.58 శాతం వాటను కోనడంతో చెట్టినాడ్ వాటా 41.16 శాతానికి చేరింది. దీంతో చెట్టినాడ్ సిమెంట్ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. శుక్రవారం అంజనీ సిమెంట్ షేరు రూ. 59.70 వద్ద ముగిసింది.