సాక్షి, అమరావతి: సాధారణంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రముఖ సినీ నటులు, క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి భారీ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. వారు కోరినంత డబ్బులు చెల్లించి మరీ ప్రచారాన్ని చేపడతాయి. ఇక గత సర్కారు ప్రచార ఆర్భాటాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంవోయూల పేరుతో మభ్యపుచ్చింది. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ సహకారం ఉన్నప్పుడు ఇలాంటి కృత్రిమ ప్రచారంతో పనిలేదు.
వచ్చే ఏడాది మార్చిలో విశాఖ వేదికగా నిర్వహించనున్న అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన దిగ్గజ సంస్థలే ప్రచారకర్తలుగా నిలవనున్నాయి. ఆయా యూనిట్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా పరిశ్రమలు నెలకొల్పిన దిగ్గజాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు నూతన పెట్టుబడులను రప్పించేందుకు చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
పునాది సమయంలోనే విస్తరణ ప్రణాళికలు..
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాన్ని మెచ్చి దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఆదిత్య బిర్లా, టాటా, ఐటీసీ, టెక్ మహీంద్రా, డిక్సన్, సెంచురీ ప్లై, అపాచీ ఫుట్‌వేర్, ఏటీజీ టైర్స్, రామ్‌కో, శ్రీ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్, అరబిందో, బ్లూస్టార్, హావెల్స్ లాంటి పలు సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. ఆదిత్య బిర్లా, ఐటీసీ గత ఏడాది కాలంలో రాష్ట్రంలో రెండేసి యూనిట్లు ఏర్పాటు చేయడమే కాకుండా విస్తరణ కార్యక్రమాలను కూడా చేపడుతున్నాయి.
ఏటీజీ టైర్స్, సెంచురీ ప్లైవుడ్స్ లాంటి సంస్థలైతే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తున్న వేగాన్ని చూసి పునాది సమయంలోనే విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలకు నిదర్శనం. పూర్తిగా పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో వరుసగా మూడో ఏడాది ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం ఇందుకు తార్కాణం. ఇటీవల రాష్ట్రంలో వివిధ యూనిట్ల ప్రారంభం, శంకుస్థాపన సందర్భంగా ఆయా సంస్థలు ఏమన్నాయో చూద్దాం..
రెండు నెలల్లో రెండు యూనిట్లు
ఏపీ కొత్తగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూపు రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేయడమే దీనికి నిదర్శనం. రెండు నెలల క్రితం వైఎస్‌ఆర్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్‌కు భూమి పూజ చేశాం. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్‌సోడా యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. మా గ్రూపు సంస్థలకు ఆంధ్రప్రదేశ్ చాలా కీలకం. ఇప్పటికే ఆరు వ్యాపారాలకు సంబంధించి రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాం. వీటి ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే సత్తా రాష్ట్రానికి ఉంది.
– బలభద్రపురంలో క్లోర్ అల్కాలి (కాస్టిక్ సోడా) యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా
అర నిమిషంలోనే ఒప్పించారు..
మే నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి 30 సెకన్లు మాత్రమే మాట్లాను. ఎమర్జింగ్ టెక్నాలజీని ఏపీకి తేవడంలో సహకరించాలని సీఎం కోరారు. ఈ సందర్భంగా మా అబ్బాయి బయోఇథనాల్ ప్లాంట్ స్థాపనకు వివిధ రాష్ట్రాలను పరిశీలిస్తున్న విషయం చెప్పా. ఎక్కడో ఎందుకు? మా రాష్ట్రంలో పెట్టండి అని సీఎం ఆహ్వానించారు. ఏపీలో బయో ఇథనాల్ పాలసీ లేదని ఆయన దృష్టికి తేవడంతో యూనిట్ ప్రారంభమయ్యే సరికి రూపొందిస్తామని భరోసా ఇచ్చారు. ఇది జరిగిన ఆరు నెలల్లోనే రాజమహేంద్రవరంలో యూనిట్‌కు శంకుస్థాపన చేశాం. ఇలా మా అబ్బాయి ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం గర్వకారణంగా ఉంది.
– అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ప్రారంభోత్సవ సభలో సీపీ గుర్నానీ, సీఈవో, టెక్ మహీంద్రా
పెట్టుబడుల ఆకర్షణలో ఫస్ట్
దేశ జీడీపీ వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటమే కాకుండా అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రంగా రికార్డు సృష్టిస్తోంది. సామాజిక ఆర్థికాభివృద్ధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలు చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇటీవల గుంటూరులో వెల్‌కమ్ ఫైవ్‌స్టార్ హోటల్‌ను శరవేగంగా ప్రారంభించాం. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల పార్క్‌ను ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ పరిశీలిస్తుంటే సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం ఎటువంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు.
– యడ్లపాడులో ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ పార్క్ ప్రారంభోత్సవ సదస్సులో సంస్థ సీఈవో సంజయ్ పూరి
అత్యుత్తమ ఈఎంసీ కొప్పర్తి
కేవలం తొమ్మిది నెలల్లోనే అభివృద్ధి చేసిన వైఎస్‌ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ దేశంలోనే అత్యుత్తమ ఈఎంసీగా నిలుస్తుంది. ఇక్కడి యూనిట్ ద్వారా శామ్‌సంగ్, బాష్, షావోమి లాంటి పలు ప్రముఖ సంస్థలకు చెందిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉత్పత్తి చేస్తాం. రావాలి జగన్.. కావాలి జగన్.. అనే నినాదం రాష్ట్రమంతా మారుమోగింది. ఇప్పుడు ఆ నినాదం జగన్ వచ్చారు... అభివృద్ధి తెచ్చారుగా మారింది
– కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ యూనిట్ భూమిపూజ కార్యక్రమంలో డిక్సన్ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్‌శర్మ
రూ.6 వేల కోట్ల నుంచి రూ.26 వేల కోట్లకు..
తొలుత తమిళనాడులో యూనిట్ ఏర్పాటు చేయాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వైఎస్సార్ జిల్లా బద్వేల్‌లో యూనిట్ నెలకొల్పుతున్నాం. పెట్టుబడుల ప్రతిపాదనలు అందచేసిన రెండు నెలల్లోనే అన్ని అనుమతులను వేగంగా మంజూరు చేశారు. ప్రభుత్వ సహకారాన్ని చూశాక రూ.6,000 కోట్ల పెట్టుబడులను రూ.26,000 కోట్లకు పెంచాలని నిర్ణయించుకున్నాం.
– బద్వేల్‌లో సెంచురీ ఫ్లైవుడ్ కంపెనీ చైర్మన్ సజ్జన్ భజాంక
పారిశ్రామికవేత్తల మనోగతమే మాకు బ్రాండింగ్
రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రత్యేకంగా బ్రాండింగ్ అవసరం లేదు. ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న ప్రజాదరణే అతి పెద్ద బ్రాండింగ్. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న దిగ్గజ సంస్థల అభిప్రాయాలనే వచ్చే మార్చిలో విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు బ్రాండింగ్‌గా వినియోగించుకుంటాం. 100 శాతం పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మూడేళ్లుగా మొదటి స్థానంలో నిలవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం.
– గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment