సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డేటా సెంటర్, ఐటీ పార్కుల అభివృద్ధి కోసం అదానీ గ్రూపు రూ.21,844 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. మొత్తం 300 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌తో పాటు బిజినెస్ ఐటీ పార్కు, స్కిల్ కాలేజీ, రిక్రియేషన్ సెంటర్లను అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖపట్నంలోని మధురవాడ సమీపంలో కాపులుప్పాడ వద్ద ఎకరం కోటి రూపాయలు చొప్పున 190.29 ఎకరాలను కేటాయించింది.
ఈ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా 39,815 మందికి ఉపాధి లభించనుంది. తొలుత 130 ఎకరాల్లో 200 మెగావాట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఈ సంస్థ ఆ తర్వాత మరో 100 మెగావాట్ల డేటా సెంటర్‌ను ఏర్పాటుచేయడానికి సంసిద్ధత వ్యక్తంచేసింది. దీంతో మరో 60.29 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రాజెక్టు కోసం అదానీ గ్రూపు విశాఖ టెక్ పార్క్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటుచేసింది. మే 3న అదానీ గ్రూపు అధికారుల సమక్షంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డేటా సెంటర్ నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నారు.
ఏడేళ్లలో 39,815 మందికి ఉద్యోగాలు
ఉద్యోగాల కల్పన ఆధారంగానే రాయితీలు, ప్రోత్సాహకాలను ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వీటీపీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం ఐదు దశల్లో ప్రాజెక్టును ఏడు సంవత్సరాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా 39,815 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తామని వీటిపీఎల్ సమర్పించిన ప్రాజెక్టు రిపోర్టులో పేర్కొంది.
తొలిదశ మూడేళ్ల కాలంలో కనీసం 40 మోగావాట్ల డేటా సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు 30 శాతం మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. నాలుగేళ్లల్లో 50 శాతం మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఏడేళ్లలో పూర్తిగా అందరికీ ఉపాధి కల్పించాల్సి ఉంటుంది.
300 మోగావాట్ల డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా 1,860 మందికి ఉపాధి లభించనుండగా, ఐటీ బిజినెస్ పార్క్ ద్వారా 32,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. అలాగే, స్కిల్‌కాలేజీ, రిక్రియేషన్ సెంటర్స్ ద్వారా మరో 3,000 మంది వరకు ఉపాధి లభించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలుత కేటాయించిన 130 ఎకరాల్లో 82 ఎకరాలు డేటా సెంటర్‌కు, ఐటీ బిజినెస్ పార్కుకు 28 ఎకరాలు, స్కిల్ కేలాజీకి 11 ఎకరాలు, రిక్రియేషన్ సెంటర్‌కు 9 ఎకరాలను కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment