కె.జి.రాఘవేంద్రారెడ్డి– సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మన దైనందిన జీవితంలో ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం ప్రతీ రోజూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 మిలియన్ టెరాబైట్స్ డేటాను సృష్టిస్తున్నాం. దీనిని భద్రపరచడానికి ఉపయోగపడే ప్రత్యేకమైన కేంద్రాలే డేటా సెంటర్లు. ఇంటర్నెట్ ద్వారా సమాచార సేవలు నిరంతరాయంగా అందాలంటే డేటా సెంటర్లే కీలకం. అటువంటి డేటా సెంటర్లకు ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ కేంద్రంగా మారుతోంది.
ఇప్పటికే డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (నిక్సీ) ప్రకటించింది. ఇక ఏకంగా రూ. 21,844 కోట్ల పెట్టుబడితో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుతో రాష్ట్ర ఇంటర్నెట్ అవసరాలకు విశాఖ కేంద్రంగా మారనుంది. తద్వారా ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ కేంద్రాల కోసం ముంబై, చెన్నై, హైదరాబాద్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండానే విశాఖ డేటా కేంద్రాలు స్థానిక అవసరాలను తీర్చనున్నాయి.
సింగపూర్ నుంచి ఓఎఫ్‌సీ
డేటా సెంటర్లలో ఇంటర్నెట్ డేటాను భద్రపరిచేందుకు ప్రత్యేకంగా ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల (ఓఎఫ్‌సీ)ద్వారా సమాచారాన్ని సేకరించడం జరుగుతోంది. ఇందుకోసం కేవలం భూమి మీదనే కాకుండా.. సముద్రగర్భం నుంచి వేస్తున్న ఓఎఫ్‌సీనే కీలకం. ఒక అంచనా ప్రకారం సముద్రాల్లో ఏర్పాటు చేసిన 9 లక్షల మైళ్ల ఓఎఫ్‌సీ ద్వారా 95 శాతం డేటా నిత్యం ప్రసారమవుతోంది.
విశాఖలో ఏర్పాటుకానున్న అదానీ డేటా సెంటర్‌కు కూడా సింగపూర్ నుంచి సముద్రగర్భం ద్వారా వేస్తున్న ఓఎఫ్‌సీ ద్వారానే డేటా ప్రసారం కానుంది. 200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అదానీ డేటా సెంటర్‌తో ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్స్‌కు కూడా ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఇంటర్నెట్ సేవల్లో వేగం పెంచడం, స్థానిక అవసరాలను తీర్చడం కోసం ఇప్పటికే డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్టు నిక్సీ ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించింది.
అమెరికా వర్సెస్ చైనా...!
ప్రపంచవ్యాప్తంగా డేటా కేంద్రాల ఏర్పాటు విషయంలో చైనా ముందంజలో ఉంది. అయితే, సముద్రగర్భంలో ఏర్పాటు చేస్తున్న ఓఎఫ్‌సీ విషయంలో మాత్రం అమెరికా సంస్థల పెత్తనం ఉంటోంది. తాజాగా ఆసియా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలను కలుపుతూ సింగపూర్ టు ఫ్రాన్స్ వరకూ ఏర్పాటవుతున్న ఓఎఫ్‌సీ పనులను కూడా అమెరికాకు చెందిన సబ్‌కామ్ కన్సార్టియం దక్కించుకుంది. ఈ సముద్రగర్భంలో ఏర్పాటు చేస్తున్న ఓఎఫ్‌సీలోనూ పైచేయి సాధించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి.
తాజాగా చైనా చేసిన ప్రయత్నాలు అమెరికా ఎత్తులతో చిత్తయ్యాయి. ఇక రానున్న రోజుల్లో ఈ సముద్రగర్భ ఓఎఫ్‌సీ మార్కెట్‌లో భారత్ సంస్థలూ పోటీ పడనున్నాయి. ఈ మార్కెట్‌లోకి రిలయన్స్, అదానీ వంటి సంస్థలు అడుగుపెట్టాయి. అందులో భాగంగా సింగపూర్ నుంచి విశాఖకు ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను అదానీ సంస్థనే వేసుకోనుండటం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా టాప్–10 డేటా సెంటర్లు...
ప్రపంచవ్యాప్తంగా టాప్–10 డేటా సెంటర్లలో ప్రధానంగా చైనా, అమెరికా, బ్రిటన్ సంస్థలే ఉన్నాయి. అయితే, 0.9 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో బెంగళూరులో ఉన్న తులిప్ డేటా సెంటర్ 13వ స్థానంలో ఉంది. టాప్–10 డేటా కేంద్రాలివే...
ఇకపై స్థానికంగానే.!
ఇంటర్నెట్ ఎక్స్చేంజ్‌లు స్థానికంగా లేని కారణంగా పలు సంస్థలకు 40 శాతం అదనపు భారం పడుతోంది. నగర పరిధిలో ఏపీఈపీడీసీఎల్, జీవీఎంసీ, బ్యాంకులు, రైల్వే బుకింగ్ కేంద్రం, వివిధ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు.. బల్క్‌గా డేటాను వినియోగిస్తున్నాయి. అలాగే విశాఖలో.. ఎ–కేటగిరీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు 20, బీ, సీ కేటగిరీ ఐఎస్‌పీలు 60 నుంచి 80 వరకూ ఉన్నాయి.
ఈ సంస్థలన్నీ పెద్ద మొత్తంలో డేటా కొనుగోలు చేస్తున్నాయి. 150 వరకూ ఐటీ కంపెనీలు, 13 వేల ఎంఎస్‌ఎం యూనిట్లకూ డేటా అవసరం ఉంటోంది. డేటా సెంటర్ల ఏర్పాటుతో వీటికి ఇకపై అంతరాయం లేకుండా ఇంటర్నెట్, తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యమైన సేవలు అందనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment