ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి హృదయపూర్వక అభినందనలు. ఆయనను ఎప్పుడు కలిసినా నేను విశాఖకు అదానీ డేటా సెంటర్ ఎప్పుడు వస్తుందని అడుగుతుండేవాడిని. ఆయన దానికి ఇప్పుడు సమాధానం ఇచ్చారు. ఇంత భారీ ఎత్తున డేటా సెంటర్ రావడం అంటే విశాఖనగరం ముఖ చిత్రాన్ని మార్చడమే. దీనికి తోడు భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి శ్రీకారం చుట్టడం కూడా గొప్ప విషయం. ఈ రెండిటికి ఒక రకంగా అనుబంధం ఉంటుంది. ఎందుకంటే..
అదానీ డేటా సెంటర్ లోనే మరో ఐదేళ్లలో 39 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేశారు. స్కిల్ యూనివర్శిటీ, రిక్రియేషన్ పార్క్, ఐటి పార్కు, విమానాశ్రయంలో కార్గో సెంటర్, ఎయిరోసిటీ మొదలైన వాటి ద్వారా మరిన్ని వేల మందికి అవకాశాలు రాబోతున్నాయి. వీరితో పాటే సర్వీస్ రంగం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఇదే సమయంలో సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని కూడా జగన్ ప్రకటించారు. అంటే విశాఖ సిగలో ఈ పరిపాలన రాజధాని మరో ఆభరణం అవుతుంది. ఈ రకంగా తెలంగాణ రాజదాని హైదరాబాద్ కు విశాఖ అతి త్వరలోనే పెద్ద పోటీ కాబోతోంది. ఐటీ రంగంలో విశాఖ ఒక్కసారిగా పుంజుకునే అవకాశం ఉంది. వైజాగ్ ఇప్పటికే మల్టీకల్చరల్ నగరంగా ఉంది. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఎప్పటినుంచో ఇక్కడ నివసిస్తున్నారు. ఏపీకి సంబంధించి కూడా పలు ప్రాంతాల ప్రజలు స్థిరపడ్డారు. ఈ దశలో ఈ అభివృద్ది అంతా జరిగితే విశాఖకే కాదు.. ఉత్తరాంధ్ర ప్రజల పంట పడుతుంది.
👉 ముఖ్యమంత్రి జగన్ అన్నట్లు ఈ ప్రాంతం నుంచి వలసలు కూడా బాగా తగ్గిపోతాయి. విశాఖకు సహజమైన కొన్ని సానుకూలతలు ఉన్నాయి. ఒక వైపు సముద్ర తీరం, మరో వైపు విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి , అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రాంతంలో నగరం విస్తరణకు ఎనలేని అవకాశం ఉండడం బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంద్ర ప్రాంతాన్ని, ఈ కొత్త ప్రాజెక్టులకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అదానీ డేటా సెంటర్‌ను తీసుకు రావడానికి ఆయన విశేష కృషి చేశారు. రాజకీయంగా తన పలుకుబడిని సైలెంట్ గా ఉపయోగించారు. వారికి అవసరమైన భూమిని కేటాయించడానికి అన్ని చర్యలు తీసుకున్నారు.
👉 తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే మీడియా ఆదాని డేటా సెంటర్ పై ఎంత విష ప్రచారం చేసినా, తాను అనుకున్న లక్ష్యం ప్రకారం ముందుకు వెళ్లారు సీఎం జగన్. దీనిని రాకుండా చేయడానికి జరిపిన ప్రయత్నాలు విఫలం అవడంతో తెలుగుదేశం మీడియా కొత్త రాగం అందుకుంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడో శంకుస్థాపన చేసిందని ప్రచారం ఆరంభించారు. అప్పుడు అదానీ గొప్పవాడయ్యాడు. అదే జగన్ టైమ్ లో అదానీ ముందుకు వస్తే ఎంత నీచ ప్రచారం చేశారో గమనిస్తే ఈ మీడియాలపై చీదర వేస్తుంది.
👉 నిజానికి గత ఎన్నికలకు ఒకటి, రెండు నెలల ముందు హడావుడిగా ఎలాంటి ఏర్పాట్లు లేకుండా శంకుస్థాపన చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూశారు. చంద్రబాబుకు ఇలా చేయడం కొత్తకాదు. అది వేరే విషయం. భోగాపురం ఎయిర్ పోర్టు, కడప స్టీల్ వంటివాటిని కూడా అలాగే చేశారు. కాని వాటన్నింటిని ఉత్తిత్తి వ్యవహారంగానే మిగిల్చారు. జగన్ ప్రభుత్వం వచ్చాక భోగాపురం ఎయిర్ పోర్టుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. నిర్వాసితులకు పునరావాస ఏర్పాట్లు చేశారు. పర్యావరణ తదితర కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన అనుమతులను సాధించారు. ఇవన్ని పూర్తి అయిన తర్వాతే జగన్ శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు.
👉 అంతేకాక ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్న గ్రంధి మల్లిఖార్జున రావు ఈ జిల్లాకే చెందినవారు కావడం అదనంగా కలిసి వచ్చే విషయం. ఆయన కూడా చాలా సంతోషంగా కనిపించారు. ముఖ్యమంత్రి కోరినట్లు ఆరు నెలల నుంచి ఏడాది ముందుగా ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ఇక్కడ జరిగిన సభలో జగన్ మాట్లాడిన తీరు ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని స్పష్టంగా మరోసారి తెలియచేస్తుంది. 2026లో తానే వచ్చి మళ్లీ ఎయిర్ పోర్టును ప్రారంబిస్తానని ఆయన ప్రకటించారు. అంటే దాని అర్దం 2024 ఎన్నికలలో తిరిగి వైసిపి గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారన్నమాట.
👉 యధాప్రకారం ఆయన తాను మంచి చేశానని అనుకుంటే ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ రకంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చెప్పడానికి సాహసించలేదు. అది ఒక్క జగన్ వల్లే అయింది. ఇక్కడ మరో సంగతి చూడాలి.. ఆదానీ డేటా సెంటర్ కాని, ఇతరత్రా స్కిల్ యూనివర్శిటీ వంటి ఆయా అభివృద్ది కార్యక్రమాలను విశాఖలో చేపట్టడం వల్ల అవి వేగంగా పూర్తి అయ్యే అవకాశం వస్తుంది. అదే అమరావతి గ్రామాలలో ఏర్పాటు చేయవలసి వస్తే ఎన్నో సమస్యలు ఎదురయ్యేవి. విశాఖలో చాలా వరకు ప్రాధమిక సదుపాయాలు ఉన్నాయి. అమరావతి గ్రామాలలో సరైన రోడ్లు కూడా లేవు. కొత్తగా పరిశ్రమలు, ఇతర సంస్థలు రావాలంటే ఔత్సాహికులు వెనుకంజ వేసే అవకాశం ఉంది.
👉 అమరావతిని రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చి ఎకరా భూమి ని నాలుగు కోట్ల వరకు తీసుకువెళ్లారు. దీనివల్ల కొత్తగా ఎవరైనా సంస్థలు పెట్టాలంటే చాలా వ్యయం చేయవలసి వస్తుంది. వారికి గిట్టుబాటు కాని పరిస్థితి ఎదురు అవుతుంది. గత ప్రభుత్వం ఎంపిక చేసుకున్న ప్రదేశంలో ప్రభుత్వ భూములు లేవు. అటవీ భూములు ఉన్నా వాటిని వాడుకోవడానికి ఎంతో కాలం పడుతుంది. ఎన్నో వ్యయప్రయాసలకు గురి కావల్సి ఉంటుంది. వీటిని గుర్తించకుండా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకపక్షంగా ముందుకు వెళ్లారు. పోనీ ఏవైనా నిర్మాణాలు చేశారా అంటే అంతా తాత్కాలికం అన్నారు. తద్వారా వందల కోట్ల రూపాయల నిదులను దుర్వినయోగం చేయడానికి సిద్దమయ్యారు.
👉 ఈ నేపధ్యంలో జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. విశాఖకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించారు. హైదరాబాద్ మాదిరి వేగంగా అభివృద్ది చెందడానికి, ఏపీకి గ్రోత్ ఇంజన్ గా మారడానికి విశాఖకు ఉన్న అవకాశాలను ఆయన అంచనావేశారు. ఇప్పటికే విశాఖ ఈ విషయంలో కొంతమేర ఉపయోగపడుతోంది. పరిపాలన రాజధాని అవడం, డేటా సెంటర్, కొత్త ఎయిర్ పోర్టు మొదలైనవన్ని వస్తే హైదరాబాద్ కు గట్టి పోటీ ఇచ్చే నగరంగా విశాఖ తయారవుతుంది. కానీ..
👉 దీనిని అడ్డుకోవడానికి టిడిపి నేతలు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా సంస్థలు విపరీతమైన కృషి చేశాయి. విష ప్రచారంతో ప్రజలలో వ్యతిరేక భావాలు నాటడానికి యత్నించాయి. అయినా జగన్ వారిని ఖాతరు చేయకుండా ముందుకు వెళ్లారు కాబట్టి ఇప్పుడు అవి వాస్తవరూపం దాల్చి విశాఖ రూపురేఖలను మార్చబోతున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పలు ప్రాజెక్టుల విషయంలోను టీడీపీ వర్గాలు ఇలాగే నిత్యం దుష్ప్రచారం చేసినా, ఆయన ఎక్కడా వెనక్కి తగ్గకుండా వ్యవహరించి ప్రజల నుంచి అభినందనలు అందుకున్నారు. అలాగే జగన్ కూడా ఎంతో పట్టుదలతో విశాఖ అభివృద్దిని కార్యరూపంలోకి తెచ్చి శెబాష్ అనిపించుకుంటున్నారు. ఎంతైనా రాజశేఖరరెడ్డి కుమారుడు కదా.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్
ఇదీ చదవండి: భగవంతుడి నిర్ణయమో తెలియదుగానీ..
Comments
Please login to add a commentAdd a comment