
సాక్షి, అమరావతి: మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలో ఆరుగురు అధికారులతో కూడిన బృందం ఈనెల 15 నుంచి 25 వరకు దక్షిణ కొరియా, వియత్నాం దేశాల్లో పర్యటించనుంది. అక్కడ ప్రముఖ సంస్థలను సందర్శించి.. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించనుంది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, స్కిల్ డెవలప్‌మెంట్ ముఖ్య కార్యదర్శి వినోద్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు అధికారులు ఈ పర్యటనలో పాల్గొంటారు.
మంత్రి బుగ్గన ఈ నెల 10న ఢిల్లీలో దక్షిణ కొరియా, వియత్నాం రాయబారులతో సమావేశమై పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చించారు. దీనికి కొనసాగింపుగా ఏపీ బృందం కొరియాలోని కియా పరిశ్రమను సందర్శించి ఏపీలోని యూనిట్‌ను మ రింతగా విస్తరించడానికి గల అవకాశాలను వివరిస్తా రు. శామ్‌సంగ్, దేసాంగ్ కార్పొరేషన్‌లతో పాటు కొరియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ అండ్ ఫిష రీస్ టెక్నాలజీలను ఈ బృందం సందర్శించనుంది.
విశాఖలో జరిగిన జీఐఎస్‌లో వియత్నాం ప్రతినిధులతో సమావేశమై పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. దీనికి కొనసాగింపుగా తాజా పర్యటనలో ఆ దేశ పారిశ్రామికవేత్తలతో సమావేశమవ్వనున్నారు. వియత్నాంలోని సౌత్ ఎకనామిక్ జోన్‌ను సందర్శించనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ముఖ్య కార్యదర్శి వినోద్‌కుమార్ మాట్లాడుతూ..పరిశ్రమలు, టెక్స్‌టై ల్స్, ఆక్వా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు అక్కడ పాటిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పరిశీలించనున్నట్లు ‘సాక్షి’కి తెలిపారు.