ఒక్క ఫోన్‌ చాలు 'సమస్యలన్నీ పరిష్కారం'.. | CM YS Jagan assured industrial representatives | Sakshi
Sakshi News home page

ఒక్క ఫోన్‌ చాలు 'సమస్యలన్నీ పరిష్కారం'..

Published Thu, Nov 30 2023 4:15 AM | Last Updated on Thu, Nov 30 2023 4:15 AM

CM YS Jagan assured industrial representatives - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా అన్ని రకా­లుగా చేయి పట్టుకుని నడిపిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలి­పారు. పారిశ్రామికవేత్తల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం కేవలం ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలోనే ఉందని గుర్తు చేశారు. విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో కుదిరిన ఒప్పందా­లను క్రమం తప్పకుండా సమీక్షిస్తూ త్వరితగతిన అమల్లోకి తెస్తున్నామని, ఇందుకోసం కృషి చేస్తున్న అధికారులకు అభినందనలు తెలియ­చేస్తు­న్నట్లు పేర్కొన్నారు.

అత్యధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలను విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,100 కోట్ల విలువైన తొమ్మిది ప్రాజెక్టులకు బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించి మాట్లాడారు. ఆ వివరాలివీ..

విశాఖ ఒప్పందాలు వేగంగా సాకారం..
పారిశ్రామిక రంగంపై ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ, పుడ్‌ ప్రాసెసింగ్‌ సెక్టార్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. జిల్లా స్ధాయిలో కలెక్టర్లు కూడా దీనిపై దృష్టి సారించి పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలి. విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో 386 ఎంవోయూలు చేసుకున్నాం. వీటి ద్వారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులతోపాటు ఆరు లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నాం. ఇవన్నీ సాకారమయ్యేలా నిరంతరం సమీక్షిస్తూ పురోగతి కోసం చర్యలు తీసుకున్నాం.

ఇందులో 33 యూనిట్లు ఇప్పటికే ఏర్పాటై ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. మరో 94 ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మిగిలిన వాటి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో మరింత పురోగతి సాధించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలకు చేయూతనిస్తున్నాం. నెలకు కనీసం రెండు సమీక్షా సమావేశాలు నిర్వహించడం ద్వారా వీటన్నింటినీ వేగంగా కార్యరూపంలోకి తెస్తున్నాం. కలెక్టర్లు కూడా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకుని నడిపిస్తూ దీన్ని మరింత వేగవంతం చేయాలి. 

ఎంఎస్‌ఎఈలతో 12.62 లక్షల మందికి ఉపాధి
ఈ నాలుగున్నర సంవత్సరాల్లో 130 భారీ, అతిభారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయగలిగాం. వీటి ద్వారా దాదాపు రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 86 వేలమందికి ఉద్యోగాలు కూడా ఇవ్వగలిగాం. ఎంఎస్‌ఎంఈ రంగంలో ఎప్పుడూ చూడని విధంగా అడుగులు వేశాం. కోవిడ్‌ సమయంలో ఎక్కడా, ఎవరూ కుప్పకూలిపోకుండా వారికి చేయూతనిచ్చాం. గత నాలుగున్నరేళ్లలో దాదాపు 1.88 లక్షల ఎంఎస్‌ఎంఈలు కొత్తగా వచ్చాయి.

వీటి ద్వారా 12.62 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. అందరం కలసికట్టుగా  బాధ్యత తీసుకున్నాం కాబట్టే ఇది సాకారమైంది. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా మనం కేవలం ఒక ఫోన్‌ కాల్‌ దూరంలోనే ఉన్నామనే మెస్సేజ్‌ను ఎంత సానుకూలంగా తీసుకెళ్లగలిగితే అంత ఉత్సాహంగా ముందుకొస్తారు. ఇది కచ్చితంగా నా దగ్గర నుంచి మొదలుకుని మీ వరకు ఇదే  రకమైన తత్వాన్ని అలవరచుకోవాలి. 

రూ.1,100 కోట్ల పెట్టుబడులకు శ్రీకారం
పరిశ్రమలు–వాణిజ్యశాఖ, పుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలలో ఇవాళ తొమ్మిది ప్రాజెక్టులు చేపడుతున్నాం. దాదాపు రూ.1,100 కోట్ల పెట్టుబడితో 21,744 మందికి  ఉద్యోగాలు లభించేలా మంచి అడుగు పడుతోంది. మూడు ప్రాజెక్టులకు  ప్రారంభోత్సవం, మిగిలిన ఆరు ప్రాజెక్టులకు శంకుస్ధాపన నిర్వహిస్తున్నాం. కొద్ది రోజుల క్రితం నేను పత్తికొండ వెళ్లినప్పుడు టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు దిశగా అడుగులు వేయమని చెప్పా. కొద్ది కాలంలోనే అది అధికారుల కృషితో కార్యరూపం దాల్చి శంకుస్ధాపన దశకు వచ్చింది.

రూ.12 కోట్ల పెట్టుబడితో టమోటా పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు పత్తికొండలో శంకుస్ధాపన నిర్వహిస్తున్నాం. ఇదే మాదిరిగా  ప్రతి ఒక్కరూ అంతే వేగంగా అడుగులు ముందుకేయాలి. ఇవాళ శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను జరుపుకొంటున్న తొమ్మిది యూనిట్లకు శుభాభినందనలు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ పరిశ్రమలు, పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ప్రతినిధులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మీ అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా.

హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు, కంపెనీల ప్రతినిధులు
ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్, వ్యవసాయం, పుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్‌. యువరాజ్, పుడ్‌ ప్రాసెసింగ్‌ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ ప్రవీణ్‌కుమార్, హ్యాండ్‌లూమ్స్, టెక్టŠస్‌టైల్స్‌ కమిషనర్‌ ఎంఎం నాయక్,  పరిశ్రమలశాఖ కమిషనర్‌ సీహెచ్‌ రాజేశ్వరరెడ్డి,  ఉన్నతాధికారులు, పరిశ్రమలు, పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో శంకుస్థాపనలు, ప్రారంభించిన యూనిట్లు
1.ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు ముత్తుకూరు మండలం దొరువులపాలెంలో రూ.250 కోట్లతో గోకుల్‌ ఆగ్రో రిసోర్సెస్‌ లిమిటెడ్‌ సంస్ధ ఆధ్వర్యంలో ఎడిబుల్‌ ఆయిల్‌ రిఫైనరీ ప్లాంట్‌ ప్రారంభం. దీని ద్వారా 1,150 మందికి ఉద్యోగాలు. ఏటా 4.2 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి దీని సామర్ధ్యం.

2. రూ.144 కోట్లతో శ్రీవేంకటేశ్వర బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమ పనులకు  శంకుస్థాపన. ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం కొమ్మూరు గ్రామం వద్ద ఏర్పాటయ్యే ఈ మొక్కజొన్న ఆధారిత పరిశ్రమ ద్వారా 310 మందికి ఉద్యోగావకాశాలు. ఏడాదికి 90 వేల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి. దీని ద్వారా వేలమంది రైతులకు ప్రయోజనం.

3. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ వద్ద రూ.13 కోట్లతో బ్లూఫిన్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ కంపెనీకి శంకుస్థాపన. దీనిద్వారా 45 మందికి ఉద్యోగావకాశాలు. 3,600 మెట్రిక్‌ టన్నుల గోధుమలు, 480 టన్నుల మిల్లెట్స్, 720 మెట్రిక్‌ టన్నుల పొటాటో ఉత్పత్తులు తయారు చేసే ఈ కంపెనీ ఏర్పాటుతో స్థానిక రైతులకు లబ్ధి.

4. కర్నూలు జిల్లా పత్తికొండ వద్ద టామాటో ప్రాసెసింగ్‌ యూనిట్‌ పనులకు  శంకుస్థాపన. రూ.12 కోట్ల పెట్టుబడితో ఏటా 3,600 మెట్రిక్‌ టన్నుల టమాటా ఉత్పత్తుల తయారీ. ఈ ప్రాజెక్టును పత్తికొండ వెజిటబుల్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌కు అప్పగించనున్న ప్రభుత్వం. వారి ద్వారా లీజు ప్రాతిపదికన మంచి సమర్థత కలిగిన కంపెనీకి అప్పగించేలా సహకారం. పత్తికొండలో రైతులకు భారీ ప్రయోజనం. టమాటా ధరల స్థిరీకరణకు దోహదం చేయనున్న 
పరిశ్రమ. 

5. విజయనగరం జిల్లా ఎల్‌.కోట మండలం రేగ పంచాయతీ పెద్దిరెడ్లపాలెం వద్ద నువ్వుల ప్రాసెసింగ్‌ యూనిట్‌కు ప్రారంభోత్సవం. ప్లాంట్‌ను నెలకొల్పిన ఏపీఎఫ్‌పీఎస్‌. ఎల్‌.కోట జైకిసాన్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌కు ప్లాంట్‌ను అప్పగించిన ప్రభుత్వం. నువ్వుల నూనె, చిక్కీ ఉత్పత్తుల తయారీ. రూ.2.5 కోట్ల పెట్టుబడితో 20 మందికి ఉద్యోగాలు. ఏడాదికి 600 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి కలిగిన ఈ యూనిట్‌తో స్థానిక రైతులకు ప్రయోజనం. 

పరిశ్రమల శాఖలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇలా
1. కర్నూలు జిల్లా ఓర్వకల్లు నోడ్‌ గొట్టిపాడు వద్ద సిగాచి ఇండస్ట్రీస్‌ ఫార్మా (ఏపీఐ) యూనిట్‌కు శంకుస్థాపన. రూ.280 కోట్ల పెట్టుబడితో 850 మందికి ఉద్యోగాలు. ఏడాదికి 72 వేల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి.

2.    కర్నూలు జిల్లా ఓర్వకల్‌ నోడ్‌ గొట్టిపాడు వద్ద న్యూట్రాస్యూటికల్స్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న ఆర్‌పీఎస్‌ ఇండస్ట్రీస్‌. పనులకు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన. రూ.90 కోట్ల పెట్టుబడితో 285 మందికి ఉద్యోగాలు. ఏడాదికి 4,170 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి.

3.    పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 18 జిల్లాల్లో 21 ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులకు, ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లకు సీఎం ప్రారంభోత్సవాలు, మరికొన్ని చోట్ల పనులకు శంకుస్ధాపనలు. కాంప్లెక్స్‌ ద్వారా రూ.1,785 కోట్ల పెట్టుడులకు అవకాశం. తద్వారా 18,034 మందికి ఉద్యోగాలు.

4.    కాకినాడ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ ప్రింటింగ్‌ క్లస్టర్‌లో కామన్‌ ఫెసిలిటీ సెంటర్లను ప్రారంభించిన సీఎం జగన్‌. ఈ సెంటర్లలో 1,000 మందికి ఉద్యోగాలు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement