సోమవారం రక్షా బంధన్ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు రాఖీ కడుతున్న పారిశుధ్య కార్మికులు
సాక్షి, అమరావతి: మహిళల స్వయం సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వారి జీవితాలను మార్చే క్రమంలో ఇటీవలే గుజరాత్‌కు చెందిన అమూల్‌తో ఒప్పందం చేసుకోగా.. తాజాగా సోమవారం మరో నాలుగు ప్రఖ్యాత కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఈనెల 12న ‘వైఎస్సార్ చేయూత’ను సర్కారు ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ ఒప్పందాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఇచ్చే తోడ్పాటును మహిళలందరూ సద్వినియోగం చేసుకునేలా ఈ కంపెనీలు సహకరిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారా ఈ కంపెనీలు వారికి తోడ్పాటునందిస్తాయి. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గాంబిల్ కంపెనీలతో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలను చేసుకుంది. సెర్ప్ సీఈఓ రాజాబాబు, ఆయా కంపెనీల ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
– అణగారిన వర్గాల వారికి చేయూతనివ్వకుండా, వారి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేయకుండా ఎలాంటి మార్పులను తీసుకురాలేం. అలాగే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయకుండా ఎలాంటి ఫలితాలు సాధించలేం.
– అందుకే మా ప్రభుత్వం మహిళా సాధికారతపై దృష్టిపెట్టింది. వారి జీవితాలను మార్చేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం.
– ఇందులో భాగంగా ఈనెల 12న ‘వైఎస్సార్ చేయూత’ను ప్రారంభిస్తున్నాం.
– దీని ద్వారా రూ.4,500 కోట్లను మహిళలకు అందజేస్తాం.
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45–60 ఏళ్లలోపు అర్హత ఉన్న మహిళలకు ఈ ‘చేయూత’ను అందిస్తున్నాం.
– దీనికింద ఎంపికైన మహిళలకు ఏటా రూ.18,750లు చొప్పున నాలుగేళ్లలో రూ.75వేల ఇస్తాం.
– చేయూత పథకం అందుకుంటున్న మహిళల్లో చాలామందికి ‘వైఎస్సార్ ఆసరా’ కూడా వర్తిస్తుంది.
– ఏటా దాదాపు రూ.6,700 కోట్లను ‘ఆసరా’ కింద ఇస్తాం. సెప్టెంబరులో దీనిని కూడా అమలుచేస్తాం.
– ఇలా ఈ రెండు పథకాలకు ఏటా రూ.11వేల కోట్ల చొప్పున నాలుగేళ్లపాటు రూ.44వేల కోట్లను దాదాపుగా కోటి మంది మహిళల చేతికి ఇస్తున్నాం.
– ఈ సహాయం.. వారికి స్థిరమైన ఉపాధి, ఆదాయం ఇచ్చేదిగా ఉండాలి.
– ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, మహిళల జీవితాలను మారుస్తుంది.
– ప్రభుత్వం చేయూతనిస్తుంది.. బ్యాంకు రుణాలకు గ్యారంటీ ఇస్తుంది.
– మహిళల స్వయం సాధికారత కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రఖ్యాత కంపెనీలైన హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గాంబిల్ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలను చేసుకుంది.
– ఈ కంపెనీలన్నీ ముందుకు వచ్చి మహిళలు వారి కాళ్లమీద వాళ్లు నిలబడగలిగేలా సహకారం అందించాలి.
అనంతరం ఆయా కంపెనీల ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
సీఎం అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాం
మహిళలు సాధికారిత సాధించడం అంటే.. కుటుంబం వృద్ధిలోకి వస్తున్నట్లే. ముఖ్యమంత్రి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మాకు చాలా ముఖ్యమైనది. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం సంతోషకరం. మహిళలకు చేయూతనిచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. చేయూత పథకం మైలురాయిగా నిలిచిపోతుంది. సమగ్రాభివృద్ధి కోసం సీఎం చేస్తున్న ప్రయత్నాలు ముందుకుసాగాలని ఆకాంక్షిస్తున్నాం.
– సంజీవ్ మెహతా, హెచ్‌యూఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్
ఏడాదిలో సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలు
ఏడాది కాలంగా సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలను తీసుకువచ్చారు. ఆర్థిక సామాజిక రంగాల్లో ఈ సంస్కరణలు పెనుమార్పులు తీసుకువస్తాయి. మహిళల సాధికారత ద్వారా అభివృద్ధి సాధించాలన్న సీఎం ఆలోచన మంచి మార్పులకు నాంది. వైఎస్సార్ చేయూత కార్యక్రమం పేదరికాన్ని నిర్మూలించడంలో కీలకమైనది. సామాజిక రంగంలో ఏపీ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోంది. మేం కూడా ఆ దిశగా కార్యకలాపాలు చేస్తున్నాం.
– సంజీవ్ పూరి, ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్
సీఎం దార్శినికత బాగుంది
ముఖ్యమంత్రి దార్శినికత బాగుంది. శిక్షణ కార్యక్రమం ద్వారా 20 లక్షల మంది విద్యార్థులకు మా కంపెనీ సహాయ సహకారాలు అందిస్తోంది. వైఎస్సార్ చేయూత పథకం గొప్ప అవకాశాలను కల్పిస్తోంది. మేం భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉంది. మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఈ విషయంలో మా అనుభవాలను పంచుతాం. మీతో కలిసి ముందుకు సాగుతాం.
– మధుసూదన్ గోపాలన్, ప్రోక్టర్ అండ్ గాంబిల్ సీఈఓ, ఎండీ
సీఎం జగన్ సమక్షంలో ఒప్పందాలు
అనంతరం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో సెర్ప్ సీఈఓ రాజాబాబు, ప్రొక్టర్ అండ్ గాంబిల్ సీనియర్ మేనేజర్ జోసెఫ్ వక్కీ, ఐటీసీ డివిజనల్ సీఈఓ రజనీకాంత్ కాయ్, హెచ్‌యూఎల్ జీఎస్‌ఎం చట్ల రామకృష్ణారెడ్డితో వేర్వేరుగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐటీసీ గ్రూప్ హెడ్ సంజీవ్ రాంగ్రాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, వీడియో కాన్ఫరెన్స్‌లో మహ్మద్ అన్సారి, క్లస్టర్ సీఈఓ, ఏపీ–తెలంగాణ.. జెబాఖాన్, వైస్‌ప్రెసిడెంట్, ప్రోక్టర్ అండ్ గాంబిల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment