ఫ్యూచర్, భారతీ రిటైల్ వ్యాపారాల విలీనం | Future Group's retail business to merge with Bharti Retail | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్, భారతీ రిటైల్ వ్యాపారాల విలీనం

Published Tue, May 5 2015 1:54 AM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

ఫ్యూచర్, భారతీ రిటైల్ వ్యాపారాల విలీనం

ఫ్యూచర్, భారతీ రిటైల్ వ్యాపారాల విలీనం

పూర్తిగా షేర్ల రూపంలో ఒప్పందం; విలువ రూ.750 కోట్లు
రూ.15,000 కోట్ల సంస్థగా ఆవిర్భావం...
కిశోర్ బియానీ చేతికే పగ్గాలు...

న్యూఢిల్లీ: దేశీ రిటైల్ రంగంలో మరో కీలకమైన, భారీ విలీనానికి బాటలు పడ్డాయి. కిశోర్ బియానీ సారథ్యంలోని ఫ్యూచర్ గ్రూప్.. తమ రిటైల్ వ్యాపారాన్ని మొత్తం భారతీ గ్రూప్‌నకు చెందిన రిటైల్ బిజినెస్‌తో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. పూర్తిగా షేర్ల మార్పిడి రూపంలో జరగనున్నట్లు ఈ డీల్ విలువ రూ.750 కోట్లుగా అంచనా.

అంతేకాదు విలీనం తర్వాత రూ.15,000 కోట్ల విలువైన టర్నోవర్‌తోపాటు దేశంలోనే అతిపెద్ద రిటైల్ నెట్‌వర్క్ సంస్థల్లో ఒకటిగా కూడా ఆవిర్భవించనుంది. మరోపక్క, విలీన సంస్థపై నియంత్రణ అంతా కిశోర్ బియానీకే దక్కనుంది. కాగా, ఆదిత్య బిర్లా గ్రూప్ తమ బ్రాండెడ్ అపారెల్ వ్యాపారాలన్నింటినీ విలీనం చేసి ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మర్నాడే ఫ్యూచర్, భారతీ ఒప్పందం వెలువడటం గమనార్హం.
 
డీల్ స్వరూపం ఇదీ...
రెండంచెల్లో జరిగే ఈ ఒప్పందం ప్రకారం.. ఫ్యూచర్ గ్రూప్ తమ రిటైల్ వ్యాపారాన్ని విడదీసి భారతీ రిటైల్‌లో విలీనం చేస్తుంది. అదేవిధంగా భారతీ గ్రూప్ కూడా తమ రిటైల్ ఇన్‌ఫ్రా బిజినెన్‌ను విభజించి ఫ్యూచర్ రిటైల్‌లో కలిపేస్తుంది. ఈ విలీనం ద్వారా రెండు ప్రత్యేక కంపెనీలు(రిటైల్, ఇన్‌ఫ్రా) ఆవిర్భవిస్తాయని.. వీటి ఉమ్మడి టర్నోవర్ రూ.15,000 కోట్లుగా ఉంటుందని ఫ్యూచర్ గ్రూప్ సీఈఓ కిశోర్ బియానీ విలేకరులకు తెలిపారు. రెండు విలీన సంస్థల్లో భారతీ రిటైల్‌కు 15 శాతం చొప్పున వాటా లభిస్తుంది. ముందుగా రూ.500 కోట్ల విలువైన షేర్లను... కొంతకాలం తర్వాత షేర్లుగా మార్పిడి చేసుకునేందుకు వీలుండే రూ.250 కోట్ల విలువైన ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్లు(ఓసీడీ) దక్కుతాయి.

డీల్ ప్రకారం  ఫ్యూచర్ రిటైల్ వాటాదారులకు ఒక్కో షేరుకి(రూ.2 ముఖవిలువ)  భారతీ రిటైల్ నుంచి ఒక షేరు(1:1 నిష్పత్తి) కేటాయిస్తారు. ఇదేవిధంగా ఫ్యూచర్ రిటైల్ కూడా భారతీ రిటైల్ షేర్‌హోల్డర్లకు రూ.2 ముఖ విలువగల ఫుల్లీ పెయిడ్-అప్ ఈక్విటీ షేర్లను 1:1 నిష్పత్తిలో జారీ చేస్తుంది. భారతీ రిటైల్ జారీ చేసే షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టవుతాయి. ఇక ఫ్యూచర్ గ్రూప్ ప్రమోటర్లకు రెండు కొత్త సంస్థల్లో 46-47 శాతం చొప్పున వాటా లభిస్తుంది. ఉమ్మడి సంస్థకు మొత్తం 243 నగరాల్లో 570 స్టోర్లు ఉంటాయి.  
 
తాము రిటైల్ బిజినెస్ నుంచి వైదొలగడంలేదని.. ఈ వ్యూహాత్మక విలీనం ద్వారా మరింత వేగంగా వృద్ధి చెందాలన్నదే ఇరు కంపెనీల ప్రణాళిక అని భారతీ ఎంటర్‌ప్రైజెస్ వైస్ చైర్మన్ రాజన్ భారతీ మిట్టల్ చెప్పారు. ఇరు కంపెనీల వాటాదారులు, కస్టమర్లకు ఈ డీల్‌తో మరింత ప్రయోజనం లభిస్తుందన్నారు. కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) ఇతరత్రా నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఈ విలీన ఒప్పందం పూర్తవుతుంది.
 
 
డీల్ నేపథ్యంలో సోమవారం బీఎస్‌ఈలో ఫ్యూచర్ రిటైల్ షేరు ధర 12 శాతంపైగా లాభపడి రూ.130 వద్ద స్థిరపడింది. ఒకానొకదశలో 18 శాతం ఎగసి రూ.137 గరిష్టాన్ని కూడా తాకింది.

 
2021కల్లా 4,000 చిన్న స్టోర్లు: బియానీ
ఈ డీల్ తర్వాత కూడా భారతీ ఈజీడే చైన్ స్టోర్లు, తమ బిగ్‌బజార్ స్టోర్లు యథాతథంగా కార్యకలాపాలను కొనసాగిస్తాయని కిశోర్ బియానీ పేర్కొన్నారు. అయితే, 2021 నాటికి కొత్తగా 4,000 చిన్న స్థాయి రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయాలన్నది తమ ప్రణాళిక అని ఆయన వెల్లడించారు. ఉత్తరాదిలో ఈజీడే పేరుతో, దక్షిణ-పశ్చిమ భారత్‌లో నీల్‌గిరీస్, కేబీ బ్రాండ్‌తో ఈ కొత్త సోర్టు తెరుస్తామని తెలిపారు. వాల్‌మార్ట్‌తో క్యాష్ అండ్ క్యారీ వ్యాపార భాగస్వామ్యం నుంచి బయటికొచ్చేశాక.. పూర్తిస్థాయిలో రిటైల్ వ్యాపారం కోసం భారతీ గ్రూప్ అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా(ప్రధానంగా ఉత్తరాదిన) భారతీ రిటైల్ 210 ఈజీడే స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. ఇక ఫ్యూచర్ గ్రూప్ కూడా తమ ఫ్యాషన్ రిటైల్ చైన్ ప్యాంటలూన్స్‌లో మెజారిటీ వాటాను 2012లో ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు విక్రయించిన తర్వాత వ్యాపారాన్ని స్థిరీకరించే పనిలోపడింది. ప్రస్తుతం బిగ్‌బజార్ పేరుతో హైపర్‌మార్కెట్లు, ఫుడ్‌బజార్ బ్రాండ్‌తో సూపర్‌మార్కెట్లతోపాటు వివిధ ఇతర రిటైల్ ఫార్మాట్లను ఫ్యూచర్ గ్రూప్ నిర్వహిస్తోంది. భారతీ రిటైల్‌కు ప్రస్తుతం రుణభారమేమీలేదు. ఇక కొత్తగా ఏర్పడే రిటైల్ సంస్థకు రూ.1,200 కోట్లు, ఇన్‌ఫ్రా సంస్థకు రూ.3,500 కోట్లు చొప్పున రుణ భారం ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement