ముంబై, సాక్షి: ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందం కారణంగా కార్పొరేట్ దిగ్గజాలు అమెజాన్ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య ఇటీవల తలెత్తిన వివాదాలపై పలువురు ఆసక్తి చూపుతున్నారు. ట్రిలియన్ డాలర్ల(సుమారు రూ. 74 లక్షల కోట్లు) విలువైన దేశీ కన్జూమర్ మార్కెట్ కొద్ది నెలలుగా పలు కార్పొరేట్ దిగ్గజాలను ఆకట్టుకుంటోంది. ఇందుకు అనుగుణంగా రిటైల్ రంగ గ్లోబల్ దిగ్గజం వాల్‌మార్ట్.. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకోవడం ద్వారా కార్యకలాపాలు విస్తరిస్తోంది. మరోపక్క ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం పలు విభాగాలలో అమ్మకాలు పెంచుకుంటోంది. ఇక దేశీయంగా రిలయన్స్ రిటైల్ ద్వారా మార్కెట్లో విస్తరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సైతం వేగంగా అడుగులు వేస్తూ వస్తోంది. ఈ బాటలోనే ఆర్థికంగా దెబ్బతిన్న ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
సీసీఐ ఓకే
కిశోర్ బియానీ కంపెనీ ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ ఆస్తుల విక్రయానికి ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో రూ. 24,713 కోట్లకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తద్వారా ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్ బిజినెస్‌లను ఆర్‌ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌కు విక్రయించనుంది. అయితే ఇందుకు అమెజాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. డీల్ కుదుర్చుకోవడంలో ఫ్యూచర్ గ్రూప్ నిబంధనలను అతిక్రమించినట్లు ఆరోపించింది. సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టులో ఫిర్యాదు చేయడం ద్వారా ఒప్పందాన్ని నిలిపివేయమంటూ స్టే తెచ్చుకుంది. కాగా.. అమెజాన్‌కు వ్యతిరేకంగా ఫ్యూచర్ రిటైల్ సైతం ఈ నెల 7న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు గత వారం దేశీయంగా కాంపిటీషన్ కమిషన్(సీసీఐ).. రిలయన్స్- ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం గమనార్హం!
డీల్ అత్యవసరం
అమ్మకాలు మందగించడం, తీవ్రతర పోటీ, రుణ భారం వంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ గ్రూప్ కోవిడ్-19 కారణంగా మరిన్ని సమస్యలలో చిక్కుకుంది. చెల్లింపుల సమస్యలు తలెత్తడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో డీల్ కుదుర్చుకుంది. అయితే గతేడాది ఫ్యూచర్ గ్రూప్‌లోని అన్‌లిస్టెడ్ కంపెనీలలో 49 శాతం వాటాను యూఎస్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేసింది. తద్వారా గ్రూప్‌లోని ప్రధాన లిస్టెడ్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్‌లో వాటా కొనుగోలుకి తమకు హక్కు ఉన్నదంటూ వాదిస్తోంది. అయితే నిబంధనలకు అనుగుణంగానే ఆర్‌ఐఎల్‌తో డీల్ కుదుర్చుకున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ వాదిస్తోంది.
ఈస్ట్ ఇండియా కంపెనీ
ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం నేపథ్యంలో కార్పొరేట్ దిగ్గజాలు అమెజాన్, ఆర్‌ఐఎల్ మధ్య వివాదం తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. రెండు కంపెనీల అధిపతులు జెఫ్ బెజోస్, ముకేశ్ అంబానీ ప్రపంచ సంపన్నులు కావడంతో అంతర్జాతీయంగా కార్పొరేట్ వర్గాలు దృష్టిసారించినట్లు చెబుతున్నారు. కాగా.. ఆర్‌ఐఎల్‌తో డీల్ విఫలమైతే దివాళా పరిస్థితికి చేరనున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ ప్రతినిధులు పేర్కొనడంతో వివాద పరిష్కారానికి ప్రాధాన్యత పెరిగినట్లు తెలియజేశారు. తద్వారా పలువురు ఉపాధి కోల్పోయే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్ రిటైల్ తరఫున ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే స్పందిస్తూ.. అమెజాన్ 21వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీవలే ప్రవరిస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టుకు తెలియజేశారు. చేస్తే మాతోనే బిజినెస్ చేయాలి. లేదంటే మూసివేయాల్సిందే అంటున్నట్లు వ్యవహరిస్తున్నదని విన్నవించారు. ఫ్యూచర్ రిటైల్‌లో అమెజాన్‌కు పెట్టుబడులు లేవని చెప్పారు.
అయితే రిటైల్ ఆస్తుల కొనుగోలుకి రిలయన్స్ ఇండస్ట్రీస్ సన్నద్దంగా ఉన్నదని తెలియజేశారు. అమెరికన్ బిగ్‌బ్రదర్ వంటి కంపెనీ దేశీ బిజినెస్ డీల్స్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉన్నదని వ్యాఖ్యానించారు. కాగా.. అమెజాన్.. అమెరికన్ బిగ్ బ్రదర్ లేదా ఈస్ట్‌ఇండియా కంపెనీ కాదని దీనికి సమాధానంగా అమెజాన్ తరఫున వాదిస్తున్న మాజీ అటార్నీ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం కోర్టుకు తెలియజేశారు. నిజానికి ఫ్యూచర్ గ్రూప్‌లో ఇన్వెస్టర్‌గా ఆర్థికంగా ఆదుకునేందుకే అమెజాన్ చూసినట్లు పేర్కొన్నారు. దేశీయంగా అమెజాన్ 6.5 బిలియన్ డాలర్లు వెచ్చించడం ద్వారా వేలకొద్దీ ఉద్యోగాల కల్పనను చేసినట్లు ఈ సందర్భంగా కోర్టుకు తెలియజేశారు. కాగా.. దివాళా పరిస్థితుల నుంచి ఫ్యూచర్ గ్రూప్‌ను రక్షించాలంటే వీలైనంత త్వరగా డీల్‌కు అనుమతి లభించవలసి ఉన్నట్లు రిలయన్స్ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment