న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్)కు ఫ్యూచర్ గ్రూప్ తన రిటైల్ ఆస్తుల విక్రయ ప్రక్రియపై అమెరికా ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం– అమెజాన్ సోమవారం కీలక అడుగు వేసింది. ఈ వ్యవహారంలో సీఈఓ కిషోర్ బియానీసహా ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకులందరినీ అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. స్థిర, చర ఆస్తులుసహా బియానీ కుటుంబ సభ్యుల ఆస్తులన్నింటినీ వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. వాటిని జప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. బియానీ, ఆయన కుమార్తె అష్ని, వ్యవస్థాపక కుటుంబంలోని ఏడుగురు సభ్యులు, అలాగే కంపెనీ సెక్రటరీసహా ముగ్గురు ఇతర అధికారులను ‘‘అదుపు’’లోకి తీసుకోవాలని కోరింది. ఫ్యూచర్ గ్రూప్ సంస్థల డైరెక్టర్లను అరెస్ట్ చేసేలా ఆదేశాలు ఇవ్వమని అభ్యర్థించింది.
న్యాయ వ్యవస్థలపై గౌరవం లేదు!
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) కు ఫ్యూచర్ గ్రూప్ తన రిటైల్ ఆస్తుల విక్రయ ప్రక్రియను వెంటనే నిలుపుచేయాలని కూడా అమెరికా ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం– అమెజాన్ హైకోర్టును కోరింది. ఈ విక్రయ ప్రక్రియ అమలుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, అలాగే స్టాక్ ఎక్సే్చంజీలు అనుమతి ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయా అంశాలకు సంబంధించి తనకు అనుకూలంగా సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్‌ఐఏసీ) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్ (ఈఏ) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను భారతీయ చట్టాల (ఆర్బిట్రేషన్ అండ్ కన్సీలియేషన్ యాక్ట్ అలాగే కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ఆర్డర్ 39 రూర్ 2ఏ) ప్రకారం అమలు చేయవచ్చని, తద్వారా తన ప్రయోజనాలు కాపాడాలని తన తాజా పిటిషన్‌లో అమెజాన్ పేర్కొంది.
ఫ్యూచర్–రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఒప్పందానికి సెబీ, స్టాక్ ఎక్సేంజీలు అనుమతి ఇచ్చిన కేవలం కొద్ది రోజులకే అమెజాన్ ఈ విషయంలో తాజా అడుగులు వేయడం గమనార్హం. భారత్‌లో రెగ్యులేటరీ సంస్థ ఇచ్చిన ఎటువంటి ఆదేశాలూ ప్రతివాది ఫ్యూచర్ గ్రూప్ అమలు పరచలేకుండా తగిన ‘‘ఇంజెన్షన్’’ ఉత్తర్వులు ఇవ్వాలని తన పిటిషన్‌లో అమెజాన్ కోరడం గమనార్హం. లేదంటే అమెజాన్ గతేడాది ఆగస్టులో ఫ్యూచర్ కూపన్స్‌లో కొనుగోలు చేసిన 49 శాతం వాటాల ప్రయోజనాలు పొందలేదని స్పష్టం చేసింది.
నిజానికి ఎస్‌ఐఏసీ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు జనవరి 23 వరకే అమల్లో ఉంటాయి. ఈ ఉత్తర్వులను పొడిగించాల్సి ఉంది. అయితే ఎస్‌ఐఏసీ మధ్యంతర ఆదేశాల పునఃపరిశీలన లేదా సవరణ, సడలింపు, ఎత్తివేతలకు సంబంధించి ఎవ్వరూ (వివాదంలోని ఏ పార్టీ) తదుపరి పిటిషన్ వేయనందున ఆర్బిట్రేషన్ ఉత్తర్వుల గడువు సాంకేతికంగా ఆటోమేటిక్(దానికదే)గా పెరుగుతుందని తన పిటిషన్‌లో అమెజాన్ పేర్కొనడం గమనార్హం. ఎస్‌ఐఏసీ ఆదేశాలను గ్రూప్ సీఈఓ కిషోర్ బియానీసహా ఫ్యూచర్ కూపన్స్, ఫ్యూచర్ రిటైల్, ప్రమోటర్లు తదితర ప్రతివాదులు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడంలేదనీ అమెజాన్ తాజా పిటిషన్‌లో ఆరోపించింది. కనీసం ఈఏ ఆదేశాలను సవాలు చేయడం లేదని పేర్కొంది. న్యాయం, చట్టం అమలు, ఆర్బిట్రల్ ప్రక్రియ, బాధ్యతల పట్ల వారికి ఎంత గౌరవం ఉందో దీనిని బట్టి అర్థం అవుతోందని పేర్కొంది.
కొనుగోలు హక్కు మాకే: అమెజాన్
► ఫ్యూచర్ గ్రూప్‌లో కీలకమైన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్‌ఆర్‌ఎల్)లో ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌సీపీఎల్)కు 7.3 శాతం వాటాలు ఉన్నాయి. అమెజాన్ గతేడాది ఆగస్టులో ఈ ఫ్యూచర్ కూపన్స్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేసింది. తద్వారా అమెజాన్‌కు కూడా ఎఫ్‌ఆర్‌ఎల్‌లో సాంకేతికంగా వాటాలు సంక్రమించినట్లయింది. ఫ్యూచర్ కూపన్స్‌తో డీల్ కుదుర్చుకున్నప్పుడే .. మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ చెబుతోంది.
► ఇటీవలి కరోనా ప్రేరిత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్‌కు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్ తదితర వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్‌ఆర్‌వీఎల్) విక్రయిస్తున్నట్లు గతేడాది ఆగస్టు
29న ఫ్యూచర్ గ్రూప్ ప్రకటించింది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 24,713 కోట్లు. ∙ఈ నేపథ్యంలోనే ఈ ఒప్పందాన్ని అమెజాన్ వ్యతిరేకిస్తోంది. న్యాయపోరాటంలో ఇప్పుడు అమెజాన్ (తాజాగా ఢిల్లీ హైకోర్టు పిటిషన్‌తో) కొత్త అడుగు వేసినట్లయ్యింది.
► ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ కేన్ ఫిన్ హోమ్స్ ఈ ఏడాది(2020–21) మూడో త్రైమాసికంలో రూ. 132 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 24 శాతం వృద్ధికాగా.. గతేడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో రూ. 107 కోట్ల లాభం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment