న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్‌ఆర్‌ఎల్) .. స్థల యజమానులకు లీజు బకాయిలు చెల్లించలేకపోవడంతో దాన్ని గట్టెక్కించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ రంగంలోకి దిగింది. ఫ్యూచర్ రిటైల్‌కు చెందిన స్టోర్స్‌ను తన ఆధీనంలోకి తీసుకోవడం ప్రారంభించింది. సుమారు 200 స్టోర్స్ కార్యకలాపాలను రిలయన్స్ టేకోవర్ చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే వాటిల్లో పని చేసే సిబ్బందికి అక్కడే ఉద్యోగ ఆఫర్లు కూడా ఇచ్చిందని వివరించాయి.
రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్‌ను విలీనం చేసే డీల్‌పై ఫ్యూచర్ గ్రూప్, అమెజాన్ మధ్య న్యాయ వివాదం కొనసాగుతున్న పరిస్థితుల్లో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, లాజిస్టిక్స్ వ్యాపారాలను రూ. 24,713 కోట్లకు టేకోవర్ చేసేందుకు రిలయన్స్ రిటైల్ 2020 ఆగస్టులో అంగీకరించింది. ఫ్యాషన్ ఎట్ బిగ్ బజార్, కోర్యో, ఫుడ్‌హాల్, ఈజీడే మొదలైన విభాగాలు వీటిలో ఉన్నాయి. అయితే, ఫ్యూచర్ గ్రూప్ లోని ఫ్యూచర్ కూపన్స్‌లో వాటాలు ఉన్న అమెజాన్ వ్యతిరేకించడంతో ఈ డీల్ నిల్చిపోయింది. ప్రస్తుతం ఫ్యూచర్ గ్రూప్–అమెజాన్ మధ్య న్యాయపోరాటం సాగుతోంది. దీనిపై ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 28న రెండు పక్షాల వాదనలను విననుంది.
స్టోర్స్‌కు రీబ్రాండింగ్..
ఈ క్రమంలో రుణదాతలకు దాదాపు రూ. 3,494 కోట్ల బకాయిలను చెల్లించడంలో ఎఫ్‌ఆర్‌ఎల్ విఫలమైంది. మరోవైపు, ఎఫ్‌ఆర్‌ఎల్‌కు స్థలాలను లీజుకు ఇచ్చిన వారు .. తమ బాకీలను రాబట్టుకునేందుకు రిలయన్స్ రిటైల్‌ను సంప్రదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో కొన్ని స్టోర్ల లీజులను రిలయన్స్ తన అనుబంధ సంస్థ ఆర్‌ఆర్‌వీఎల్ పేరిట బదిలీ చేయించుకుని, వాటిని ఫ్యూచర్‌కు సబ్ లీజుకు ఇచ్చినట్లు పేర్కొన్నాయి. అలాగే, స్టోర్స్‌కు పేర్లను కూడా రీబ్రాండింగ్ చేస్తున్నట్లు వివరించాయి. ఎఫ్‌ఆర్‌ఎల్ ప్రస్తుత సరఫదారులకు బాకీలను చెల్లించకపోవడంతో .. స్టోర్స్‌లో సింహభాగం ఉత్పత్తులను రిలయన్స్ జియోమార్ట్ సరఫరా చేస్తోంది. ఆయా స్టోర్స్ నుంచి బిగ్ బజార్ సైనేజీలు, బ్రాండింగ్‌ను తన సొంత బ్రాండ్‌తో మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బజార్ స్టోర్స్‌తో పాటు ఫ్యూచర్‌కు 1,700 అవుట్‌లెట్స్ ఉన్నాయి.
డీల్ గడువు పొడిగింపు..
అయితే, ఈ అంశాలను నిర్దిష్టంగా ధృవీకరించకుండా ఫ్యూచర్ రిటైల్.. స్టాక్ ఎక్సే్చంజీలకు వివరణనిచ్చింది. అమెజాన్‌తో వివాదం దరిమిలా తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోందని పేర్కొంది. రిలయన్స్ రిటైల్‌తో డీల్‌కు సంబంధించి 2022 ఏప్రిల్ ప్రథమార్ధంలో షేర్‌హోల్డర్లు, రుణదాతలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపాదిత టేకోవర్ డీల్ గడువును సెప్టెంబర్ 30 వరకూ రిలయన్స్ పొడిగించిందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment