న్యూఢిల్లీ: ఫ్యూచర్–రిలయన్స్ ఒప్పందం విషయంలో ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇచ్చిన రూలింగ్‌పై ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఫ్యూచర్ లేదా అమెజాన్‌లు ఈ విషయంలో పంపిన ఈ–మెయిల్ ప్రశ్నలకు స్పందించలేదు. కేసు వివరాల్లోకి వెళితే, ఫ్యూచర్ గ్రూప్‌లో కీలకమైన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్‌ఆర్‌ఎల్)లో ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌సీపీఎల్)కు 7.3 శాతం వాటాలు ఉన్నాయి. అమెజాన్ గతేడాది ఆగస్టులో ఈ ఫ్యూచర్ కూపన్స్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేసింది.
ఫ్యూచర్ కూపన్స్‌తో డీల్ కుదుర్చుకున్నప్పుడే .. మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాలను రిలయన్స్‌తో విక్రయించడం సరికాదని పేర్కొంటూ, ఇందుకు సంబంధించి రూ.24,713 కోట్ల ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్– రిలయన్స్ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ వివాదంలో తదుపరి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్‌ఐఏసీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు ఫ్యూచర్ రిటైల్‌ను ఆదేశించాలని డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై జరిగిన విచారణలో భాగంగా... జనవరి 21వ తేదీన ఫ్యూచర్–రిలయన్స్ డీల్‌కు సెబీ, సీసీఐ, స్టాక్ ఎక్సే్చంజీల షరతులతో కూడిన అనుమతులిచ్చాయి.
వీటి ప్రకారం.. ఈ ఒప్పందానికి ఫ్యూచర్ గ్రూప్ ఇటు షేర్‌హోల్డర్లతో పాటు అటు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీనితో జనవరి 26న ఫ్యూచర్ ఎన్‌సీఎల్‌టీ, ముంబై బెంచ్‌నీ ఆశ్రయించింది. ప్రస్తుతం న్యాయస్థానాల్లో కొనసాగుతున్న వివాదాలపై తుది తీర్పులకు లోబడి తమ అనుమతులు వర్తిస్తాయని స్టాక్ ఎక్సే్చంజీలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ జనవరి 25న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో సీఈఓ కిషోర్ బియానీసహా ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకులందరినీ అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించింది. ఈ విక్రయ ప్రక్రియ అమలుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, అలాగే స్టాక్ ఎక్సే్చంజీలు అనుమతి ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఎస్‌ఐఏసీ ఆదేశాలను గ్రూప్ సీఈఓ కిషోర్ బియానీసహా ఫ్యూచర్ కూపన్స్, ఫ్యూచర్ రిటైల్, ప్రమోటర్లు తదితర ప్రతివాదులు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడంలేదనీ అమెజాన్ తాజా పిటిషన్‌లో ఆరోపించింది. న్యాయం, చట్టం అమలు, ఆర్బిట్రల్ ప్రక్రియ, బాధ్యతల పట్ల వారికి ఎంత గౌరవం ఉందో దీనిని బట్టి అర్థం అవుతోందని పేర్కొంది. ఈ పిటిషన్‌ను నాలుగురోజులు విచారించిన ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ 2021 పిబ్రవరి 2న రూలింగ్ ఇస్తూ, ఆర్‌ఐఎల్‌తో ఒప్పందం విషయంలో యథాతథ స్థితిని పాటించాలని ఫ్యూచర్ గ్రూప్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఫ్యూచర్ దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన డివిజనల్ బెంచ్ ఈ నెల 8వ తేదీన ఫ్యూచర్‌కు అనుకూలంగా రూలింగ్ ఇచ్చింది. దీనిపై తాజాగా అమెజాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment