Amazon Files Writ Petition Against ED In Delhi HC: విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనలకు సంబంధించి ఈడీ దర్యాప్తు పరిధిపై వివరణ కోరుతూ అమెజాన్ ఢిల్లీ హైకోర్టులో బుధవారం ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందం విషయంలో ‘విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనలు జరిగాయని’ అమెజాన్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అంతర్జాతీయ దిగ్గజ ఈ– రిటైలర్ ఈ రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
ఫ్యూచర్ గ్రూప్‌తో డీల్‌కు సంబంధించి అమెజాన్‌కు గత నెల్లో ఈడీ నుంచి సమన్లు కూడా అందాయి. ఈ విషయాన్ని గత నెల్లో అమెజాన్ స్వయంగా వెల్లడించింది. రిట్ దాఖలుకు సంబంధించి అందుతున్న సమాచారం ప్రకారం తన విచారణా పరిధిని మించి ఈడీ వ్యవహరిస్తోందన్నది అమెజాన్ ఆరోపణ. ఫ్యూచర్–అమెజాన్ లావాదేవీలతో సంబంధం లేని లేదా వాటి గురించి అవగాహన లేని తన ఎగ్జిక్యూటివ్‌లకు వ్యక్తిగతంగా సాక్ష్యమివ్వడానికి ఈడీ సమన్లు చేయడం వెనుక ఉన్న హేతుబద్ధతను రిట్ పిటిషన్‌లో అమెజాన్ ప్రశ్నించింది.
కాగా, ఈ రిట్‌పై అడిగిన ప్రశ్నలకు అమెజాన్ నుంచి ఎటువంటి ప్రతి స్పందనా లభించలేదు. అమెజాన్–ఫ్యూచర్ గ్రూప్ మధ్య ప్రస్తుతం రూ.24,500 కోట్ల రిలయన్స్ రిటైల్ (ఫ్యూచర్ గ్రూప్ ఆ సంస్థలో చేసుకున్న) ఒప్పందపై న్యాయపోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment