న్యూఢిల్లీ: ఫ్యూచర్ గ్రూప్‌లో అమెజాన్ ఇండియా పెట్టుబడుల విషయంలో విదేశీ మారక చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలపై ఇరు కంపెనీల అధికారులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. నిర్దిష్ట పత్రాలతో పాటు విచారణకు హాజరు కావాలంటూ అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ సహా సీనియర్ అధికారులకు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈడీ సమన్లను పరిశీలిస్తున్నామని, తగు విధంగా స్పందిస్తామని అమెజాన్ ప్రతినిధి తెలిపారు.
ఫ్యూచర్ గ్రూప్ సంస్థలో అమెజాన్‌కు పెట్టుబడులు ఉన్న సంగతి తెలిసిందే. దీని ఊతంతో .. దేశీ దిగ్గజం రిలయన్స్‌కి ‘ఫ్యూచర్ రిటైల్’ సంస్థను విక్రయించనివ్వకుండా అడ్డుపడుతుండటంపై ఫ్యూచర్ గ్రూప్, అమెజాన్‌ల మధ్య వివాదం నడుస్తోంది. ఫ్యూచర్ గ్రూప్‌లోని అన్‌లిస్టెడ్ కంపెనీలో పెట్టుబడుల ద్వారా ఫ్యూచర్ రిటైల్‌పై అజమాయిషీ చలాయించేందుకు అమెజాన్ ప్రయత్నిస్తుండటాన్ని .. ఫెమా, విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల ఉల్లంఘ నగా భావించాల్సి వస్తుందంటూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు, ఈ–కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి నిర్దిష్ట మల్టీ–బ్రాండ్ రిటైల్ వ్యాపారాలు సాగిస్తుండటంపై తగు చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర వాణిజ్య శాఖ ఇటీవలే ఈడీకి సూచించింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజా సమన్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment