
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగ దిగ్గజం ఫ్యూచర్ గ్రూప్ విస్తరణ ద్వారా 2018–19లో రూ.40,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం రిటైల్ బిజినెస్ ద్వారా సంస్థ రూ.28,600 కోట్లు ఆర్జించింది. 2017–18లో రూ.30,000 కోట్లు అంచనా వేస్తున్నట్టు గ్రూప్ సీఈవో కిశోర్ బియానీ బుధవారం తెలిపారు. గోల్డెన్ హార్వెస్ట్ సోనమసూరి రైస్‌ను ఇక్కడ లాంఛనంగా ఆవిష్కరించిన అనంతరం సినీ నటుడు రానా దగ్గుబాటితో కలిసి మీడియాతో మాట్లాడారు. గ్రూప్ టర్నోవరులో హైదరాబాద్ మార్కెట్ 10% వాటా కైవసం చేసుకుందని చెప్పారు. ఫ్యాషన్, ఫుడ్ విషయంలో ఇక్కడ వినియోగం అధికంగా ఉంటుందని కొనియాడారు. గోల్డెన్ హార్వెస్ట్ సోనమసూరి రైస్ వాణిజ్య ప్రకటనను సురేష్ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రించాయి.
చిన్న స్టోర్లతో విస్తరణ..: బిగ్ బజార్, సెంట్రల్, ఫుడ్ బజార్, హోమ్ టౌన్, ఫుడ్ హాల్, ఈ–జోన్, ప్లానెట్ స్పోర్ట్స్, బ్రాండ్ ఫ్యాక్టరీ వంటి బ్రాండ్లు ఫ్యూచర్ గ్రూప్ కింద ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని బ్రాండ్లలో 1,700లకుపైగా స్టోర్లను ఈ గ్రూప్ నిర్వహిస్తోంది. ఈజీడే, నీల్‌గిరి, హెరిటేజ్ ఫ్రెష్, కేబీ కన్వీనియెంట్లీ యువర్స్ బ్రాండ్లలో భారీ విస్తరణకు సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. 2022 నాటికి 10,000 స్మాల్ ఫార్మాట్ స్టోర్లను ఏర్పాటు చేయాలన్నది కంపెనీ ఆలోచన. ఇక గోల్డెన్ హార్వెస్ట్ బ్రాండ్ ఒక్కటే రూ.1,200 కోట్ల వ్యాపారం చేస్తోంది. 2018–19లో ఈ బ్రాండ్ ద్వారా రూ.2,000 కోట్లు సమకూరతాయని బియానీ వెల్లడించారు. గోల్డెన్ హార్వెస్ట్ బ్రాండ్‌లో పిండి, పప్పులు, మసాలాలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్, ఇతర ఆహార పదార్థాలను విక్రయిస్తోంది.
తెలంగాణలో గార్మెంట్స్ యూనిట్!
ఫ్యూచర్ గ్రూప్ తెలంగాణలో మెగా గార్మెంట్స్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎక్కడ, ఎంత పెట్టుబడితో రానుంది అన్న విషయాలను అధికారికంగా కంపెనీ ప్రకటించలేదు. అయితే తెలంగాణలో యూనిట్ వచ్చే విషయాన్ని గ్రూప్ కంపెనీ ప్రతినిధి ఒకరు అనధికారికంగా ధ్రువీకరించారు. ఫ్యూచర్ గ్రూప్ పశ్చిమ బెంగాల్‌లో ఇటువంటి యూనిట్‌ను ఈ ఏడాదే నెలకొల్పుతోంది. వివిధ బ్రాండ్లలో ఏటా 35 కోట్ల యూనిట్ల దుస్తులను తాము విక్రయిస్తున్నట్టు కిశోర్ బియానీ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ స్థాయికి చేరడం ద్వారా ప్రపంచంలో టాప్–10 రిటైలర్‌గా నిలిచామన్నారు. బెంగాల్ తర్వాత గార్మెంట్స్ తయారీకి మరొక యూనిట్ స్థాపనకు పలు రాష్ట్రాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇందులో తెలంగాణ ఒకటని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment