
ఎన్‌ఎండీసీ – కొనచ్చు
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
ప్రస్తుత ధర: రూ. 125
టార్గెట్ ధర: రూ.187
ఎందుకంటే: భారత్‌లో ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసే అతి పెద్ద కంపెనీ ఇదే. చత్తీస్‌ఘడ్, కర్నాటకల్లో ఉన్న 4 గనుల ద్వారా ఏడాదికి 30–32 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్రభుత్వ రంగ గనుల కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నా యి. ఈ క్యూ2లో పటిష్టమైన పనితీరును కనబరిచింది. ఇబిటా 56% (అంతకు ముందటి క్వార్టర్‌తో పోల్చితే 21%) వృద్ధితో రూ.1,280 కోట్లకు పెరిగింది. వ్యయాలు తక్కువగా ఉండడం, రియలైజేషన్ అంచనాల కంటే మించడం కలసివచ్చాయి.
నికర లాభం 42% వృద్ధితో రూ.890 కోట్లకు పెరిగింది. అమ్మకాలు 4 శాతం(క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపాదికన 10%) వృద్ధితో 8.3 మిలియన్ టన్నులకు పెరిగాయి. ఉత్పత్తి 14 శాతం(అంతకు ముందటి క్వార్టర్‌తో పోల్చితే 16%) వృద్ధి చెంది 7.2 మిలియన్ టన్నులకు పెరిగింది. ఎగుమతులు 2% క్షీణించి 6.2%కి తగ్గాయి. శీతాకాల ఉత్పత్తి కోత కారణంగా చైనాలో డిమాండ్ తగ్గుతుందనే అందోళనతో అంతర్జాతీయంగా ఇనుప ఖనిజం ధరలు తగ్గాయి. ధరల ఒత్తిడి కారణంగా ఇటీవల కొన్ని నెలల్లో కంపెనీ ఇనుప ఖనిజం అమ్మకాలు కూడా తగ్గాయి.
అమ్మకాల వృద్ధిని కొనసాగించాలంటే ఈ కంపెనీ ధరలను మరింతగా తగ్గించాల్సి ఉంటుంది. అదనపు మూలధన పెట్టుబడులు లేకుండానే ఈ కంపెనీ అదనంగా 20% సరఫరాలను అందించగలదు. ప్రస్తుతం 36 మిలియన్ టన్నులుగా ఉన్న వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని ఐదేళ్లలో 50 మిలియన్ టన్నులకు పెంచుకోవడానికి గాను రూ.15,500 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. చత్తీస్‌ఘడ్‌లో ఏర్పాటు చేస్తోన్న స్టీల్ ప్లాంట్‌లో 49% వాటా విక్రయం కోసం ఇటీవలనే ఒక బ్యాంక్‌ను సలహా సంస్థగా నియమించుకుంది. ఈ వాటా కొనుగోలుకు టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలు ఇప్పటికే తమ ఆసక్తిని వెల్లడించాయి. మూడేళ్లలో అమ్మకాలు 6% చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా.
ప్యూచర్ రిటైల్ – కొనచ్చు
బ్రోకరేజ్ సంస్థ: యాక్సిస్ డైరెక్ట్
ప్రస్తుత ధర: రూ. 504
టార్గెట్ ధర: రూ.680
ఎందుకంటే: ప్యూచర్ గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. సేమ్ స్టోర్స్ సేల్స్(ఎస్‌ఎస్‌ఎస్‌జీ) 10 శాతం పెరగడంతో ఈ కంపెనీ మొత్తం అమ్మకాలు 20 శాతం వృద్ధి చెందాయి. నిర్వహణ పనితీరు బాగా ఉండటంతో ఇబిటా 65 శాతం వృద్ధి చెందింది. ఇక నికర లాభం దాదాపు రెట్టింపై రూ.150 కోట్లకు పెరిగింది.
నికర లాభ మార్జిన్ 1.6 శాతం వృద్ధితో 3.4 శాతానికి ఎగసింది. వేగంగా వృద్ధి చెందుతున్న భారత్‌లో వ్యవస్థీకృత ఆధునిక రిటైల్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ కంపెనీ తగిన స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. బిగ్‌బజార్‌లో సేమ్ స్టోర్ సేల్స్ రెట్టింపు వృద్ధిని సాధిస్తున్నాయి. అధిక వృద్ధి ఫ్యాషన్ కేటగిరిలో ఎఫ్‌బీబీ(ఫ్యాషన్ ఎట్ బిగ్ బజార్) మార్కెట్ వాటా పెరుగుతోంది. హైపర్‌సిటీ స్టోర్స్‌ను కొనుగోలు చేయడం కంపెనీకి కలసివచ్చే అంశమే. ఈ కొనుగోలు కారణంగా కంపెనీకి 2 కోట్ల మంది కొత్త వినియోగదారులు లభించారు. ఈ కొనుగోలు ప్రయోజనాలు ఈ ఆర్థిక సంవత్సరం చివరి కల్లా కనిపించనున్నాయి.
మరోవైపు చిన్న రిటైల్ స్టోర్స్ చెయిన్...ఈజీడే స్టోర్స్‌ను కూడా కంపెనీ చేజిక్కించుకుంది. ఈజీడే స్టోర్స్ సంఖ్యను కూడా విస్తృతంగా పెంచుతోంది. సాధారణ వినియోగదారుల కంటే 3 రెట్లకు పైగా కొనుగోళ్లు చేసే ఈజీడే సేవింగ్స్ క్లబ్ సభ్యుల సంఖ్య ఈ క్యూ2లో 25 శాతం వృద్ధితో 2.5 లక్షలకు పెరిగింది. ఈ క్యూ2లో ఏడు కొత్త నగరాలకు బిగ్‌బజార్ స్టోర్స్‌ను కంపెనీ విస్తరించింది. దీంతో మొత్తం 253 నగరాల్లో మొత్తం బిగ్‌బజార్ స్టోర్స్ సంఖ్య 914కు చేరింది. మూడేళ్లలో ఆదాయం 20 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలదని, ఇదే మూడేళ్లలో ఇబిటా మార్జిన్ 4.8 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment