![Future Enterprises Ltd Raise Around Rs 3,000 Crore From Selling Its Stake - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/10/Future%20Enterprises%20Ltd.jpg.webp?itok=j653pg2M)
న్యూఢిల్లీ: రుణ ఊబిలో ఉన్న ఫ్యూచర్ గ్రూపు కంపెనీ ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ దివాలా ప్రక్రియ బారిన పడకుండా చర్యల మార్గం పట్టింది. ఫ్యూచర్ జనరాలి ఇన్సూరెన్స్ కంపెనీల్లో తనకున్న వాటాలను విక్రయించడం ద్వారా రూ.3,000 కోట్లను సమకూర్చుకోనుంది.
ఈ నిధులతో రుణభారం తగ్గించుకోవాలన్నది కంపెనీ వ్యూహం. ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ అన్నది ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్, జనరాలి భాగస్వామ్య సంస్థ. ఇది సాధారణ బీమా సంస్థ. ఇందులో తనకున్న వాటాలో 25 శాతాన్ని భాగస్వామి జనరాలికి రూ.1,266 కోట్లను విక్రయించినట్టు గత వారమే ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ ప్రకటించింది. ఈ లావాదేవీ తర్వాత కూడా ఫ్యూచర్ జనరాలిలో ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్‌కు 24.91 శాతం వాటా మిగిలే ఉంది. వచ్చే 30–40 రోజుల్లో మిగిలిన 25 శాతం వాటా విక్రయంతో రూ.1,250 కోట్లు లభిస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇక ఫ్యూచర్ జనరాలి లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఉన్న 33.3 శాతం వాటాను సైతం విక్రయించనుంది. దీని ద్వారా మరో రూ.400 కోట్ల వరకు రానున్నాయి. ఈ మూడు లావాదేవీలతో మొత్తం రూ.2,950 కోట్ల వరకు సమకూరతాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి చెల్లించాల్సిన రూ. 2,911 కోట్ల రుణాల విషయంలో ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ డిఫాల్ట్ అయింది. దీనికి అదనంగా 30 రోజుల సమీక్ష కాలంలోనూ చెల్లించలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment