టీవీఎస్ మోటార్ కంపెనీ మరో ఘనతను సాధించింది. కంపెనీ తయారీ జూపిటర్ స్కూటర్ (TVS Jupiter) 70 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంది. హోల్‌సేల్‌గా కంపెనీ 2024 నవంబర్ నాటికి 71,40,927 యూనిట్లను విక్రయించింది. 2013 సెప్టెంబర్ నుంచి సంస్థ మొత్తం 1.14 కోట్ల స్కూటర్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో జూపిటర్ వాటా ఏకంగా 62 శాతం ఉంది.
స్కూటర్స్ విభాగంలో సెగ్మెంట్లో దేశంలో రెండవ స్థానంలో ఉన్న జూపిటర్ 110, 125 సీసీ ఇంజన్ సామర్థ్యంలో లభిస్తోంది. 2024 మార్చి నాటికి 80,000 జూపిటర్ స్కూటర్లను కంపెనీ ఎగుమతి చేసింది. 2016 జూన్ నాటికి 10 లక్షల యూనిట్ల మార్కును సాధించింది. 2017 సెప్టెంబర్ నాటికి 20 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. 2022 సెప్టెంబర్ నాటికి 50 లక్షల యూనిట్లను తాకింది.
మరో 10 లక్షల యూనిట్లకు ఏడాది, ఆ తర్వాతి 10 లక్షలకు 14 నెలల సమయం తీసుకుంది. భారత స్కూటర్స్ పరిశ్రమలో రెండవ స్థానం దక్కించుకున్న టీవీఎస్‌కు 25 శాతం వాటా ఉంది. 2023–24లో 8,44,863 జూపిటర్ స్కూటర్స్ రోడ్డెక్కగా.. 2024–25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–నవంబర్‌లో ఈ సంఖ్య 7,01,360 యూనిట్లు ఉంది. ప్రస్తుతం 110 సీసీలో నాలుగు, 125 సీసీలో మూడు వేరియంట్లలో జూపిటర్ లభిస్తోంది.
సుజుకీ యాక్సెస్ 60 లక్షలు
ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా కూడా ఇటీవల సరికొత్త రికార్డు సాధించింది. సుజుకీ యాక్సెస్ 125 (suzuki access 125) మోడల్‌లో కంపెనీ 60 లక్షల స్కూటర్ల తయారీ మార్కును దాటింది. ఈ ఘనతను సాధించడానికి సంస్థకు 18 ఏళ్లు పట్టింది. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడు అవుతున్న మోడల్ కూడా ఇదే.
దీర్ఘకాలిక మన్నిక, మెరుగైన పనితీరు, మైలేజీ, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడంతో యాక్సెస్ 125 స్కూటర్‌కు కస్టమర్ల నుంచి దేశ విదేశాల్లో మంచి స్పందన ఉంది. భారత్‌తోపాటు అంతర్జాతీయంగా కస్టమర్ల నమ్మకానికి ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ ఎండీ కెనిచి ఉమేద తెలిపారు. యాక్సెస్ 125 తొలిసారిగా భారత్‌లో 2006లో అడుగుపెట్టింది. భారత రోడ్లపై 125 సీసీ ఇంజన్ సామర్థ్యంతో పరుగెత్తిన తొలి స్కూటర్ కూడా ఇదే కావడం విశేషం.
మూడవ స్థానంలో కంపెనీ..
దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య వివిధ కంపెనీలకు చెందిన 47,87,080 స్కూటర్లు రోడ్డెక్కాయి. ఇందులో సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా 14 శాతం వాటాతో మూడవ స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే 2024 ఏప్రిల్–నవంబర్‌లో కంపెనీ 18 శాతం దూసుకెళ్లి 6,84,898 యూనిట్ల స్కూటర్ల అమ్మకాలను సాధించింది. సుజుకీ ఎకో పెర్ఫార్మెన్స్ టెక్నాలజీతో 125 సీసీ ఎయిర్‌కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో ఇది రూపుదిద్దుకుంది.
5,500 ఆర్‌పీఎం వద్ద 10 ఎన్‌ఎం గరిష్ట టార్క్ అందిస్తుంది. బ్లూటూత్ ఆధారిత డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఏర్పాటు చేశారు. కాల్స్, ఎస్‌ఎంఎస్, వాట్సాప్ అలర్ట్స్, మిస్డ్ కాల్ అలర్ట్స్ అందుకోవచ్చు. స్పీడ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవెల్ డిస్‌ప్లే, గమ్యస్థానానికి చేరుకునే సమయం వంటివి తెలుసుకోవచ్చు. 22.3 లీటర్ల స్టోరేజ్, ఈజీ స్టార్ట్ కీ సిస్టమ్, పొడవైన సీటు వంటివి అదనపు హంగులు.
Comments
Please login to add a commentAdd a comment