బిగ్ బజార్ భారీ విస్తరణ
* దేశవ్యాప్తంగా 2015లో 12 స్టోర్లు
* తెలుగు రాష్ట్రాల్లో 4 ఏర్పాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగంలో ఉన్న ఫ్యూచర్ గ్రూప్ దేశవ్యాప్తంగా బిగ్ బజార్ స్టోర్లను విస్తరిస్తోంది. 2015లో కొత్తగా 12 ఔట్‌లెట్లను తెరుస్తోంది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో 4 స్టోర్లు రానున్నాయి. ఏప్రిల్‌కల్లా హైదరాబాద్ చందానగర్, రాజమండ్రిలో ఏర్పాటవుతున్నాయి. డిసెంబర్‌కల్లా హైదరాబాద్ టోలిచౌకి, గుంటూరు స్టోర్లు అందుబాటులోకి వస్తాయని ఫ్యూచర్ గ్రూప్ ఉన్నతాధికారి ఒకరు ముంబై నుంచి సాక్షి బిజినెస్ బ్యూరోకు ఫోన్‌లో తెలిపారు.
స్టోర్లు 40-70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయని వెల్లడించారు. ఒక్కో స్టోర్ ఏర్పాటుకు రూ.12 కోట్ల దాకా వ్యయం అవుతుందని పేర్కొన్నారు. కస్టమర్లకు వినూత్న షాపింగ్ అనుభూతి కల్పించేందుకు స్టోర్ల డిజైనింగ్‌పై ప్రత్యేక దృష్టిసారించినట్టు తెలిపారు. 24 నుంచి సబ్ సే సస్తా..: ఈ నెల 24-26 వరకు ‘చవకైన 3 రోజులు’ పేరుతో భారీ డిస్కౌంట్లను బిగ్ బజార్ దేశవ్యాప్తంగా ఆఫర్ చేస్తోంది.
వినియోగదారులు ఏ ఉత్పత్తులపట్ల మక్కువ చూపుతున్నారో అధ్యయనం చేసి అందుబాటులో ఉంచుతున్నట్టు బిగ్ బజార్ దక్షిణ ప్రాంత వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ కుమార్ తెలిపారు. ఫ్యామిలీ సెంటర్ హెడ్ సిలాస్ పాల్, మార్కెటింగ్ మేనేజర్ రితేష్‌తో కలిసి గురువారమిక్కడ ఆఫర్లను ప్రకటించారు. ఏటా జనవరిలో భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నట్టు చెప్పారు. గతేడాది సేల్‌లో 1 కోటి మంది కస్టమర్లు షాపింగ్ చేశారని పేర్కొన్నారు.