CCI officials
-
‘ప్రత్తి’పాపం మాఫీయేనా?
♦ సీఎంకు విజిలెన్స్ ఇచ్చిన నివేదిక బుట్టదాఖలు ♦ గుంటూరు జిల్లాలో రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసిన ‘కీలక’ మంత్రి! ♦ బోగస్ రైతుల పేర్లతో సీసీఐకి అధిక ధరలకు విక్రయం ♦ 47,903.91 క్వింటాళ్లు బోగస్ రైతుల నుంచి సీసీఐ కొనుగోలు చేసినట్లు నిర్ధారణ ♦ సీసీఐ మేనేజర్‌పై బదిలీ వేటు వేసిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: పత్తి రైతుల కడుపు కొట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన కీలక మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దన్నుగా నిలుస్తున్నారు. గుంటూరు జిల్లాలో సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సేకరించిన పత్తిలో.. 80 శాతం పత్తిని బోగస్ రైతుల నుంచే కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. సీబీఐ దర్యాప్తులో సైతం ఇదే వెల్లడైంది. విజిలెన్స్, సీబీఐ నివేదికల ఆధారంగా సీసీఐ మేనేజర్ ఆర్.జయకుమార్‌పై కేంద్రం బదిలీ వేటు వేసింది. కానీ.. సీఎం చంద్రబాబు మాత్రం విజిలెన్స్ నివేదికను బుట్టదాఖలు చేసి, కుంభకోణానికి సూత్రధారి అయిన కీలక మంత్రికి బాసటగా నిలుస్తున్నారు. గతేడాది పత్తికి క్వింటాలుకు మొదటి రకానికి రూ.4050, రెండో రకానికి రూ.3750ను కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)గా కేంద్రం నిర్ణయించింది. రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చేసేందుకు దేశవ్యాప్తంగా సీసీఐని రంగంలోకి దించింది. గుంటూరు జిల్లాలో జిన్నింగ్ పరిశ్రమలను గుప్పిట్లో పెట్టుకున్న ఓ కీలక మంత్రి, సీసీఐ అధికారులతో కుమ్మక్కయ్యారు. మార్కెట్ యార్డుల్లో సీసీఐ పత్తిని కొనుగోలు చేయకుండా చేసిన కీలక మంత్రి దళారీల ద్వారా తక్కువ ధరలకే రైతుల నుంచి పత్తిని ఖరీదు చేశారు. అదే పత్తిని ఎమ్మెస్పీ ధరలకు సీసీఐకి విక్రయించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. విజిలెన్స్ విచారణలో రట్టు గుంటూరు జిల్లాలో పత్తి కొనుగోళ్లలో అక్రమాలపర్వంపై రైతు సంఘాలు ఉద్యమించాయి. సీబీఐతోపాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఈ అక్రమాలపై దర్యాప్తు చేసింది. సీసీఐ పత్తి కొనుగోలు చేసిన రైతులను విజిలెన్స్ అధికారులు విచారించారు. 900 మంది రైతులను విచారిస్తే.. ఇందు లో 719 మంది రైతులు బోగస్‌గా తేలింది. 719 మంది రైతుల నుంచి 47,903.91 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు సీసీఐ అధికారులు రికార్డులు సృష్టించారు. సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని జిన్నిం గ్ మిల్లులకు పంపి ప్రాసెసింగ్ చేయిస్తుంది. ఇందు కు సంబంధించిన రికార్డులు జిన్నింగ్ మిల్లుల వద్ద లేవన్నది విజిలెన్స్ దర్యాప్తులో వెల్లడైంది. సీసీఐ కొనుగోలు చేసిన పత్తిలో 80 శాతం బోగస్ రైతుల నుంచి సేకరించిందేనని విజిలెన్స్ నిర్ధారించింది. సీసీఐ అధికారులతో కలిసి ఓ కీలక మంత్రి రూ.75 కోట్లకుపైగా కొల్లగొట్టినట్లు సీబీఐ విచారణలో వెల్లడైనట్లు సమాచారం. సీబీఐ ప్రాథమిక నివేదికతోపాటూ విజిలెన్స్ నివేదికను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. సీసీఐ మేనేజర్ జయకుమార్తోపాటూ ముగ్గురు బయ్యర్లపై బదిలీ వేటు వేసింది. సూత్రధారికి అభయం! విజిలెన్స్ నివేదికలపై ఇటీవల సీఎం చంద్రబాబు సమీక్షించారు. పత్తి కుంభకోణంపై విజిలెన్స్ ఇచ్చిన నివేదికపై దృష్టి సారించకపోవడం గమనార్హం. విజిలెన్స్ నివేదికపై చర్యలు తీసుకుంటే.. కీలక మంత్రిపై కేసు నమోదు చేయాల్సి వస్తుంది. ఇది రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతుందని సీఎం ఆందోళన చెందుతుండటం, కీలక మంత్రి తనకు అత్యంత సన్నిహితుడు కావడంతో నివేదికను బుట్టదాఖలు చేసినట్లు అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీఎం దన్నుగా నిలుస్తోండటంతో ఈ ఏడాదీ సీసీఐ అధికారులతో కలిసి పత్తి రైతులను లూటీ చేయడానికి ఆ కీలక మంత్రి పావులు కదుపుతున్నారు. -
పత్తి రైతుల ఆక్రందన పట్టదా?
♦ యార్డులకు వచ్చిన పత్తిలో సీసీఐ కొనుగోలు చేసినది 15.96 శాతమే ♦ కనీస ధర మించకుండా సిండికేట్ అయిన ప్రైవేటు వ్యాపారులు ♦ నిబంధనల సాకుతో సహకరిస్తున్న సీసీఐ అధికారులు ♦ పొరుగు రాష్ట్రాల్లో భారీగా పలుకుతున్న పత్తి ♦ అక్కడికి తరలించి అమ్ముకుంటున్న వ్యాపారులు ♦ రాష్ట్రంలో ‘మద్దతు’ దక్కక నిండా మునుగుతున్న రైతులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి రైతు ఆక్రందన ఎవరికీ పట్టడం లేదు.. విత్తనాల దగ్గరి నుంచి వర్షాభావం దాకా ఎన్నో కష్టనష్టాల కోర్చి పండించిన పత్తి చివరికి వ్యాపారుల పాలవుతోంది.. రైతన్న నిలువునా దోపిడీకి గురవుతున్నాడు.. పత్తి రైతుకు మద్దతు ధర కల్పించాల్సిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిబంధనలను సాకుగా చూపుతూ కొనుగోలు చేయడం లేదు. ఇప్పటి వరకు మార్కెట్ యార్డులకు వచ్చిన పత్తిలో సీసీఐ కొనుగోలు చేసింది 15.96 శాతం మాత్రమే. దీంతో వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లు, కూలీలకు తక్షణమే చెల్లింపులు జరపాల్సిన పరిస్థితిలో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అయినకాడికి అమ్ముకుంటున్నారు. మరోవైపు ఇదే అదునుగా తక్కువ ధరకు భారీగా పత్తిని కొనుగోలు చేస్తున్న వ్యాపారులు పొరుగు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తొలి నుంచీ నిర్లక్ష్యమే రాష్ట్రంలో ఈ ఏడాది 16.76 లక్షల హెక్టార్లలో పత్తిసాగు చేయగా.. 284 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. పత్తి మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.4,100గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం సేకరణ బాధ్యత సీసీఐకి అప్పగించింది. రాష్ట్రంలో గత ఏడాది 83 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన సీసీఐ.. ఈ ఏడాది 84 కేంద్రాల ఏర్పాటుకు అంగీకరించింది. అక్టోబర్ 20వ తేదీ నాటికే వీటిని ప్రారంభించాల్సి ఉండగా... ఇప్పటివరకు 67 కేంద్రాలనే తెరిచారు. వీటిలోనూ 41 కేంద్రాల్లోనే పత్తి కొనుగోళ్లు కొంత చురుగ్గా సాగుతున్నట్లు మార్కెటింగ్ శాఖ చెబుతోంది. అసలు ఇప్పటివరకు సీసీఐ 1.82 ల క్షల క్వింటాళ్ల పత్తిని (యార్డులకు వచ్చిన దానిలో 15.96 శాతం) మాత్రమే కొనుగోలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. నిబంధనల పేరిట మడతపేచీ పత్తికి కనీస మద్దతు ధర మొదలుకుని తేమ శాతం వరకు అడ్డగోలు సాకులు చూపుతుండడంతో సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలకు రైతులు ఆసక్తి చూపడం లేదు. తేమ శాతం 12కు మించకూడదని, ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 40 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ వర్గాలు తెగేసి చెబుతున్నాయి. అయితే క్వింటాల్ పత్తికి రూ. ఐదు వేలు మద్దతు ధర చెల్లించాలని, తేమ శాతాన్ని 20కి పెంచాలని, రైతుల నుంచి 40 క్వింటాళ్లకు మించి కొనుగోలు చేయాలని మంత్రి హరీశ్‌రావు కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి సంతోష్ కుమార్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్రం.. పరిమితిపై ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు, జిన్నింగు మిల్లుల వద్ద కూడా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. కానీ తేమ శాతం సడలించడం, మద్దతు ధర పెంచడం అసాధ్యమని సీసీఐ వర్గాలు తెగేసి చెప్తున్నాయి. ప్రైవేటు వ్యాపారులదే జోరు సీసీఐ వైఖరితో విసిగిపోయిన ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వారు గ్రామాల్లో నేరుగా రైతుల నుంచి క్వింటాల్‌కు రూ. 3,600 నుంచి రూ. 3,700 వరకు చెల్లిస్తున్నారు. డబ్బు చెల్లింపుపై వారం నుంచి నెల దాకా వాయిదాకు అంగీకరిస్తే రూ. 3,900 వరకు లెక్కగడుతున్నారు. ఇక యార్డుల్లో సగటున క్వింటాల్ పత్తి ధర రూ.3,950 నుంచి రూ.3,970 లోపే పలుకుతోంది. క్వింటాల్ ధర రూ. 4 వేలు మించకుండా ప్రైవేటు వ్యాపారులు సిండికేట్‌లా వ్యవహరిస్తున్నారని... వారితో సీసీఐ అధికారులు కుమ్మక్కై మద్దతు ధర దక్కకుండా చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు తెల్లదోమ మూలంగా మహారాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాల్లో పత్తి పంట దెబ్బతినడంతో అక్కడి జిన్నింగు మిల్లులు రాష్ట్రంపై దృష్టి సారించాయి. ఇక పత్తి విత్తనాలకు కూడా మంచి ధర పలుకుతుండటంతో ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు వేగవంతం చేశారు. గుజరాత్లో జిన్నింగ్ మిల్లులు క్వింటాలు పత్తిని క్వింటాల్ రూ. 4,700 వరకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. -
అమాత్యుడొచ్చినా.. ఆగని దోపిడీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సాక్షాత్తూ అమాత్యుడే తమ పక్షాన నిలబడ్డారని ఆనందించిన అన్నదాత సంతోషం అరగంటకే ఆవి రైంది. జమ్మికుంట మార్కెట్ నుంచి మంత్రి వెళ్లిపోగానే సీసీఐ అధికారులు, పత్తి మిల్లర్లు తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. తొలిరోజు మాదిరిగానే రెండోరోజు సైతం సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయలేదు. గురువారం మార్కెట్‌కు ఏకంగా 10వేల క్వింటాళ్లకుపైగా పత్తి వచ్చినా పట్టించుకోలేదు. చివరకు సీసీఐ నిబంధనల ప్రకారం లూజ్పత్తిని తీసుకొచ్చినా.. 8 శాతంలోపే తేమ ఉన్నా కొనలేదు. మంత్రి ఈటల ఉన్న సమయంలో నాలుగు ట్రాలీల్లోని లూజ్పత్తిని కొనుగోలు చేస్తున్నట్లు చెప్పిన అధికారులు ఆయన వెళ్లాక వాటిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో బిత్తరపోవడం రైతుల వంతైంది. మధ్యాహ్నం వరకు వేచిచూసిన రైతులు ఇక చేసేదేమీలేక షరా మామూలుగానే తెచ్చిన పత్తిని మిల్లర్లు, వ్యాపారులు చెప్పిన రేటుకే కట్టబెట్టి వెనుదిరిగారు. క్వింటాల్‌కు రూ.వెయ్యికిపైగా నష్టం సీసీఐ నిబంధనల ప్రకారం 8శాతం తేమ కలిగిన పత్తి క్వింటాల్‌కు రూ.4100 ధర చెల్లించాలి. కానీ జమ్మికుంట మార్కెట్లో గురువా రం 10 వేల క్వింటాళ్లకుపైగా పత్తి వచ్చినా కనీసం ఏ ఒక్క రైతుకూ మద్దతు ధర లభించలేదు. 8 శాతం లోపు తేమ కలిగిన పత్తికి కూడా కనీసధర చెల్లించేందుకు వ్యాపారులు నిరాకరించారు. కనిష్టంగా క్వింటాల్‌కు రూ.2500 నుంచి గరిష్టంగా రూ.3,850 వరకు పత్తిని కొనుగోలు చేశారు. రకరకాల సాకుతో రూ.3,850కు మించి ధర చె ల్లించకపోవడం గమనార్హం. రెండోరోజు మార్కెట్ కొనుగోళ్లను పరిశీలిస్తే కనీస మద్దతు ధర కంటే సగటున వెయ్యి రూపాయల తక్కువకు పత్తిని కొనుగోలు చేశారు. ఈ లెక్కన జమ్మికుంట మార్కెట్లో ఒక్కరోజే రూ.కోటికిపైగా రైతులకు నష్టం వాటిల్లినట్లయింది. బిత్తర పోయిన పత్తి రైతన్న మంత్రి ఈటల గురువారం జమ్మికుంట మార్కెట్‌కు వస్తూనే లూజ్పత్తి తీసుకొచ్చిన రైతుల వాహనాల వద్దకు వెళ్లారు. అక్కడ మొదటి వరసలో లూజ్పత్తి వాహనం ముందున్న సైదాపూర్ మండలంలోని శివరామపల్లికి చెందిన ముదాం రాజయ్య వద్దకు వెళ్లారు. ఆ సమయంలో సీసీఐ అధికారులు లూజ్ పత్తి నాణ్యతను పరిశీలించగా తేమ శాతం 7లోపు ఉన్నట్లు తేలింది. నిబంధనలకు అనుగుణంగా పత్తిని తెచ్చిన రాజయ్యను మంత్రి స్వయంగా అభినందించారు. తన చేత్తో స్వీట్ కూడా తినిపించారు. ఆ వాహనం ముందు కొబ్బరికాయ కొట్టి తూకం ప్రారంభించి ముందుకు కది లారు. మద్దతు ధరకు ఢోకా లేదని మురిసిపోయాడు. కానీ మంత్రి వెళ్లాక సీన్ రివర్స్ అయ్యింది. రైతు గుర్తింపు కార్డు లేదని సీసీఐ అధికారులు తూకం వేయడం నిలిపివేయడంతో బిత్తరపోయాడు. సాయంత్రం వరకు సీసీఐ అధికారులు కొంటారని ఎదురుచూసిన రాజయ్య చివరకు విసిగిపోయి తక్కువ ధరకే పత్తిని వ్యాపారికి అమ్మేసి ఇంటిదారి పట్టాడు. గుర్తింపు కార్డులు తెచ్చుకున్న రైతులదీ దాదాపు ఇదే పరిస్థితి. గురువారం 120 వాహనాల్లో లూజ్పత్తిని తీసుకొచ్చిన రైతుల్లో పలువురికి గుర్తింపు కార్డులున్నప్పటికీ సీసీఐ అధికారులు కొనేందుకు ఆసక్తి చూపలేదు. -
రూ. 30 కోట్లు మింగారు..!
చిలకలూరిపేట : భారత పత్తి కొనుగోలు సంస్థ (సీసీఐ)అధికారుల అవినీతిలో ఇదో కొత్త కోణం. కాటన్ సీడ్స్‌ను తమకు తెలిసిన ఆయిల్ మిల్లులకు తక్కువ ధరకు అందజేసి సీసీఐ బయ్యర్లు, అధికారులు కోట్లు గడించారు. క్వింటాకు రూ. 50 చొప్పున మామూళ్లు అందుకొని రైతులను, ప్రభుత్వాన్ని మోసం చేశారు. ఈ ఏడాది మార్కెట్లో కనిష్టంగా రూ. 2800, గరిష్టంగా రూ. 3,300 వరకు మాత్రమే ప్రైవేటు వ్యాపారులు పత్తిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సీసీఐ రంగంలోకి దిగింది. రైతుల నుంచి తక్కువ మొత్తంలో కొనుగోలు చేసి పెద్ద స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు. ఈ విషయంపై ప్రస్తుతం సీబీఐ విచారణ కొనసాగుతోంది. జిన్నింగ్‌కు మిల్లులకు సరఫరా చేసిన పత్తిలో విత్తనాలు తొలగించి ప్రెస్సింగ్ చేసి దూది బేళ్లను సీసీఐ గోడౌ న్లకు తరలిస్తారు. కిలో పత్తి జిన్నింగ్ చేస్తే అందులో 66 శాతం కాటన్‌సీడ్, 33 శాతం మాత్రమే పత్తి వస్తుంది. అలా వచ్చిన కాటన్ సీడ్‌ను ఆయిల్ మిల్లులకు తరలిస్తారు. గణపవరం, తిమ్మాపురం, యడ్లపాడు పరిధిలో స్థానిక మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బంధువులు, ఆయన అనుచరులకు సంబంధించిన మిల్లులు ఉన్నాయి. ఇక్కడే ఆయిల్‌మిల్లు యజమానులు కీలక పాత్ర వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని ఆయిల్ మిల్లులకు స్థానిక ఆయిల్ మిల్లుల యజమానులే నాయకత్వం వహించి సీడ్ ధర నిర్ణయిస్తారు. సిండికేట్‌గా మారటంతో కాటన్‌సీడ్ ఎట్టిపరిస్థితుల్లోనూ వారు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ పలకదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సారి సీసీఐ 93 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. దీనికి సుమారు 60 లక్షల క్వింటాళ్ల విత్తనాలు వచ్చి ఉంటాయి. ఈ విత్తనాల ధరను నిర్ణయించేదే సీసీఐ, బయ్యర్లే. దీంతో తమకు తెలిసిన మిల్లు యజమానులతో కుమ్మకై తక్కువ ధర నిర్ణయిస్తారు. దీనికి ఆయా మిల్లుల యజమానులు సీసీఐ అధికారులకు, బయ్యర్లకు క్వింటాకు 50 రూపాయలు చొప్పున ఇచ్చారని సమాచారం. దీని ద్వారా 60 లక్షల క్వింటాళ్లకు 30 కోట్ల రూపాయలు అందినట్టు ఇట్టే తెలిసిపోతుంది. పత్తి మద్దతు ధరపై ప్రభావం... కొన్ని రోజుల కిందట వరకు పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక తదితర చోట్ల క్వింటా రూ. 1300 ఉంటే రాష్ట్రంలో కాటన్ సీడ్ ధర రూ. 1100 ఉండటం విశేషం. ఇదే ధరకు బయట జిన్నింగ్‌మిల్లుల నుంచి ఆయిల్ మిల్లుల యజమానులు సీడ్ కొనుగోలు చేస్తారు. ఇలా కాటన్ సీడ్ ధర పతనం కావటంతో ఆ ప్రభావం పత్తి మద్దతు ధరపై కూడా పడుతుంది. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ప్రాంతాల్లో పత్తికి మద్దతు ధర లభించదు. ఈ ఏడాది స్థానికంగా సీసీఐ కేంద్రాల ద్వారా ప్రభుత్వం రూ. 4050 మద్దతు ధర ప్రకటించగా ఇతర రాష్ట్రాల్లో ఇదే ధరకు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసిన విషయాన్ని కొంతమంది ప్రస్తావిస్తున్నారు. ఈ వ్యత్యాసానికి కారణం కాటన్సీడ్ను కొలుగోలు చేసే మిల్లుల యజమానులు సిండికేట్‌గా మా రటమేనని రైతు నాయకులు చెబుతున్నారు. -
కాటన్..టెన్షన్..!
- పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై ఆందోళన - రికార్డులు తారుమారు చేసే పనిలో సీసీఐ అధికారులు, బయ్యర్లు, బ్రోకర్లు - మంత్రి ప్రత్తిపాటిని కలసిన దళారులు, పారిశ్రామికవేత్తలు - నామామాత్ర విచారణ జరిగేలా చూడాలని వేడుకోలు - మరో వైపు విచారణకు ప్రభుత్వ అనుమతి కోరిన విజిలెన్స్ ఎస్పీ సాక్షి ప్రతినిధి, గుంటూరు : పత్తి కొనుగోలులోని అవినీతి ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని వివిధ శాఖల అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఈ అక్రమంలో ముఖ్య భూమిక వహించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీసీఐ అధికారులు, బయ్యర్లు, బ్రోకర్లు పాత రికార్డులను సరిచేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిలో తెరవెనుక ఉండి వ్యవహారం నడిపిన ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు సేఫ్ జోన్లోనే ఉంటారని, తమపైనే వేటు పడుతుందనే ఆందోళనలో సీసీఐ అధికారులు, బయ్యర్లు, మార్కెటింగ్ శాఖ సిబ్బంది ఉన్నారు. ఈ గండం నుంచి తమను గట్టెక్కించకపోతే విచారణలో అసలు బండారం బయట పెడతామని కొందరు హెచ్చరించడంతో ఈ వ్యవహారం ముదురు పాకాన పడింది. దీంతో కొంతమంది దళారీలు, పత్తి ఆధారిత పారిశ్రామికవేత్తలు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కలసి విచారణ నామమాత్రంగా జరిగే విధంగా చూడాలని కోరినట్టు తెలుస్తోంది. ఈ అక్రమాలపై సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశాలు ఇస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, తమతోపాటు అనేక మంది నేరస్తులుగా మిగిలిపోతారని చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పత్తి కొనుగోలులోని అక్రమాలపై వివిధ దినపత్రికలు ప్రత్యేక కథనాలు ప్రచురి ంచడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్.పి. కేవీ మోహన్‌రావు వాటి వివరాలను ప్రభుత్వానికి వివరించారు. విచారణకు అనుమతి కోరారు. అయితే సీబీఐతోనే విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సమాచార హక్కు చట్టం కింద పత్తి కొనుగోలుకు సంబంధించిన వివరాలను అందించాలని సీసీఐ అధికారులను విపక్షాల ప్రతినిధులు కోరారు. రికార్డుల తారుమారు ... జిల్లాలోని 11 కొనుగోలు కేంద్రాల్లో పెద్ద మొత్తంలో పత్తి కొనుగోలు చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసినప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని ఆ కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బంది, పరిసర ప్రాంతాల రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట మార్కెట్‌యార్డులో 2.19 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. వాస్తవంగా మిగిలిన కొనుగోలు కేంద్రాల్లో సెప్టెంబరులో కొనుగోళ్లు ప్రారంభమైతే చిలకలూరిపేటలో మంత్రి కుమార్తె వివాహ వేదిక మార్కెట్‌యార్డు కావడంతో నవంబరులో ప్రారంభించారు. అప్పటికే రైతులు ప్రైవేట్ వ్యాపారుల పేరుతో చెలామణి అయిన మంత్రి అనుచరులకు క్వింటాలు రూ.3500లోపే అమ్ముకున్నారు. ఏప్రిల్ 15తో కొనుగోళ్లు నిలిపివేశామని సీసీఐ అధికారులు ప్రకటించినా, మార్చినెలాఖరునాటికి కొను గోళ్లు నిలిచిపోయాయి. ఈ కేంద్రంలో లక్ష క్వింటాళ్ల లోపే కొనుగోళ్లు జరిగినట్టు అక్కడి సిబ్బంది, పరిసర ప్రాంతాల రైతులు చెబుతున్నారు. రికార్డుల్లోని మిగిలిన తేడాను సరిచేసేందుకు మిగిలిన ప్రాంతాల నుంచి పత్తి కొనుగోలు కేంద్రానికి వచ్చినట్టుగా రికార్డులు తారుమారు చేస్తున్నారని, గుంటూరు మార్కెట్ యార్డులోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇంకా పూర్తికాని విచారణ ..... ఇదిలాఉండగా, 2004లో కూడా పత్తి కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో దీనిపై సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. అనేక మంది ఉద్యోగులు, అధికారులు విచారణకు హాజరవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సిబ్బంది కూడా ఆందోళన చెందుతున్నారు. -
కొనేదిలేదు..
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం సీసీఐ అధికారులు పత్తి కొనుగోళ్లలో కొర్రీలు పెట్టారు. నిబంధనల మేరకు సరుకులేదంటూ కొనుగోళ్లను నిలిపి వేశారు. దాదాపు మూడున్నర గంటలకు పైగా సరకు కొనుగోలు చేయలేదు. రైతులు ఆందోళనకు దిగడంతో ఖమ్మం ఆర్డీవో వినయ్‌కృష్ణారెడ్డి అక్కడికి చేరుకున్నారు. సీసీఐ అధికారులతో మాట్లాడి కొనుగోళ్లు జరిపించారు.మార్కెట్లోని సీసీఐ కొనుగోలు కేంద్రానికి బుధవారం దాదాపు 40 వేల బస్తాల పత్తి అమ్మకానికి వచ్చింది. ముగ్గురు సీసీఐ అధికారులు మాయిశ్చర్ యంత్రం తీసుకొని తేమ చూసేందుకు ఉదయం 8:30 గంటల సమయంలో యార్డులోకి వెళ్లారు. మునుపెన్నడూ లేని విధంగా మాయిశ్చర్ యంత్రంతో పరీక్షలు చేసి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సరుకు లేదని కొనుగోళ్లకు నిరాకరించారు. అమ్మకానికి వచ్చిన దాదాపు 90 శాతం సరుకును తిరస్కరించడంతో రైతులు బిత్తరపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీసీఐ అధికారులు తేమ పేరుతో కొనుగోళ్లు జరపకపోవటంపై రైతులు ఆందోళనకు దిగారు. విషయం తెలిసి త్రీటౌన్ పోలీస్‌లు మార్కెట్‌కు చేరుకున్నారు. రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. త్రీటౌన్ సీ.ఐ రెహమాన్, ఎస్ఐలు కుమారస్వామి, సర్వయ్య, సీసీఐ అధికారులు శివశంకర్ వశిష్ట, ఖాన్, షకీల్, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్‌జావీద్, మార్కెటింగ్ శాఖ ఇన్చార్జి సహాయ సంచాలకులు అలీంతో చర్చించారు. సరుకు కొనుగోలులో వారికున్న నిబంధనలను సీసీఐ అధికారులు వివరించారు. ఈ చర్చలు కొనసాగుతున్న సమయంలోనే సమస్య జిల్లా జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ దృష్టికి వెళ్లింది. జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో ఖమ్మం ఆర్డీవో వినయ్ కృష్ణారెడ్డి మార్కెట్‌కు చేరుకున్నారు. తొలుత సీసీఐ, మార్కెట్ అధికారులను సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. పంట ఉత్పత్తిని కొనుగోలు చేయాలని, సీసీఐ కేంద్రం లక్ష్యం నెరవేరాలని అధికారులకు సూచించారు. అనంతరం బయటకు వచ్చి రైతులతో మాట్లాడారు. కొందరు రైతులు పంట పండించటంలో చోటుచేసుకున్న ఇబ్బందులు, వర్షాభావ పరిస్థితులు, సీసీఐ కేంద్రంలో ఎదురవుతున్న బాధలను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్తారు. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పంట ఉత్పత్తిలో తేమ ఉంటుందని రైతులు వాదించారు. అమ్మకానికి తీసుకువచ్చిన తమ సరుకును సీసీఐతో కొనుగోలు చేయించాలని ఆర్డీవోకు మొరపెట్టుకున్నారు. సీసీఐ సరుకును కొనుగోలు చేస్తుంది కానీ నాణ్యమైన పత్తిని మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు రైతులు ప్రయత్నించాలని ఆర్డీవో సూచించారు. ఆర్డీవో సూచన మేరకు సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించింది. సీసీఐ అధికారులు, మార్కెట్ అధికారులను ఆర్డీవో వెంటబెట్టుకొని రైతుల సరుకు వద్దకు తీసుకెళ్లారు. దగ్గరుండి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలకు కొనుగోలు చేయించారు. తేమశాతం ఆధారంగా క్వింటాలు రూ.3,868 నుంచి రూ.4,050 వరకు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంపై మార్కెట్ అధికారులు, సీసీఐ అధికారులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి జాయింట్ కలెక్టర్‌కు మార్కెట్లో తల్తెతిన సమస్యను వివరించినట్లు సమాచారం.