‘ప్రత్తి’పాపం మాఫీయేనా? | CCI manager of the center on the transfer issue | Sakshi
Sakshi News home page

‘ప్రత్తి’పాపం మాఫీయేనా?

Published Mon, Nov 23 2015 3:21 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

‘ప్రత్తి’పాపం మాఫీయేనా? - Sakshi

‘ప్రత్తి’పాపం మాఫీయేనా?

♦ సీఎంకు విజిలెన్స్ ఇచ్చిన నివేదిక బుట్టదాఖలు
♦ గుంటూరు జిల్లాలో రైతుల నుంచి తక్కువ ధరకు
 పత్తిని కొనుగోలు చేసిన ‘కీలక’ మంత్రి!
♦  బోగస్ రైతుల పేర్లతో సీసీఐకి అధిక ధరలకు విక్రయం
♦ 47,903.91 క్వింటాళ్లు బోగస్ రైతుల నుంచి
 సీసీఐ కొనుగోలు చేసినట్లు నిర్ధారణ
♦  సీసీఐ మేనేజర్‌పై బదిలీ వేటు వేసిన కేంద్రం
 
 సాక్షి, హైదరాబాద్: పత్తి రైతుల కడుపు కొట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన కీలక మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దన్నుగా నిలుస్తున్నారు. గుంటూరు జిల్లాలో సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సేకరించిన పత్తిలో.. 80 శాతం పత్తిని బోగస్ రైతుల నుంచే కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తేల్చింది. సీబీఐ దర్యాప్తులో సైతం ఇదే వెల్లడైంది. విజిలెన్స్, సీబీఐ నివేదికల ఆధారంగా సీసీఐ మేనేజర్ ఆర్.జయకుమార్‌పై కేంద్రం బదిలీ వేటు వేసింది. కానీ.. సీఎం చంద్రబాబు మాత్రం విజిలెన్స్ నివేదికను బుట్టదాఖలు చేసి, కుంభకోణానికి సూత్రధారి అయిన కీలక మంత్రికి బాసటగా నిలుస్తున్నారు.

గతేడాది పత్తికి క్వింటాలుకు మొదటి రకానికి రూ.4050, రెండో రకానికి రూ.3750ను కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)గా కేంద్రం నిర్ణయించింది. రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చేసేందుకు దేశవ్యాప్తంగా సీసీఐని రంగంలోకి దించింది. గుంటూరు జిల్లాలో జిన్నింగ్ పరిశ్రమలను గుప్పిట్లో పెట్టుకున్న ఓ కీలక మంత్రి, సీసీఐ అధికారులతో కుమ్మక్కయ్యారు. మార్కెట్ యార్డుల్లో సీసీఐ పత్తిని కొనుగోలు చేయకుండా చేసిన కీలక మంత్రి దళారీల ద్వారా తక్కువ ధరలకే రైతుల నుంచి పత్తిని ఖరీదు చేశారు. అదే పత్తిని ఎమ్మెస్పీ ధరలకు సీసీఐకి విక్రయించి  కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు.

 విజిలెన్స్ విచారణలో రట్టు
 గుంటూరు జిల్లాలో పత్తి కొనుగోళ్లలో అక్రమాలపర్వంపై రైతు సంఘాలు ఉద్యమించాయి. సీబీఐతోపాటు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఈ అక్రమాలపై దర్యాప్తు చేసింది. సీసీఐ పత్తి కొనుగోలు చేసిన రైతులను విజిలెన్స్ అధికారులు విచారించారు. 900 మంది రైతులను విచారిస్తే.. ఇందు లో 719 మంది రైతులు బోగస్‌గా తేలింది. 719 మంది రైతుల నుంచి 47,903.91 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు సీసీఐ అధికారులు రికార్డులు సృష్టించారు.

సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని జిన్నిం గ్ మిల్లులకు పంపి ప్రాసెసింగ్ చేయిస్తుంది. ఇందు కు సంబంధించిన రికార్డులు జిన్నింగ్ మిల్లుల వద్ద లేవన్నది విజిలెన్స్ దర్యాప్తులో వెల్లడైంది. సీసీఐ కొనుగోలు చేసిన పత్తిలో 80 శాతం బోగస్ రైతుల నుంచి సేకరించిందేనని విజిలెన్స్ నిర్ధారించింది. సీసీఐ అధికారులతో కలిసి ఓ కీలక మంత్రి రూ.75 కోట్లకుపైగా కొల్లగొట్టినట్లు సీబీఐ విచారణలో వెల్లడైనట్లు సమాచారం. సీబీఐ ప్రాథమిక నివేదికతోపాటూ విజిలెన్స్ నివేదికను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. సీసీఐ మేనేజర్ జయకుమార్‌తోపాటూ ముగ్గురు బయ్యర్లపై బదిలీ వేటు వేసింది.

 సూత్రధారికి అభయం!
 విజిలెన్స్ నివేదికలపై ఇటీవల సీఎం చంద్రబాబు సమీక్షించారు. పత్తి కుంభకోణంపై విజిలెన్స్ ఇచ్చిన నివేదికపై దృష్టి సారించకపోవడం గమనార్హం. విజిలెన్స్ నివేదికపై చర్యలు తీసుకుంటే.. కీలక మంత్రిపై కేసు నమోదు చేయాల్సి వస్తుంది. ఇది రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతుందని సీఎం ఆందోళన చెందుతుండటం, కీలక మంత్రి తనకు అత్యంత సన్నిహితుడు కావడంతో నివేదికను బుట్టదాఖలు చేసినట్లు అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీఎం దన్నుగా నిలుస్తోండటంతో ఈ ఏడాదీ సీసీఐ అధికారులతో కలిసి పత్తి రైతులను లూటీ చేయడానికి ఆ కీలక మంత్రి పావులు కదుపుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement