చిలకలూరిపేట : భారత పత్తి కొనుగోలు సంస్థ (సీసీఐ)అధికారుల అవినీతిలో ఇదో కొత్త కోణం. కాటన్ సీడ్స్‌ను తమకు తెలిసిన ఆయిల్ మిల్లులకు తక్కువ ధరకు అందజేసి సీసీఐ బయ్యర్లు, అధికారులు కోట్లు గడించారు. క్వింటాకు రూ. 50 చొప్పున మామూళ్లు అందుకొని రైతులను, ప్రభుత్వాన్ని మోసం చేశారు. ఈ ఏడాది మార్కెట్‌లో కనిష్టంగా రూ. 2800, గరిష్టంగా రూ. 3,300 వరకు మాత్రమే ప్రైవేటు వ్యాపారులు పత్తిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సీసీఐ రంగంలోకి దిగింది. రైతుల నుంచి తక్కువ మొత్తంలో కొనుగోలు చేసి పెద్ద స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు.
ఈ విషయంపై ప్రస్తుతం సీబీఐ విచారణ కొనసాగుతోంది. జిన్నింగ్‌కు మిల్లులకు సరఫరా చేసిన పత్తిలో విత్తనాలు తొలగించి ప్రెస్సింగ్ చేసి దూది బేళ్లను సీసీఐ గోడౌ న్‌లకు తరలిస్తారు. కిలో పత్తి జిన్నింగ్ చేస్తే అందులో 66 శాతం కాటన్‌సీడ్, 33 శాతం మాత్రమే పత్తి వస్తుంది. అలా వచ్చిన కాటన్ సీడ్‌ను ఆయిల్ మిల్లులకు తరలిస్తారు. గణపవరం, తిమ్మాపురం, యడ్లపాడు పరిధిలో స్థానిక మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బంధువులు, ఆయన అనుచరులకు సంబంధించిన మిల్లులు ఉన్నాయి. ఇక్కడే ఆయిల్‌మిల్లు యజమానులు కీలక పాత్ర వహిస్తారు.
రాష్ట్రంలోని అన్ని ఆయిల్ మిల్లులకు స్థానిక ఆయిల్ మిల్లుల యజమానులే నాయకత్వం వహించి సీడ్ ధర నిర్ణయిస్తారు. సిండికేట్‌గా మారటంతో కాటన్‌సీడ్ ఎట్టిపరిస్థితుల్లోనూ వారు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ పలకదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సారి సీసీఐ 93 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. దీనికి సుమారు 60 లక్షల క్వింటాళ్ల విత్తనాలు వచ్చి ఉంటాయి. ఈ విత్తనాల ధరను నిర్ణయించేదే సీసీఐ, బయ్యర్లే. దీంతో తమకు తెలిసిన మిల్లు యజమానులతో కుమ్మకై తక్కువ ధర నిర్ణయిస్తారు. దీనికి ఆయా మిల్లుల యజమానులు సీసీఐ అధికారులకు, బయ్యర్లకు క్వింటాకు 50 రూపాయలు చొప్పున ఇచ్చారని సమాచారం. దీని ద్వారా 60 లక్షల క్వింటాళ్లకు 30 కోట్ల రూపాయలు అందినట్టు ఇట్టే తెలిసిపోతుంది.
పత్తి మద్దతు ధరపై ప్రభావం...
కొన్ని రోజుల కిందట వరకు పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక తదితర చోట్ల క్వింటా రూ. 1300 ఉంటే రాష్ట్రంలో కాటన్ సీడ్ ధర రూ. 1100 ఉండటం విశేషం. ఇదే ధరకు బయట జిన్నింగ్‌మిల్లుల నుంచి ఆయిల్ మిల్లుల యజమానులు సీడ్ కొనుగోలు చేస్తారు. ఇలా కాటన్ సీడ్ ధర పతనం కావటంతో ఆ ప్రభావం పత్తి మద్దతు ధరపై కూడా పడుతుంది. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ప్రాంతాల్లో పత్తికి మద్దతు ధర లభించదు. ఈ ఏడాది స్థానికంగా సీసీఐ కేంద్రాల ద్వారా ప్రభుత్వం రూ. 4050 మద్దతు ధర ప్రకటించగా ఇతర రాష్ట్రాల్లో ఇదే ధరకు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసిన విషయాన్ని కొంతమంది ప్రస్తావిస్తున్నారు. ఈ వ్యత్యాసానికి కారణం కాటన్‌సీడ్‌ను కొలుగోలు చేసే మిల్లుల యజమానులు సిండికేట్‌గా మా రటమేనని రైతు నాయకులు చెబుతున్నారు.
రూ. 30 కోట్లు మింగారు..!
Published Tue, May 12 2015 5:10 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement