అమాత్యుడొచ్చినా.. ఆగని దోపిడీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సాక్షాత్తూ అమాత్యుడే తమ పక్షాన నిలబడ్డారని ఆనందించిన అన్నదాత సంతోషం అరగంటకే ఆవి రైంది. జమ్మికుంట మార్కెట్ నుంచి మంత్రి వెళ్లిపోగానే సీసీఐ అధికారులు, పత్తి మిల్లర్లు తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. తొలిరోజు మాదిరిగానే రెండోరోజు సైతం సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయలేదు. గురువారం మార్కెట్‌కు ఏకంగా 10వేల క్వింటాళ్లకుపైగా పత్తి వచ్చినా పట్టించుకోలేదు. చివరకు సీసీఐ నిబంధనల ప్రకారం లూజ్‌పత్తిని తీసుకొచ్చినా.. 8 శాతంలోపే తేమ ఉన్నా కొనలేదు.
మంత్రి ఈటల ఉన్న సమయంలో నాలుగు ట్రాలీల్లోని లూజ్‌పత్తిని కొనుగోలు చేస్తున్నట్లు చెప్పిన అధికారులు ఆయన వెళ్లాక వాటిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో బిత్తరపోవడం రైతుల వంతైంది. మధ్యాహ్నం వరకు వేచిచూసిన రైతులు ఇక చేసేదేమీలేక షరా మామూలుగానే తెచ్చిన పత్తిని మిల్లర్లు, వ్యాపారులు చెప్పిన రేటుకే కట్టబెట్టి వెనుదిరిగారు.
క్వింటాల్‌కు రూ.వెయ్యికిపైగా నష్టం
సీసీఐ నిబంధనల ప్రకారం 8శాతం తేమ కలిగిన పత్తి క్వింటాల్‌కు రూ.4100 ధర చెల్లించాలి. కానీ జమ్మికుంట మార్కెట్‌లో గురువా రం 10 వేల క్వింటాళ్లకుపైగా పత్తి వచ్చినా కనీసం ఏ ఒక్క రైతుకూ మద్దతు ధర లభించలేదు. 8 శాతం లోపు తేమ కలిగిన పత్తికి కూడా కనీసధర చెల్లించేందుకు వ్యాపారులు నిరాకరించారు.
కనిష్టంగా క్వింటాల్‌కు రూ.2500 నుంచి గరిష్టంగా రూ.3,850 వరకు పత్తిని కొనుగోలు చేశారు. రకరకాల సాకుతో రూ.3,850కు మించి ధర చె ల్లించకపోవడం గమనార్హం. రెండోరోజు మార్కెట్ కొనుగోళ్లను పరిశీలిస్తే కనీస మద్దతు ధర కంటే సగటున వెయ్యి రూపాయల తక్కువకు పత్తిని కొనుగోలు చేశారు. ఈ లెక్కన జమ్మికుంట మార్కెట్‌లో ఒక్కరోజే రూ.కోటికిపైగా రైతులకు నష్టం వాటిల్లినట్లయింది.
బిత్తర పోయిన పత్తి రైతన్న
మంత్రి ఈటల గురువారం జమ్మికుంట మార్కెట్‌కు వస్తూనే లూజ్‌పత్తి తీసుకొచ్చిన రైతుల వాహనాల వద్దకు వెళ్లారు. అక్కడ మొదటి వరసలో లూజ్‌పత్తి వాహనం ముందున్న సైదాపూర్ మండలంలోని శివరామపల్లికి చెందిన ముదాం రాజయ్య వద్దకు వెళ్లారు. ఆ సమయంలో సీసీఐ అధికారులు లూజ్ పత్తి నాణ్యతను పరిశీలించగా తేమ శాతం 7లోపు ఉన్నట్లు తేలింది. నిబంధనలకు అనుగుణంగా పత్తిని తెచ్చిన రాజయ్యను మంత్రి స్వయంగా అభినందించారు. తన చేత్తో స్వీట్ కూడా తినిపించారు.
ఆ వాహనం ముందు కొబ్బరికాయ కొట్టి తూకం ప్రారంభించి ముందుకు కది లారు. మద్దతు ధరకు ఢోకా లేదని మురిసిపోయాడు. కానీ మంత్రి వెళ్లాక సీన్ రివర్స్ అయ్యింది. రైతు గుర్తింపు కార్డు లేదని సీసీఐ అధికారులు తూకం వేయడం నిలిపివేయడంతో బిత్తరపోయాడు. సాయంత్రం వరకు సీసీఐ అధికారులు కొంటారని ఎదురుచూసిన రాజయ్య చివరకు విసిగిపోయి తక్కువ ధరకే పత్తిని వ్యాపారికి అమ్మేసి ఇంటిదారి పట్టాడు. గుర్తింపు కార్డులు తెచ్చుకున్న రైతులదీ దాదాపు ఇదే పరిస్థితి. గురువారం 120 వాహనాల్లో లూజ్‌పత్తిని తీసుకొచ్చిన రైతుల్లో పలువురికి గుర్తింపు కార్డులున్నప్పటికీ సీసీఐ అధికారులు కొనేందుకు ఆసక్తి చూపలేదు.