jammikunta market
-
రికార్డు ధర: గజ్వేల్‌లో రూ.8,261 జమ్మికుంటలో రూ.8,150
జమ్మికుంట/ఆదిలాబాద్ టౌన్/ ఖమ్మం వ్యవసాయం/సిద్దిపేట: తెల్ల బంగారం ధరలో రికార్డులు సృష్టిస్తోంది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.6,025 ఉండగా, బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.2 వేలకుపైబడి ధర పలుకుతోంది. మంగళవారం గజ్వేల్ మార్కెట్లో క్వింటాల్ పత్తికి రూ.8,261 ధర లభించింది. ఇంకా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో రూ.8,150, ఆదిలాబాద్ మార్కెట్లో రూ.8,020, వరంగల్ ఏనుమాముల మార్కెట్లో రూ.7,960, జనగామ మార్కెట్లో రూ.7,900, ఖమ్మంలో రూ.7,800 ధరకు వ్యాపారులు కొను గోలుచేశారు. దేశవ్యాప్తంగా పత్తి దిగుబడి తగ్గినందుకే ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. విదేశాల్లో పత్తి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందని, రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. కాగా, మంగళవారం పై ప్రధాన మార్కెట్లకు పెద్దసంఖ్యలో వాహనాల్లో పత్తి వచ్చింది. అన్నిచోట్లా మోడల్ ధర క్వింటాకు రూ.8 వేలకుపైగా, కనిష్టంగా రూ.7,900 చొప్పున వ్యాపారులు రైతులకు చెల్లించారు. (చదవండి: Anthrax At Warangal: ఆంత్రాక్స్ వ్యాధి కలకలం: మటన్ కొంటున్నారా..? జర జాగ్రత్త!) -
తగ్గిన సీసీఐ.. తలొగ్గిన మిల్లర్లు!
సాక్షి, జమ్మికుంట(హుజూరాబాద్): భారత పత్తి సంస్థ(సీసీఐ), తెలంగాణ పత్తి మిల్లర్ల మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్‌కు తాత్కాలికంగా తెరపడింది. బేళ్ల తయారీలో విధిస్తున్న నిబంధనలను పునః పరిశీలిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వ్యాపారులు వెనక్కి తగ్గారు. ఈ మేరకు 2019–20 సీజన్ కోసం సీసీఐ మళ్లీ టెండర్లు ఆహ్వానించగా, దాఖలు చేసేందుకు మిల్లర్లు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని మూడు రీజియన్ల పరిధిలో 108 కేంద్రాల నుంచి టెండర్లు పిలవగా.. ఇందులో వరంగల్ పరిధిలో 55 కేంద్రాలు ఉన్నాయి. సీజన్‌కు ముందే సీసీఐ ఏర్పాట్లు.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోళ్ల సీజన్‌కు ముందే బేళ్ల తయారీ, రవాణాకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటుంది. ఈ మేరకు జూలై లేదా ఆగస్టులో జిన్నింగు మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లు నుంచి టెండర్లు ఆహ్వానిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే మార్కెట్లో పత్తి కొనుగోళ్లకు దిగుతుంది. ఎప్పటిలాగే ఈ యేడు కూడా 2019–20 సీజన్ కోసం జిన్నింగు, ప్రెస్సింగు, బేళ్ల రవాణాకు జూలై 26న టెండర్లు పిలిచింది. దాఖలుకు ఆగస్టు 14 వరకు గడువిచ్చింది. రాష్ట్రంలోని వరంగల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ రీజియన్ల పరిధిలోని 108 కేంద్రాల వ్యాపారుల నుంచి టెండర్లకు తెర తీయగా.. తెలంగాణ నుంచి ఎవరూ దాఖలు చేయలేదు. నిరుడు సీసీఐ అమల్లోకి తెచ్చిన నిబంధనలను నిరసిస్తూ రాష్ట్ర పత్తి వ్యాపారుల సంక్షేమ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. లింట్, ట్రాష్, షార్టేజీ శాతం, బేళ్ల తయారీ ఛార్జీపై అసంతృప్తితో ఉన్న మిల్లర్లు టెండర్లకు దూరంగా నిలిచారు. ఈ వ్యవహారంపై గత నెల 18న ‘సాక్షి’లో ‘సీసీఐకి పత్తి మిల్లర్ల షాక్’ శీర్షికన కథనం ప్రచురించింది. స్పందించిన రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ అధికారులు సమస్యపై ఆరా తీశారు. ఈ మేరకు ఆగస్టు 25న హైదరాబాద్ గోల్కొండ హోటల్లో వ్యవసాయశాఖ, మార్కెటింగ్‌శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో ఇరువర్గాలతో చర్చలు జరిపారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కరించుకోవాలని మంత్రి వారికి సూచించారు. సీసీఐ హామీకి సమ్మతించిన మిల్లర్లు.. సీసీఐ షరతులపై నైరాశ్యంతో ఉన్న రాష్ట్ర పత్తి మిల్లర్ల సంక్షేమ సంఘం.. మంత్రి నిరంజన్‌రెడ్డి సూచనతో వెనక్కి తగ్గింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు ముంబయిలోని సీసీఐ ప్రధాన కార్యాలయంలో ఇప్పటికి రెండుసార్లు చర్చలు జరిపారు. ఇప్పుడున్న దూది, దుమ్ము, తరుగు శాతంతో తమకు నష్టం వాటిల్లినట్లు ప్రతినిధులు సీసీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బేళ్ల తయారీ ఛార్జీ తక్కువగా ఉందని, మిల్లుల నిర్వహణకు ఇవి ఏమాత్రం చాలడం లేదని వివరించారు. జిన్నింగు మిల్లులు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను పూర్తిగా వివరించారు. ఈ మేరకు సడలించాల్సిన షరతులను విన్నవించగా, అధికారులు సానుకూలంగా స్పందించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక దీనిపై నిర్ణయం తీసుకుంటామని సీసీఐ హామీ ఇవ్వగా, సంఘం ప్రతినిధులు సమ్మతించారు. దీంతో అధికారులు మూడు రీజియన్ల పరిధిలోని పత్తి మిల్లర్ల నుంచి గురువారం మళ్లీ టెండర్లు పిలిచారు. దాఖలుకు ఈ నెల 11 వరకు గడువిచ్చారు. ప్రస్తుతానికి సమస్య తీరడంతో వ్యాపారులు క్రమంగా టెండర్లు వేస్తున్నారు. వరంగల్ రీజియన్‌లో 55 కేంద్రాలు.. తెలంగాణలో సీసీఐకి మూడు రీజియన్లు ఉన్నాయి. వరంగల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌లో వాటిని నిర్వహిస్తున్నారు. మూడు రీజియన్ల పరిధిలో సీసీఐ ఈసారి 108 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. వరంగల్ రీజియన్‌లో 55, మహబూబ్‌నగర్‌లో 29, ఆదిలాబాద్ రీజియన్‌లో 24 కేంద్రాలను నెలకొల్పేందుకు కసరత్తు పూర్తి చేసింది. పరిస్థితులకు అనుగుణంగా వీటిని పెంచే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట, కరీంనగర్, గోపాల్రావుపేట, గంగాధర, చొప్పదండి, హుజూరాబాద్, వేములవాడ, పెద్దపల్లి, కమాన్‌పూర్, సుల్తానాబాద్, మంథని, వెల్గటూర్ కేంద్రాలు సీసీఐ జాబితాలో ఉన్నాయి. ఈ నెలాఖరు నుంచి అన్ని కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లకు సిద్ధంగా ఉండేందుకు సీసీఐ సన్నాహాలు సాగిస్తోంది. -
సరుకుల రవాణాకు ‘ఈ–పర్మిట్’
సాక్షి, జమ్మికుంట(హుజూరాబాద్): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పత్తి దిగుబడి ఏటా 35 లక్షల క్వింటాళ్లకు పైగా వస్తుంది. రైతులు పూర్తిగా విక్రయించినా మార్కెట్ దస్త్రాల్లో సగం కూడా నమోదు కావడం లేదు. మరి మిగతా సరుకులు ఎక్కడికి వెళ్తున్నాయి.. కొనుగోలుదారులు కట్టాల్సిన పన్నులను ఎవరు తన్నుకుపోతున్నారు.. సర్కారు ఖజానాకు ఏ మేరకు గండిపడుతోంది..? కొన్నేళ్లుగా అందరిలో వెల్లువెత్తుతున్న సందేహాలు ఇవి. ఆలస్యంగానైనా మేల్కొన్న రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ అవినీతికి తెరదింపేందుకు కొత్తగా ఈ–పర్మిట్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, సరుకుల రవాణా, పన్నుల వసూళ్లలో అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టింది. ఇకపై లెక్కలు పక్కాగా చూపేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. భారీగా ప్రధాన పంటల దిగుబడులు.. ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్, రబీ కలుపుకొని ఏటా 6.80 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయి. ఇందులో రెండు లక్షల హెక్టార్లు పత్తి, మూడు లక్షల హెక్టార్లు వరి, లక్ష హెక్టార్లలో మొక్కజొన్న పండిస్తారు. 35 లక్షల నుంచి 40 లక్షల క్వింటాళ్ల పత్తి, 1.80 కోట్ల క్వింటాళ్ల వరి, 50 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వస్తుంది. మార్కెట్లో ఇరు సీజన్లలో క్రయవిక్రయాలు సాగుతాయి. వరి, మొక్కజొన్న పంటలను ప్రభుత్వ రంగ సంస్థలే అధికంగా సేకరిస్తుండగా, పత్తిని పూర్తిగా మిల్లర్లు, ట్రేడర్లు కొంటున్నారు. నిబంధనల ప్రకారం.. వ్యాపారులు సరుకుల కొనుగోళ్ల వివరాలను రోజూ మార్కెట్ అధికారులకు ఇవ్వాలి. బేళ్లు, గింజలు, బియ్యం, మక్కలు, ఇతర అపరాల ఎగుమతికి కార్యదర్శి నుంచి రవాణా పర్మిట్ తీసుకోవాలి. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కొనుగోలు చేసిన సరుకుల విలువలో ఒకశాతం పన్నుగా చెల్లించాలి. మార్కెట్ ఆదాయానికి భారీగా గండి.. కొందరు వ్యాపారులు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. కొన్న సరుకులు, మార్కెట్‌కు చూపుతున్న లెక్కలకు పొంతన ఉండడం లేదు. ప్రధానంగా మిల్లుల్లో కొంటున్న సరుకులను పూర్తిస్థాయిలో చూపడంలేదు. అధికారులకు రోజూ ఇవ్వాల్సిన వివరాలను నెలకు ఒక్కసారి కూడా సమర్పించడం లేదు. అడిగే దిక్కులేక చాలామంది వ్యాపారులు తప్పుడు లెక్కలతో మార్కెట్ ఆదాయానికి గండికొడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో లోపాయికారీ ఒప్పందాలతో మాన్యువల్ పర్మిట్లు తీసుకుంటూ సరుకులను రవాణా చేస్తున్నారు. గ్రామాల్లో రైతుల నుంచి నేరుగా పత్తి, ధాన్యం, మక్కలు ఖరీదు చేస్తున్న దళారులు ఆయా చెక్‌పోస్టుల్లో చేతివాటం ప్రదర్శిస్తూ సరుకులను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇలా ఏటా లక్షలాది క్వింటాళ్లు వక్రమార్గంలో ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. దీంతో సర్కారు ఖజానాకు రూ.కోట్లలో నష్టం వాలిల్లుతోంది. ఇది బహిరంగమే అయినా అధికారుల్లో చలనం కరువైంది. నామమాత్రపు తనిఖీలతో అక్రమ వ్యాపారానికి అడ్డులేకుండా పోయింది. ఎట్టకేలకు మేల్కొన్న మార్కెటింగ్‌శాఖ.. ఏళ్లుగా సాగుతున్న అవినీతిని ఎట్టకేలకు మార్కెటింగ్‌శాఖ గుర్తించింది. కొనుగోళ్లలో పారదర్శకత, పూర్థిసాయిలో పన్నుల వసూళ్లకు కొత్తగా ఈ–పర్మిట్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం సదరుశాఖ రూపొందించిన వెబ్సైట్లో తొలుత మిల్లర్లు, ట్రేడర్లు వారి సంస్థలకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాలి. మార్కెట్ అధికారులు పరిశీలించాక యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. భద్రత కోసం పాస్వర్డ్ మార్చుకునే వీలుంది. వ్యాపారులు వెబ్సైట్లో లాగిన్ అయ్యాక సరుకుల కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చాలి. యార్డులో అయితే కమీషన్ ఏజెంట్ ద్వారా ఎన్ని క్వింటాళ్లు కొన్నారనేది చూపితే సరిపోతుంది. ఎందుకంటే రైతుల వివరాలను మార్కెట్ సిబ్బంది రికార్డుల్లో చేరుస్తారు. గ్రామాల్లో, మిల్లుల్లో నేరుగా కొంటే.. సరుకులు అమ్మిన రైతుల వివరాల(చిరునామా, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్)ను వ్యాపారులు పూర్తిగా నమోదు చేయాలి. నెలవారీ కొనుగోళ్ల ప్రకారం ప్రతినెలా పదో తేదీ లోపు పూర్తిగా పన్ను(సరుకుల విలువలో ఒకశాతం) చెల్లించాలి. ఇవి పాటిస్తేనే బేళ్లు, గింజలు, బియ్యం, మక్కలు, అపరాలు తదితర ఉత్పత్తుల రవాణాకు ఆన్లైన్లో ఈ–పర్మిట్ జారీచేస్తారు. ఈ విధానం గతనెల 26న ఉమ్మడి జిల్లాలో అమల్లోకి రాగా.. మిల్లర్లు, ట్రేడర్లు క్రమంగా వెబ్సైట్లో లాగిన్ అవుతున్నారు. రంగంలోకి విజిలెన్స్ బృందాలు.. ఇకపై వ్యాపారులు ఇష్టారాజ్యంగా పర్మిట్లు తీసుకునే వీల్లేదు. సరుకుల కొనుగోళ్ల మేరకే పర్మిట్లు ఇచ్చేలా వెబ్సైట్ రూపొందించారు. లెక్కల్లో చూపని వాటికి రవాణా అనుమతులు రాకుండా రూపకల్పన చేశారు. ఒకవేళ అక్రమ రవాణా చేస్తే చెక్‌పోస్టులో నిలిపివేస్తారు. చేతివాటంతో అక్కడి నుంచి తప్పించేందుకు ప్రయత్నించినా దాన్నీ అడ్డుకునేందుకు మార్కెటింగ్‌శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రహదారులపై తనిఖీకి విజిలెన్స్ బృందాలను నియమించింది. ఈ–పర్మిట్ లేకుండా రవాణా చేస్తూ పట్టుబడితే వ్యాపారులు చెల్లించాల్సిన పన్ను కంటే 5 నుంచి 8 రెట్లు అధికంగా జరిమానా వసూలు చేయాలని నిర్ణయించింది. దొంగ దందాతో సర్కారు ఖజానాకు తూట్లు పొడుస్తున్న దళారులపై కూడా విజిలెన్స్ ఉక్కుపాదం మోపనుంది. ఇకనుంచి అధికారులు గ్రామాల్లో నేరుగా జరిగే కొనుగోళ్లపై దృష్టి సారించనున్నారు. మార్కెట్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసే దళారులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. -
రూటు మారిన వేలం పాట
జమ్మికుంట(హుజూరాబాద్): ఉత్తరతెలంగాణ జిల్లాలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ పత్తి మార్కెట్‌గా పేరుగాంచిన జమ్మికుంటలో వేలంపాట గాడి తప్పింది. రైతులను నిండా ముంచేందుకు అందరూ ఏకమవుతున్నారు. వ్యాపారులందరూ కలిసి పత్తి రైతులను నిలువునా దోచుకుంటున్నారు. పత్తిలోడ్‌తో మార్కెట్‌కు వచ్చే ప్రతివాహనానికి నిబంధనల ప్రకారం వేలం వేసి.. పత్తిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ.. కేవలం ఒకే వాహనానికి వేలం వేసి.. మిగిలిన వాహనాల్లోని పత్తికి ఇష్టారీతిన ధర పెడుతున్నారు. ఇదంతా మార్కెటింగ్ శాఖ అధికారుల కళ్లముందే జరుగుతున్నా.. ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. దీంతో రైతులు తెస్తున్న పత్తికి పోటీలేక.. ధరలు తగ్గిపోతున్నాయి. ఆరుగాలం కష్టపడి పత్తినే నమ్ముకున్న రైతు మార్కెట్‌కు వచ్చేసరికి ధర తగ్గిపోవడంతో మోసపోతున్నారు. దందా ఇలా.. పత్తి మార్కెట్‌కు నిత్యం 150 వాహనాల్లో రైతులు తమ ఉత్పత్తులను విక్రయానికి తెస్తారు. ప్రతిరోజూ వ్యాపారులు వేలంలో పాల్గొని.. నాణ్యతప్రమాణాల మేరకు వేలం వేసి.. ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మార్కెట్‌కు వచ్చిన చివరి వాహనం వరకు వేలం వేయాలి. ఫలితంగా వ్యాపారుల్లో పోటీ పెరిగి రైతుకు మేలు జరుగుతుందని. కానీ.. కొద్దిరోజులుగా ఇక్కడ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మార్కెట్‌కు వచ్చిన వాహనాల్లో మొదటి వాహనానికే వేలం పాట పాడి.. ఆ తర్వాత వ్యాపారులంతా విడిపోయి నచ్చిన వాహనాన్ని చూసుకుని ధర నిర్ణయిస్తున్నాడు. దీంతో అతడు పెట్టిన ధరే రైతుకు దక్కుతోంది. అదే వ్యాపారుల్లో పోటీ పెరిగితే రైతులకు క్వింటాల్‌కు కనీసం రూ.50 నుంచి రూ.100 పెరిగే అవకాశం ఉంది. వ్యాపారుల్లో విభేదాలు...? పత్తి మార్కెట్లో వేలం పాట లేకపోవడం.. మంచి పత్తిని కొంత మంది నేరుగా వాహనాల వద్దకు వెళ్లి ఇష్టానుసారంగా ధరలు పెట్టి కొనుగోళ్లు చేస్తుండడంతో కొంద మంది వ్యాపారులకు నచ్చడం లేదు. నిబంధనలను పాటిస్తే వేలం పాట నచ్చిన న్ని వాహనాలను పత్తి కొనుగోళ్లు చేయవచ్చని, వేలంలేక పోవడం వల్ల ఆశించిన పత్తి చేతికి రావడం లేదనే విభేదాలు నెలకొన్నాయి. గత శుక్రవారం పత్తి మార్కెట్‌కు 915 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా గరిష్ట ధర రూ. 4750 పలికింది. కనిçష్ట ధర రూ.3500 చెల్లించారు. పాట కొనసాగించాలి.. పత్తి మార్కెట్లో ప్రతి వాహనానికీ వేలం కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారుల మధ్య పోటీ లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో అధికారులు నిబంధనలను ఎందుకు అమలు చేయడం లేదో తెలియడం లేదని పేర్కొంటున్నారు. రైతుల పక్షాన ఉండాల్సిందిపోయి.. వేలానికే ఎసరు తెచ్చారని, ఇది సరికాదని, అధికారులు స్పందించి.. వేలం పాటను యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నారు. -
వేలం పాట గోవిందా?
జమ్మికుంట(హుజూరాబాద్): ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ జమ్మికుంటలో నిబంధనలకు నీళ్లు వదిలారు. పత్తి కొనుగోలు వేలంలో పోటీపడుతున్న వ్యాపారులు చివరి బండి వరకు మాత్రం మద్దతు ధర చెల్లించడం లేదు. మొదటి ఒక్కటి, రెండు వాహనాల్లోని పత్తికి మాత్రమే వేలంలో పాడిన ధర చెల్లిస్తూ..తర్వాత వాహనాల్లోని పత్తికి ఇష్టారీతిగా ధర నిర్ణయిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పత్తి కొనేదిలేదంటూ మొండికేస్తున్నారు. వారి చెప్పిందే ధరగా చెల్లుబాటు అవుతుంది. పేరుకే వేలం! జమ్మికుంట మార్కెట్లో ప్రతి రోజు పత్తి కొనేందుకు వ్యాపారులు పోటీపడి వేలంపాట పాడుతున్నారే తప్ప అన్ని వాహనాల్లోని పత్తికి అదే ధర చెల్లించడం లేదు. ఇదంతా అధికారుల సాక్షిగానే జరుగుతున్నా స్పందించినా పాపానపోవడం లేదు. జమ్మికుంట పత్తి మార్కెట్‌కు శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి 184 వాహనాల్లో 1,899 క్వింటాళ్ల లూజ్ పత్తి వచ్చింది. పాలకవర్గం, అధికారుల సమక్షంలో రెండు వాహనాలకే వ్యాపారులు వేలం పాడారు. మొదటి వాహనానికి క్వింటాల్‌కు రూ.4,400 ధర పెట్టిన వ్యాపారులు, రెండో వాహనానికి రూ.4,510 చెల్లించారు. తర్వాత వాహనాలకు మాత్రం వ్యాపారులకు ఎవరికి నచ్చిన ధరలు వారు చెల్లించారు. సేటు చెప్పిందే ధరగా పరిస్థితులు మారిపోయాయి. వేలం అన్ని వాహనాలకు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నిస్తే పట్టించుకునే వారు కరువయ్యారు. ఇష్టారీతిన కొనుగోళ్లు మొదటి ఒకట్రెండు వాహనాలకే వేలం పాట పాడుతున్న వ్యాపారులు తర్వాత ఇష్టారీతిన కొనుగోళ్లు చేస్తున్నారు. నాణ్యమైన పత్తికి సైతం క్వింటాల్‌కు రూ.3,500 నుంచి రూ.4,200 చెల్లించారు. గతంలో ప్రతీ వాహనానికి వేలం పాడిన వ్యాపారులు ఈసారి మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఖమ్మం టు జమ్మికుంట
జమ్మికుంట: ఒక రైతుకు లారీ పత్తి పండిందంటే ఎవరైనా నమ్ముతారా.. అసలుకు నమ్మరు.. అకాల వర్షాలతో పత్తి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ట్రాలీల్లో తప్ప లారీ నిండా పత్తి దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితిలోనూ జమ్మికుంట పత్తి మార్కెట్‌కు శుక్రవారం ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తులు లారీ పత్తిని అమ్మకానికి తీసుకొచ్చారు. మార్కెట్‌కు వచ్చిన రైతులంతా పత్తి లారీని చూసి వామ్మో ఇంత పంట పండిందా అంటూ ఆశ్చర్యానికి గురయ్యారు. గ్రామాల్లో రైతుల వద్ద నేరుగా తక్కువ ధరలు చెల్లించి అదే పత్తిని ఎక్కువ ధరలకు మార్కెట్లోకి అమ్మకానికి తీసుకొచ్చారనేది తెలుసుకోలేకపోయారు. జమ్మికుంట పత్తి మార్కెట్‌కు లారీల్లో పత్తి రాక మొదలైందంటే చాలు దళారులంతా గ్రామాల్లో మాయమాటలు చెప్పుతూ తక్కువ ధరలకు కొనుగోలు దందా చేపట్టినట్లు తెలిసిపోతోంది. జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌కు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ జిల్లా, వరంగల్ రూరల్. ఖమ్మం, మహబుబ్‌నగర్ జిల్లాల నుంచి ప్రతీ సీజన్లో దళారులంతా గ్రామాల్లో ఇళ్ల వద్ద కాంటాలు పెట్టి రైతుల వద్ద క్వింటాల్ పత్తికి రూ.3000 నుంచి 3300 వరకు ధరలు చెల్లించి దందా సాగిస్తుంటారు. తూకాల్లో భారీగా మోసాలకు పాల్పడుతుంటారు. ప్రస్తుతం అకాల వర్షాలతో అల్లాడుతున్న పత్తి రైతులు చేతికి వచ్చిన పత్తిని మార్కెట్లో తక్కువ ధరలకు అమ్మకాలు జరుపుకుంటున్నారనే ప్రచారం రైతుల్లో మొదలు కావడంతో దళారులు రంగంలోకి దిగి రైతులను మరింత ముంచేందుకు కొనుగోళ్లు షూరు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతానికి చెందిన దళారులు సైతం గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ఇళ్ల ముందు వ్యాపారం సాగిస్తూ లారీల కొద్ది పత్తిని కొనుగోలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ట్రేడర్స్ లైసెన్స్ ఉంటే తప్ప ఎక్కడా రైతుల వద్ద పత్తి కొనుగోలు చేపట్టవద్దనే నిబంధనలు ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. రైతు రూపంలో మార్కెట్లోకి అడుగు పెడుతుండడం విశేషం. -
జమ్మికుంట మార్కెట్‌కు భారీగా పత్తి
జమ్మికుంట: కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం 281 వాహనాల్లో లూజ్ పత్తి వచ్చింది. దీనికి గ్రేడింగ్ కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణలో రెండవ పెద్ద మార్కెట్ అయిన జమ్మికుంటతో పాటు కరీంనగర్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ‘నామ్’ పద్ధతిన కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. అయితే గ్రేడింగ్‌లో ఆలస్యం జరుగుతుండడం, ఆన్లైన్ చాంబర్లో నిర్ణయించే ధర ఎంత ఉంటుందో తెలియక రైతులు తమ సరకును గురువారం వ్యాపారులకు అమ్ముకున్నారు. ఇది గమనించిన మార్కెట్ కమిటీ నేరుగా సరకు కొనుగోళ్లను కట్టడి చేయడంతో శుక్రవారం నాడు పత్తి భారీగా తరలివచ్చింది. దీంతో మార్కెట్ కళకళలాడుతోంది. కాగా, ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ అయిన వరంగల్ ఏనుమాముల మార్కెట్లో మాత్రం పాత పద్ధతి(వేలం)లోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి. అక్కడ శుక్రవారం రూ. 5409 ధర పలికింది. -
జమ్మికుంట మార్కెట్లో ‘నామ్’ ప్రారంభం
జమ్మికుంట: ఉత్తర తెలంగాణలో రెండో అతి పెద్దదైన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కేంద్రం అమలు చేస్తున్న ’నామ్’ పద్ధతిన (ఆన్లైన్లో) పత్తి కొనుగోళ్లు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. గతంలో వ్యాపారి నిర్ణయించిన ధరకే రైతు సరకు అమ్ముకోవాల్సి వచ్చేది. దాంతో ఆ వేలం పద్ధతిని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ‘నామ్’ పద్ధతిన కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించడంతో వ్యసాయ కమిషనర్ ఆదేశాల మేరకు కొత్త పద్ధతిన కొనుగోళ్లు ప్రారంభించారు. వంద వాహనాల్లో లూజు పత్తి, రెండు వేల టిక్కీల పత్తి మార్కెట్‌కు వచ్చింది. ఈ కొత్త పద్ధతిలో సీక్రెట్ క్యాబిన్లో ధరలు నిర్ణయిస్తారు. ముందుగా సరకుకు గ్రేడింగ్ చేసి ధర నిర్ణయిస్తారు. ఈ పద్ధతిలో ఆలస్యం జరుగుతుందని, కిరాయి వాహనాలతో వచ్చిన రైతులు ఆలస్యం కారణంగా వాహనాల కిరాయికి అధిక మొత్తం చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు. గ్రేడింగ్ నిర్ధారణకు నిపుణుల కొరత కూడా ఉందని, నిపుణులను నియ మించాలని రైతులు కోరుతున్నారు. కాగా, కొందరు రైతులు నేరుగా మిల్లుల వద్దే సరకు విక్రయించుకునేందుకు వేచి ఉన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పింగిలి రమేష్, వైస్ చైర్మన్ ఎర్రబెల్లి రాజేశ్వరరావు, కార్యదర్శిలు ‘నామ్’ పద్ధతిని ప్రారంబించారు. -
ఇక రైతులది అరణ్యరోదనే?
పత్తి మార్కెట్లో దోపిడీకి లైన్ క్లియర్? మార్కెట్ సిబ్బందికి రూ.లక్షల్లో మామూళ్లు ఒక్కో అడ్తిదుకాణానికి రూ.2500 వసూళ్లు జమ్మికుంటలో దాదాపు 80 దుకాణాలు జమ్మికుంట : అరుగాలం చెమటోడ్చి పత్తిని పండించిన రైతన్నల వేదన ఇక ఆరణ్య రోదనే కానుంది. మార్కెట్లో రైతులకు అండగా నిలవాల్సిన వారంతా మామూళ్లకు సిద్ధం కావడంతో అడ్తిదారులు దోపిడీదందాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా లైన్ క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు ప్రతి అడ్తి దుకాణం నుంచి రూ. 2000 నుంచి రూ. 2500 వరకు మార్కెట్ సిబ్బందికి గతవారం రోజులుగా ముట్టచెప్తుతున్నట్లు ప్రచారం మొదలైంది. ఇప్పటికే రూ.లక్షకు పైగా మార్కెట్ సిబ్బందికి అడ్తిదారులు అందించినట్లు సమాచారం. ఉత్తర తెలంగాణలో రెండవ పెద్ద మార్కెట్‌గా జమ్మికుంట పత్తి మార్కెట్‌కు గుర్తింపు ఉంది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతోపాటు వివిధ ప్రాంతాల రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఈ మా ర్కెటే పెద్ద దిక్కు. అయితే మార్కెట్లో రైతులను దోచు కునేందుకు అడ్తిదారులు అడ్డదారులు తొక్కుతుంటారు. వీటిని అరికట్టేందుకు మార్కెట్ సిబ్బంది రైతుల పక్షాన నిలవాలి. కాని వారు మామూళ్లు వస్తుండడంతో అడ్తిదారుల దందాకు అండగా నిలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అడ్తిదారులు నాణ్యమైన పత్తికి సైతం భారీ తేడా లు పెట్టి కొనుగోలు చేస్తున్నా మార్కెట్ యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దోపిడీ తీరిది.. వ్యాపారులు నూటికి రూ.2 కమీషన్ వసూళ్లు చేస్తూనే అదనంగా ఇతర విధాలుగా రైతులను ముంచుతుంటారు. లూజ్ పత్తిని తరుగు పేరుతో 15 కిలోల నుంచి 30 కిలోల వరకు తూకాల్లో కోతలు పెడుతుంటారు. లూజ్ పత్తిని వేలంపాట కాకముందే వ్యాపారులతో ధర నిర్ణయించుకొని నేరుగా యార్డు నుంచి మిల్లులకు తరలిస్తుంటారు. పత్తి బస్తాల వద్ద వేలంపాట సమయంలో నెంబర్ పత్తికి పలికిన ధర కంటే మిగతా బస్తాలకు ఇక్కడా క్వింటాల్‌కు రూ.100 - 450 వరకు తేడాలతో అమ్మిస్తుంటారు. దీంతో రైతులు రూ. వేలల్లో నష్టపోతుంటారు. ఇలా రోజుకు రూ. 2,5లక్షల వరకు ధరల్లో వ్యత్యాసాలతోనే రైతులు నష్టపోతున్నట్లు అంచనా. వీటన్నింటిని మార్కెట్ సిబ్బంది అరికట్టాలి. రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. కాని వారి కనుసన్నుల్లోనే రైతులు దోపిడీకి గురవుతుండడంతో ఇక ఎవరికి చెప్పుకోవాలనే ప్రశ్న తలెత్తుతోంది. జమ్మికుంటలో 80 మంది అడ్తిదారులు ఉండగా.. రూ. 2లక్షల వరకు మార్కెట్లో సిబ్బందికి అప్పగించేందుకు టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. పాలకవర్గం మౌనం.. మామూళ్లు వసూళ్లు చేస్తున్నారనే విషయం పాలక వర్గానికి తెలిసినా మౌనంగా ఉంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నారు. కొందరు అడ్తిదారులు తామవి చిన్నదుకాణాలని, ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా కమీషన్ మాత్రమే తీసుకుంటున్నామని, అలాంటప్పుడు తాము ఎందుకు మామూళ్లు ఇవ్వాలని ప్రశ్నినట్లు సమాచారం. అక్రమాలకు పాల్పడేవారే ఇచ్చుకోవాలని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఉన్నతాధికారులు మామూళ్లపై లోతుగా విచారణ జరిపితే అసలు గుట్టు బహిర్గతమవుతుందని భావిస్తున్నారు. వసూళ్లు చేస్తే చర్యలు వ్యవసాయ మార్కెట్లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోవడం లేదు. మార్కెట్ సిబ్బంది అడ్తిదారుల వద్ద మామూళ్లు వసూళ్లు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. వసూళ్ల విషయంపై విచారణ చేస్తా.. నిజమని తెలితే చర్యలు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. - పింగిళి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఈ విషయంపై మార్కెట్ కార్యదర్శి వెంకట్‌రెడ్డిని ఫోన్ లో వివరణ కోరగా మామూళ్ల.. విషయం తనకు తెలియదని, తెలుసుకుంటానని సమాధానం ఇచ్చారు -
తగ్గిన పత్తి ధర: రైతుల ఆందోళన
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్లో మంగళవారం పత్తి కొనుగోలు ధర గణనీయంగా తగ్గింది. ఫలితంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. నెంబర్ వన్ పత్తి ధర వేలం పాటలో క్వింటాలుకు 4,750 రూపాయలు పలికింది. నిన్నటి దాకా ఎక్కువ ఉన్న ధర నేడు తగ్గిపోవడంతో రైతులు దిగాలు పడ్డారు. -
భారీగా తగ్గిన పత్తి ధర
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయమార్కెట్‌లో మొన్నటి వరకు అత్యధికంగా పలికిన పత్తి ధర సోమవారం ఉదయం భారీగా తగ్గింది. శుక్రవారం వరకు క్వింటాలుకు రూ. 5,372 పలికిన ధర రూ.4,960 కు పడిపోయింది. ఈ పరిణామంతో రైతులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన డిమాండ్ ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు అంటుండగా పత్తి ఎక్కువ మొత్తంలో రావటంతో వ్యాపారులే కుమ్మక్కయి రేటు తగ్గించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సీజన్లో మొదటి సారిగా సోమవారం భారీ మొత్తంలో మార్కెట్‌కు పత్తి చేరుకుంది. దాదాపు 2000 మంది రైతులు సుమారు 8 వేల క్వింటాళ్ల పత్తిని తీసుకువచ్చినట్లు అంచనా. పత్తిని తరలించుకు వచ్చిన దాదాపు 300 వాహనాలతో మార్కెట్ యార్డు నిండిపోయింది. ఇదిలా ఉండగా, సోమవారం నుంచి జాతీయ స్థాయిలో ఆన్లైన్ విధానంలో పత్తిని కొనుగోలు చేసే ఇనాం విధానాన్ని అమలు చేస్తున్నట్లు శుక్రవారం అధికారులు అట్టహాసంగా ప్రకటించారు. అయితే, జమ్మికుంట మార్కెట్లో మాత్రం ఈ ఛాయలేవీ కానరాలేదు. అధికారులు కిమ్మనక ఉండగా వ్యాపారులు, దళారులే కుమ్మక్కయి కొనుగోళ్లు జరుపుతున్నారు. -
దోపిడీ మెుదలైంది..
తక్కువ ధరలకే పత్తి కొనుగోళ్లు విలవిలాడిన రైతులు కనీస మద్దతు కరువు జమ్మికుంట మార్కెట్లో దందా షురూ..! జమ్మికుంట : జమ్మికుంట వ్యవసాయ పత్తిమార్కెట్లో ఆదిలోనే పత్తి రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పత్తిని తీసుకొస్తే కొందరు వ్యాపారులు, అడ్తీదారులు కుమ్మక్కుతో మునుగుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పండుగ ముందు చేతిఖర్చుల కోసం చేతికి వచ్చిన కొత్త పత్తిని అమ్ముకునేందుకు వస్తే కనీస మద్దతు ధర చెల్లించడంలేదంటున్నారు. తేమ,కాయసాకుతో సరైన ధరలు చెల్లించలేదు. పత్తి మద్దతు ధరను ప్రభుత్వం రూ.4,100 నుంచి రూ.4,160 ప్రకటించారు. ఈ సీజన్లో రైతులకు కేంద్రం రూ.60 మాత్రమే పత్తికి ధర పెంచింది. ఇలాంటి పరిస్థితిలో జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌కు సోమవారం వివిధప్రాంతాల నుంచి రైతులు ఖరీఫ్‌లో సాగుచేసిన దాదాపు వెయ్యి బస్తాల్లో కొత్త పత్తిని అమ్మకానికి తీసుకొచ్చారు. ఉదయం 10 గంటల సమయంలో బీటైప్ వ్యాపారులు యార్డులో తిరుగుతూ ఉత్పత్తులను పరిశీలించారు. నాణ్యత పేరుతో కనీస ధరలు చెల్లించలేదు. మంచి ధర వస్తుందని ఆశపడ్డ రైతులకు వ్యాపారులు పెట్టిన ధరను చూసి బిత్తరపోయారు. పత్తిలో నాణ్యత లేదని, అంతా తేమ, కాయనే ఉంటే ఎలా కొనేదంటూ కొందరు దబాయించారు. క్వింటాల్ పత్తికి రూ.2000 నుంచి 4600 వరకు చెల్లించారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఎక్కువమంది రైతులకు క్వింటాల్‌కు రూ.3వేల నుంచి 3800 లోపే ధరలు లభించింది. జాడలేని నామ్ ఈ సీజన్ నుంచి జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం అమల్లోకి తీసుకొస్తున్నామని ప్రచారం చేసిన మార్కెటింగ్ శాఖ ఆదిలోనే నామ్‌కే వాస్త్‌గా మారింది. జమ్మికుంట మార్కెట్‌కు వెయ్యి బస్తాల్లో పత్తి ఉత్పత్తులు వస్తే కేవలం గేట్ ఎంట్రీతోనే సరిపుచ్చుకున్నారు. ఆన్లైన్ కొనుగోళ్లతో పోటీ ఏర్పడి మంచిధర వస్తుందని ఆశపడ్డ పత్తి రైతులకు నిరాశనే మిగిలింది. మార్కెట్లో బీటైప్ వ్యాపారులు కనీసం వేలంపాడకుండా పత్తిని కొనుగోళ్లు చేసి ధరల్లో నిండా ముంచారు. నామ్ కొనుగోళ్లు ఈసారి కేవలం గేట్ ఎంట్రీ, గ్రేడింగ్‌తోనే కొనసాగుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ సీజన్లో స్థానిక వ్యాపారులతోనే కొనుగోళ్లు జరుగుతాయని వివరిస్తున్నారు. గీదేం ధరలు –బచ్చయ్య, మోత్కులగూడెం జమ్మికుంట మార్కెట్‌కు కొత్త పత్తిని అమ్మకానికి తీసుకవచ్చిన. సేట్లు బస్తాల్లో తీసుకవచ్చిన పత్తిని చూసి మొదలు ధరనే చెప్పలే. చివరకు కింటాల్ పత్తికి రూ. 3200 ధరలే రైతులకు చెల్లించారు. కొత్త పత్తిలో తేమ, కాయ ఉందంటూ ముక్కువిరుస్తూ కొన్నరు. గిప్పుడే గీట్ల జేస్తే రైతులకు ఏలా పెట్టుబడులు వచ్చేది. మద్దతు ధరైనా దక్కలే... -
పత్తి కొనుగోళ్లలో జమ్మికుంట టాప్
ముగిసిన ఖరీఫ్ కొనుగోళ్లు 4.65 లక్షల క్వింటాళ్ల క్రయవిక్రయాలు రెండోస్థానంలో పెద్దపల్లి.. జమ్మికుంట : ఉత్తర తెలంగాణ జిల్లాలో అతిపెద్ద రెండో వ్యవసాయ పత్తిమార్కెట్ జమ్మికుంట ఖరీఫ్ కొనుగోళ్లలో టాప్‌గా నిలిచింది. జిల్లాలోని పదది మార్కెట్లో జరిగిన పత్తి కొనుగోళ్లలో జమ్మికుంటనే ఆగ్రగామిగా మార్కెటింగ్ శాఖ లెక్కల్లో నమోదైంది. గతేడాది అక్టోబర్ 1నుంచి ఈ నెల 16వరకు జరిగిన పత్తి కొనుగోళ్లలో వ్యవసాయ మార్కెట్లో 4లక్షల 65వేల క్వింటాళ్ల పత్తికొనుగోళ్లు జరిగాయి. ప్రయివేట్ వ్యాపారులు రైతులవద్ద 4.28 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేయగా.. సీసీఐ 36,497 క్వింటాళ్లనే కొన్నది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ పత్తి కొనుగోళ్లలో రెండో స్థానంలో నిలిచింది. ప్రయివేట్ వ్యాపారులు లక్షా 37వేల 581 క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేయగా.. సీసీఐ 37,440 క్వింటాళ్లను రైతుల వద్ద సేకరించింది. మూడో స్థానం కరీంనగర్ మార్కెట్‌కు దక్కింది. ప్రయివేట్ వ్యాపారులు 55,751 క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేయగా.. సీసీఐ 32,417 క్వింటాళ్ల పత్తిని రైతుల వద్ద వ్యాపారం జరిగింది. సీసీఐ సంస్థ మాత్రం సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్లో ఎక్కువ పత్తిని కొనుగోళ్లు చేసి టాప్‌లో నిలిచింది. రెండోస్థానంలో హుస్నాబాద్ మార్కెట్ దక్కించుకుంది. ఇక్కడా 43,755 క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. జిల్లావ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లో ప్రయివేట్ వ్యాపారులు 6. 44లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేయగా.. సీసీఐ 2లక్షల 29,789 క్వింటాళ్ల పత్తిని సేకరించారు. జిల్లాలో ఎక్కడా పత్తి ఉత్పత్తులు అమ్మకాలకు రాకపోవడంతో మార్కెట్ యార్డులన్నీ బోసిపోతున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్లో సాగుచేసిన పత్తి రైతుల చేతికి దిగుబడులు వచ్చిన తర్వాతే మళ్లీ మార్కెట్లు రైతులతో కళకళలాడనున్నాయి. -
జమ్మికుంట మార్కెట్లో ఆందోళన
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని వ్యవసాయ మార్కెట్లో వరుసగా మూడో రోజు కొనుగోళ్లు నిలిచి పోయాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ దడ్వాయిలు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకోవడంతో.. మార్కెట్లో పత్తి నిల్వలు పేరుకుపోయాయి. దీంతో ఆగ్రహించిన రైతులు తమ ఆవేదన పట్టించుకోరా అంటూ తహశీల్దార్‌ను నిలదీశారు. ఓ వైపు దడ్వాయిల సమ్మెకు తోడు మరో వైపు రైతులు ఆందోళనకు దిగడంతో మార్కెట్ వాతావరణం వేడెక్కింది. మార్కెట్ ఎదుట ప్రస్తుతం పత్తిలోడుతో ఉన్న 500 వాహనాలు నిలిచి ఉండటంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. -
పత్తి రైతు చిత్తు!
♦ నిండా ముంచుతున్న వ్యాపారులు, దళారులు ♦ ఇష్టారీతిన ధర నిర్ణయం.. ట్రాక్టర్ పత్తిలో 40 కిలోలు కోత ♦ మార్కెట్ కాంటాతో పనిలేకుండా సొంతంగా తూకం ♦ నూటికి రూపాయిన్నర అదనపు కమీషన్ ♦ సాక్షి కథనాలతో స్పందించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ♦ జమ్మికుంట మార్కెట్లో ఆకస్మిక తనిఖీ ♦ అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిక సాక్షి ప్రతినిధి, కరీంనగర్ /జమ్మికుంట: వర్షాభావం నుంచి ఎరువుల కొరత దాకా ఎన్నో ఎదురుదెబ్బల్ని తట్టుకున్న రైతన్న... చివరకు వ్యాపారులు, దళారుల చేతిలో చిత్తయిపోతున్నాడు. అంతో ఇంతో వచ్చిన దిగుబడిని అమ్ముకుందామని మార్కెట్ కేంద్రాలకు వెళితే.. అడుగడుగునా దోపిడీకి గురవుతున్నాడు. తూకం మొదలు కమీషన్ వరకు, మద్దతు ధర మొదలు తరుగు వరకు.. వ్యాపారుల మాయాజాలంలో నిండా మునిగిపోతున్నాడు. మార్కెటింగ్ శాఖ అధికారులే ఈ మోసానికి సహకరిస్తున్నారు. ఈ బాగోతంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనాలపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ స్పందించారు. శుక్రవారం జమ్మికుంట పత్తి మార్కెట్లో ఆకస్మిక తనిఖీ చేశారు. మోసాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. దళారులకు అప్పగించేశారు! కరీంనగర్ జిల్లాలో 11 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లను చేపట్టాల్సి ఉన్నా... ఇప్పటివరకు కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, హుస్నాబాద్ మార్కెట్లలోనే ప్రారంభించారు. ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించినట్లు తెలియగానే రైతులు ఆరు రోజులుగా రోజూ దాదాపు 10 వేల క్వింటాళ్ల పత్తిని మార్కెట్లకు తీసుకొస్తున్నారు. కానీ సీసీఐ అధికారులు ఏదో ఒక సాకు చెబుతూ కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు విధిలేక వ్యాపారులు, మిల్లర్లకు అమ్ముకోవాల్సి వస్తోంది. నిండా మోసం..: నిబంధనల ప్రకారం మార్కెట్ కార్యాలయాల్లోని వేబ్రిడ్జ్‌ల వద్దే తూకం వేయాలి. పత్తి తేమ శాతం, నాణ్యత, ధర నిర్ధారణ విషయంలో మార్కెటింగ్ శాఖ మార్గదర్శకాలను అనుసరించాలి. ఎంత తూకం వేస్తే అంత బరువుకు ధర చెల్లించాలే తప్ప బరువులో కోత విధించడానికి వీల్లేదు. అలాగే 2 శాతం కమీషన్ మాత్రమే తీసుకోవాలి.కానీ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో ఇవేవీ అమలుకావడం లేదు. మార్కెట్లో వేబ్రిడ్జ్ ఉన్నా... వ్యాపారులు అక్కడ తూకం వేయనీయడం లేదు. తమకు అనుకూలమైన కాటన్ మిల్లుల వద్ద తప్పుడు తూకం వేస్తూ దోపిడీ చేస్తున్నారు. దీనికితోడు ట్రాక్టర్లో పత్తిని తెస్తే 40 కిలోలు, ట్రాలీలో తెస్తే 20 కిలోల చొప్పున కోత విధిస్తూ మిగతా బరువుకు మాత్రమే సొమ్ము చెల్లిస్తున్నారు. ఇక 2 శాతం కమీషన్‌కు అదనంగా ‘క్యాష్ కటింగ్’ పేరిట ప్రతి రూ.వందకు మరో రూపాయిన్నర మినహాయించుకుంటున్నారు. ఇలా రూ.లక్షకు రూ.1,500, ప్రతి ట్రాక్టర్‌కు 40 కిలోల పత్తి కోతతో మరో రూ.1,600 రైతు నష్టపోతున్నాడు. తప్పుడు తూకం, తక్కువ ధర తో నిండా మునిగిపోతున్నాడు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. కరీంనగర్ జిల్లాలో గత ఆరు రోజులుగా రూ.20 కోట్లకుపైగా పత్తి వ్యాపారం జరగగా.. అందులో రైతులు రూ.5 కోట్లదాకా నష్టపోయినట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. పత్తి కొనుగోళ్లలో మోసాలపై ‘సాక్షి’లో రెండు రోజుల పాటు వరుస కథనాలు రావడంతో.. కరీంనగర్ జిల్లా పాలనా యంత్రాంగంలో కదలిక వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఆకస్మికంగా జమ్మికుంట మార్కెట్‌ను తనిఖీ చేశారు. మార్కెటింగ్ శాఖ ఏడీ ప్రకాష్, తహసీల్దార్ రజనితో కలిసి రైతుల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులంతా మూకుమ్మడిగా తమ బాధను వెళ్లగక్కారు. ‘‘మేం తెచ్చిన పత్తిని సీసీఐ అధికారులు కొనుగోలు చేయడం లేదు. వ్యాపారులు ఇష్టారీతిన ధర నిర్ణయిస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. రూ.2,500 నుండి రూ.3,750 దాకా మాత్రమే ఇస్తున్నారు తప్ప ఒక్కరికి కూడా సీసీఐ నిర్ణయించిన ధర చెల్లించడం లేదు. పైగా ట్రాక్టర్‌కు 40 కిలోల చొప్పున కోత విధిస్తున్నారు. మార్కెట్ వేబ్రిడ్జ్‌పై కాకుండా సొంత కాంటాలపై తూకం వేస్తున్నారు. కాస్ట్ కటింగ్ పేరిట రూ.వందకు రూపాయిన్నర చొప్పున మినహాయించుకుంటున్నారు. మీరేమో ఆత్మహత్య చేసుకోవద్దు. ధైర్యంగా ఉండండని చెబుతున్నారు. అసలే కాలంలేక బాధపడుతున్నం. ఇక్కడికొస్తే అడ్తిదారులు, వ్యాపారుల దోపిడీతో చస్తున్నాం. ఇట్లయితే మేం బతికేదెట్లా..?’’అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ నీతూప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ‘‘కాస్ట్ కటింగ్, సొంతంగా తూకం వేసుకోవడం, ట్రాక్టర్‌కు 40 కిలోల చొప్పున పత్తిని మినహాయించుకోవడం వంటివి నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఇకపై అలా జరిగితే లెసైన్సు రద్దు చేస్తాం. క్రిమినల్ కేసు పెడతాం. గతంలో ఇక్కడ సీబీఐ దాడులు చేసి విచారణ జరుపుతున్న విషయాన్ని మర్చిపోవద్దు..’’ అని వ్యాపారులను హెచ్చరించారు. -
అమాత్యుడొచ్చినా.. ఆగని దోపిడీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సాక్షాత్తూ అమాత్యుడే తమ పక్షాన నిలబడ్డారని ఆనందించిన అన్నదాత సంతోషం అరగంటకే ఆవి రైంది. జమ్మికుంట మార్కెట్ నుంచి మంత్రి వెళ్లిపోగానే సీసీఐ అధికారులు, పత్తి మిల్లర్లు తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. తొలిరోజు మాదిరిగానే రెండోరోజు సైతం సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయలేదు. గురువారం మార్కెట్‌కు ఏకంగా 10వేల క్వింటాళ్లకుపైగా పత్తి వచ్చినా పట్టించుకోలేదు. చివరకు సీసీఐ నిబంధనల ప్రకారం లూజ్పత్తిని తీసుకొచ్చినా.. 8 శాతంలోపే తేమ ఉన్నా కొనలేదు. మంత్రి ఈటల ఉన్న సమయంలో నాలుగు ట్రాలీల్లోని లూజ్పత్తిని కొనుగోలు చేస్తున్నట్లు చెప్పిన అధికారులు ఆయన వెళ్లాక వాటిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో బిత్తరపోవడం రైతుల వంతైంది. మధ్యాహ్నం వరకు వేచిచూసిన రైతులు ఇక చేసేదేమీలేక షరా మామూలుగానే తెచ్చిన పత్తిని మిల్లర్లు, వ్యాపారులు చెప్పిన రేటుకే కట్టబెట్టి వెనుదిరిగారు. క్వింటాల్‌కు రూ.వెయ్యికిపైగా నష్టం సీసీఐ నిబంధనల ప్రకారం 8శాతం తేమ కలిగిన పత్తి క్వింటాల్‌కు రూ.4100 ధర చెల్లించాలి. కానీ జమ్మికుంట మార్కెట్లో గురువా రం 10 వేల క్వింటాళ్లకుపైగా పత్తి వచ్చినా కనీసం ఏ ఒక్క రైతుకూ మద్దతు ధర లభించలేదు. 8 శాతం లోపు తేమ కలిగిన పత్తికి కూడా కనీసధర చెల్లించేందుకు వ్యాపారులు నిరాకరించారు. కనిష్టంగా క్వింటాల్‌కు రూ.2500 నుంచి గరిష్టంగా రూ.3,850 వరకు పత్తిని కొనుగోలు చేశారు. రకరకాల సాకుతో రూ.3,850కు మించి ధర చె ల్లించకపోవడం గమనార్హం. రెండోరోజు మార్కెట్ కొనుగోళ్లను పరిశీలిస్తే కనీస మద్దతు ధర కంటే సగటున వెయ్యి రూపాయల తక్కువకు పత్తిని కొనుగోలు చేశారు. ఈ లెక్కన జమ్మికుంట మార్కెట్లో ఒక్కరోజే రూ.కోటికిపైగా రైతులకు నష్టం వాటిల్లినట్లయింది. బిత్తర పోయిన పత్తి రైతన్న మంత్రి ఈటల గురువారం జమ్మికుంట మార్కెట్‌కు వస్తూనే లూజ్పత్తి తీసుకొచ్చిన రైతుల వాహనాల వద్దకు వెళ్లారు. అక్కడ మొదటి వరసలో లూజ్పత్తి వాహనం ముందున్న సైదాపూర్ మండలంలోని శివరామపల్లికి చెందిన ముదాం రాజయ్య వద్దకు వెళ్లారు. ఆ సమయంలో సీసీఐ అధికారులు లూజ్ పత్తి నాణ్యతను పరిశీలించగా తేమ శాతం 7లోపు ఉన్నట్లు తేలింది. నిబంధనలకు అనుగుణంగా పత్తిని తెచ్చిన రాజయ్యను మంత్రి స్వయంగా అభినందించారు. తన చేత్తో స్వీట్ కూడా తినిపించారు. ఆ వాహనం ముందు కొబ్బరికాయ కొట్టి తూకం ప్రారంభించి ముందుకు కది లారు. మద్దతు ధరకు ఢోకా లేదని మురిసిపోయాడు. కానీ మంత్రి వెళ్లాక సీన్ రివర్స్ అయ్యింది. రైతు గుర్తింపు కార్డు లేదని సీసీఐ అధికారులు తూకం వేయడం నిలిపివేయడంతో బిత్తరపోయాడు. సాయంత్రం వరకు సీసీఐ అధికారులు కొంటారని ఎదురుచూసిన రాజయ్య చివరకు విసిగిపోయి తక్కువ ధరకే పత్తిని వ్యాపారికి అమ్మేసి ఇంటిదారి పట్టాడు. గుర్తింపు కార్డులు తెచ్చుకున్న రైతులదీ దాదాపు ఇదే పరిస్థితి. గురువారం 120 వాహనాల్లో లూజ్పత్తిని తీసుకొచ్చిన రైతుల్లో పలువురికి గుర్తింపు కార్డులున్నప్పటికీ సీసీఐ అధికారులు కొనేందుకు ఆసక్తి చూపలేదు. -
పత్తి రైతు అరిగోస
కరీంనగర్ జిల్లాలో కిలో పత్తి కూడా కొనని సీసీఐ ♦ మార్కెట్‌కు వచ్చిన పత్తి అంతా వ్యాపారులపాలు ♦ దళారీ చెప్పిందే రేటు.. అధికారులే మధ్యవర్తులు ♦ రూ.4,100 ధర ఉంటే.. రూ.2,500 నుంచి 3,700 మధ్య కొనుగోలు ♦ ఆర్థిక మంత్రి ఈటల ఇలాఖాలో దుస్థితి ♦ జమ్మికుంట మార్కెట్‌కు 5 వేల క్వింటాళ్లు వచ్చినా బోణీ కాని వైనం ♦ తొలిరోజే రూ.అరకోటి నష్టపోయిన రైతన్న సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘రైతులెవరూ దళారులను ఆశ్రయించకండి. నేరుగా పత్తిని సీసీఐకి అమ్మి ప్రభుత్వం నిర్ణయించిన రూ.4,100 మద్దతు ధర పొందండి’ - సీసీఐ నినాదమిది! కరపత్రాలు ముద్రించి మరీ రైతులకు పంపిణీ చేసింది. కానీ సీసీఐ మాటలు నమ్ముకుని పత్తి మార్కెట్‌కు వెళ్లిన రైతన్న చిత్తయ్యాడు. తేమ శాతం ఎక్కువుందని.. బస్తాల్లో తెచ్చారని సాకులు చూపుతూ కొనుగోలుకు నిరాకరించారు. తెచ్చిన పత్తిని ఏం చేయాలో తోచని అన్నదాతలు మార్కెట్ కార్యాలయానికి వెళ్తే.. అక్కడ సీసీఐ అధికారులే మధ్యవర్తి అవతారమెత్తారు. అడ్తిదారులతో బేరాలాడి రైతులు తెచ్చిన పత్తిని ఎంతో కొంతకు కొనుగోలు చేయించారు. క్వింటాలు మద్దతు ధర రూ.4,100 ఉంటే.. అడ్తిదారులు రూ.2,800 నుంచి రూ.3,750 వరకు ధర నిర్ణయించేశారు. తెచ్చిన పత్తిని ఇంటికి తీసుకుపోలేక.. అక్కడే పడిగాపులు పడలేక రైతన్న ఎంతో కొంత రేటుకు అమ్ముకుని దీనంగా ఇంటి ముఖం పట్టారు. మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గమైన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో సాగుతున్న బహిరంగ దోపిడీ ఇది. ఒక్క రైతుకు కూడా అందని ‘మద్దతు’ కరీంనగర్ జిల్లాలో బుధవారం జమ్మికుంట, చొప్పదండి, గంగాధర మార్కెట్లలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంగళవారమే కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో సీసీఐ అధికారులు కిలో పత్తిని కూడా కొనుగోలు చేయలేదు. సీసీఐని నమ్ముకుని మంగళ, బుధవారాల్లో 6 వేల క్వింటాళ్ల పత్తిని రైతులు మార్కెట్లకు తీసుకొచ్చారు. అందులో ఒక్క జమ్మికుంట మార్కెట్‌కే దాదాపు 5 వేల క్వింటాళ్ల పత్తి తెచ్చారు. అయితే సీసీఐ అధికారులు ఎక్కడా బోణీ చేయలేదు. ఫలితంగా ఒక్క రైతూ మద్దతు ధరకు నోచుకోలేదు. తెచ్చిన పత్తినంతా సగటున క్వింటాలుకు రూ.3,400 చొప్పున అడ్తిదారులకే కట్టబెట్టేశారు. ఈ లెక్కన క్వింటాలుకు రూ.వెయ్యి చొప్పున నష్టం వాటిల్లింది. అంటే బుధవారం ఒక్కరోజే రూ.60 లక్షల మేర రైతులు నష్టపోయారు. అందులో ఒక్క జమ్మికుంట మార్కెట్లోనే రైతులు 50 లక్షల మేర నష్టపోయారు. బస్తాలు వద్దు.. లూజ్ వద్దు జమ్మికుంట మార్కెట్‌కు రైతులు సుమారు 100 ట్రాలీల్లో లూజ్ పత్తి తీసుకొచ్చారు. మిగిలిన పత్తినంతా బస్తాల్లో తీసుకొచ్చారు. బస్తాల్లో తెచ్చిన పత్తి వైపు కన్నెత్తి కూడా చూడని అధికారులు.. లూజ్ పత్తి ట్రక్కుల వద్ద కెళ్లి తేమ శాతాన్ని పరిశీలించారు. అందులో 11 ట్రక్కుల్లోని పత్తి కొనుగోలుకు సిద్ధమయ్యారు. కొనుగోలు చేసిన పత్తిని నిల్వ చేసేందుకు కేంద్రాలు లేవని తెలియడంతో అధికారులు జారుకున్నారు. ఎంత సేపటికీ రాకపోవడంతో రైతులంతా మార్కెట్ కార్యాలయానికి వచ్చి అధికారులను కలసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి సీసీఐ అధికారే మధ్యవర్తి అవతారమెత్తి అడ్తిదారుల సంఘం నాయకుడితో రహస్య సంప్రదింపులు జరిపారు. కనీస మద్దతు ధర సగటున రూ.3,500గా నిర్ణయించారు. అక్కడ నిర్ణయం జరిగిన గంటన్నరలో అడ్తిదారులంతా పత్తి కొనుగోళ్లను పూర్తి చేశారు. క్వింటాలు పత్తి ధర రూ.2,750 నుండి 3,750 వరకు కొనుగోలు చేశారు. సాయంత్రం 5 గంటలకు మార్కెట్‌కు వచ్చిన పత్తినంతా జిన్నింగ్ మిల్లులకు తరలించేశారు. చివరకు సీసీఐ కొనుగోలు చేసేందుకు సిద్ధమైన లూజ్ పత్తినీ ఇదే ధరకు అడ్తిదారులు కొనుగోలు చేయడం గమనార్హం. జిల్లాలో పత్తి నిల్వ చేసేందుకు జిన్నింగ్ మిల్లుల యజమానులతో కుదుర్చుకున్న ఒప్పందం విఫలమైందని తెలి సింది. దీంతో నిల్వ చేసేందుకు కేంద్రాలు లేకపోవడంతో సీసీఐ అధికారులు తేమ శాతం తక్కువున్న పత్తిని కూడా కొనుగోలు చేయకుండా తప్పించుకున్నట్లు సమాచారం. ఆదిలాబాద్‌లో ఇదే దోపిడీ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మద్దతు ధర దక్కకపోవడంతో ఆదిలాబాద్ సీసీఐ కొనుగోలు కేంద్రంలో రైతులు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆందోళన చేశారు. చివరికి మార్కెటింగ్, రెవెన్యూ అధికారులు రైతు సంఘాల నాయకులు, వ్యాపారులతో చర్చలు జరిపారు. మద్దతు ధర క్వింటాలుకు రూ. 4,100 ఉండగా, రూ.325 తగ్గించి, రూ. 3,775కు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. తెచ్చిన పత్తిని తీసుకెళ్లలేని రైతులు ఆ ధరకే పత్తిని అమ్ముకొని వెనుదిరిగారు. మోసం చేశారు చేతికి వచ్చిన పత్తిని ట్రాలీలో నింపుకొని మార్కెట్‌కు వచ్చిన. సీసీఐ సార్లు తేమ 8 శాతమే ఉందని మెచ్చుకున్నరు. చిట్టి మీద నా పత్తి ఓకే అని రాసుకున్నరు. మద్దతు ధర రూ.4,100 చెప్పిండ్లు. మధ్యాహ్నం 3 అయినా సారు జాడనే లేదు. రేటు అచ్చిందని సంబరపడితే గిట్ల జేస్తుండ్లు. ధర దక్కిందనుకుంటే మోసమే జేసిండ్లు. - రాచపల్లి మల్లయ్య, బిజిగిరిషరీఫ్ -
మార్క్‌ఫెడ్ తీరే వేరు..!
జమ్మికుంట: జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లారెడ్డికి మార్క్‌ఫెడ్ షాక్ ఇచ్చింది. ఆయనకున్న మూడెకరాల భూమిలో మక్క పంట సాగు చేశాడు. చేతికి వచ్చిన మక్కలను అమ్ముకునేందుకు సోమవారం జమ్మికుంట మార్కెట్‌కు వచ్చాడు. మంగళవారం మార్కెట్లో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా ప్రారంభిస్తుండటంతో.. అధికారులు మల్లారెడ్డి తీసుకవచ్చిన మక్కలు నాణ్యతగా ఉన్నాయని గుర్తించి మంత్రి చేతుల మీదుగా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మక్కలను ఎలాక్ట్రానిక్ కాంటా ద్వారా తూకం వేసి కొనుగోళ్లు ప్రారంభించారు. తనతోనే మక్కల కొనుగోలు ప్రారంభించడంతో మల్లారెడ్డి ఎంతో సంతోషించాడు. సర్కారు మద్దతు ధర రూ.1310 పలుకుతుందని ఆశపడ్డాడు. తీరా మంత్రి మార్కెట్ నుంచి గేటు దాటాడో లేదో.. అధికారులు సరుకులో నాణ్యత లేదని, తూకం వేసిన బస్తాను కుప్పలో పోసేశారు. అధికారుల తీరుతో మల్లారెడ్డి బిత్తరపోయాడు. 140 బస్తాల మక్కలు తీసుకవస్తే కేవలం ప్రారంభోత్సవానికే తన సరుకును ఉపయోగించి మోసం చేశారని మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో ‘సాక్షి’తో వాపోయాడు. పొద్దంతా సరుకు బాగుందని పొగిడిన అధికారులు.. మంత్రి వెళ్లాక బాగా లేదని కొనుగోలు చేయలేదని అవేదన చెందాడు. దీంతో అతడు రాత్రంతా మక్కల వద్దనే పడిగాపులు కాశాడు. బుధవారం మక్కలను శుద్ధి చేసిన తర్వాత మద్దతు ధరకు కొనుగోలు చేశారు. కానీ.. వాటిని తరలించకపోవడంతో రాత్రి కూడా మక్కలకు కాపలా కాస్తూ అక్కడే ఉన్నాడు. మార్క్‌ఫెడ్ కేంద్రంలో మద్దతు ధర లభిస్తుందని కలలుగన్న తమకు నిరాశే మిగులుతోందని పలువురు రైతులు వాపోయారు. బుధవారం వివిధ ప్రాంతాల రైతులు రెండు వేల క్వింటాళ్ల మక్కలు తీసుకురాగా.. మార్క్‌ఫెడ్ అధికారులు 800 క్వింటాళ్లు మద్దతు ధరకు కొనుగోలు చేశారు. నాణ్యత సాకుతో మార్క్‌ఫెడ్ తిరస్కరించిన మక్కలను ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.గరిష్టంగా రూ.1078, కనిష్టంగా రూ.1067 చెల్లించి కొన్నారు. ఆరంభంలోనే మార్క్‌ఫెడ్ కొర్రీలు పెడుతుండటంతో మున్ముందు ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.