పత్తి రైతు అరిగోస | Government neglect on Cotton farmers | Sakshi
Sakshi News home page

పత్తి రైతు అరిగోస

Published Thu, Oct 15 2015 3:27 AM | Last Updated on Tue, Oct 2 2018 5:14 PM

పత్తి రైతు అరిగోస - Sakshi

పత్తి రైతు అరిగోస

కరీంనగర్ జిల్లాలో కిలో పత్తి కూడా కొనని సీసీఐ
మార్కెట్‌కు వచ్చిన పత్తి అంతా వ్యాపారులపాలు
దళారీ చెప్పిందే రేటు.. అధికారులే మధ్యవర్తులు
రూ.4,100 ధర ఉంటే.. రూ.2,500 నుంచి 3,700 మధ్య కొనుగోలు
ఆర్థిక మంత్రి ఈటల ఇలాఖాలో దుస్థితి
జమ్మికుంట మార్కెట్‌కు 5 వేల క్వింటాళ్లు వచ్చినా బోణీ కాని వైనం
తొలిరోజే రూ.అరకోటి నష్టపోయిన రైతన్న

సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘రైతులెవరూ దళారులను ఆశ్రయించకండి. నేరుగా పత్తిని సీసీఐకి అమ్మి ప్రభుత్వం నిర్ణయించిన రూ.4,100 మద్దతు ధర పొందండి’ - సీసీఐ నినాదమిది! కరపత్రాలు ముద్రించి మరీ రైతులకు పంపిణీ చేసింది. కానీ సీసీఐ మాటలు నమ్ముకుని పత్తి మార్కెట్‌కు వెళ్లిన రైతన్న చిత్తయ్యాడు.

తేమ శాతం ఎక్కువుందని.. బస్తాల్లో తెచ్చారని సాకులు చూపుతూ కొనుగోలుకు నిరాకరించారు. తెచ్చిన పత్తిని ఏం చేయాలో తోచని అన్నదాతలు మార్కెట్ కార్యాలయానికి వెళ్తే.. అక్కడ సీసీఐ అధికారులే మధ్యవర్తి అవతారమెత్తారు. అడ్తిదారులతో బేరాలాడి రైతులు తెచ్చిన పత్తిని ఎంతో కొంతకు కొనుగోలు చేయించారు. క్వింటాలు మద్దతు ధర రూ.4,100 ఉంటే.. అడ్తిదారులు రూ.2,800 నుంచి రూ.3,750 వరకు ధర నిర్ణయించేశారు. తెచ్చిన పత్తిని ఇంటికి తీసుకుపోలేక.. అక్కడే పడిగాపులు పడలేక రైతన్న ఎంతో కొంత రేటుకు అమ్ముకుని దీనంగా ఇంటి ముఖం పట్టారు. మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గమైన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్‌లో సాగుతున్న బహిరంగ దోపిడీ ఇది.
 
ఒక్క రైతుకు కూడా అందని ‘మద్దతు’
కరీంనగర్ జిల్లాలో బుధవారం జమ్మికుంట, చొప్పదండి, గంగాధర మార్కెట్లలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంగళవారమే కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో సీసీఐ అధికారులు కిలో పత్తిని కూడా కొనుగోలు చేయలేదు. సీసీఐని నమ్ముకుని మంగళ, బుధవారాల్లో 6 వేల క్వింటాళ్ల పత్తిని రైతులు మార్కెట్లకు తీసుకొచ్చారు. అందులో ఒక్క జమ్మికుంట మార్కెట్‌కే దాదాపు 5 వేల క్వింటాళ్ల పత్తి తెచ్చారు. అయితే సీసీఐ అధికారులు ఎక్కడా బోణీ చేయలేదు.

ఫలితంగా ఒక్క రైతూ మద్దతు ధరకు నోచుకోలేదు. తెచ్చిన పత్తినంతా సగటున క్వింటాలుకు రూ.3,400 చొప్పున అడ్తిదారులకే కట్టబెట్టేశారు. ఈ లెక్కన క్వింటాలుకు రూ.వెయ్యి చొప్పున నష్టం వాటిల్లింది. అంటే బుధవారం ఒక్కరోజే రూ.60 లక్షల మేర రైతులు నష్టపోయారు. అందులో ఒక్క జమ్మికుంట మార్కెట్‌లోనే రైతులు 50 లక్షల మేర నష్టపోయారు.
 
బస్తాలు వద్దు.. లూజ్ వద్దు
జమ్మికుంట మార్కెట్‌కు రైతులు సుమారు 100 ట్రాలీల్లో లూజ్ పత్తి తీసుకొచ్చారు. మిగిలిన పత్తినంతా బస్తాల్లో తీసుకొచ్చారు. బస్తాల్లో తెచ్చిన పత్తి వైపు కన్నెత్తి కూడా చూడని అధికారులు.. లూజ్ పత్తి ట్రక్కుల వద్ద కెళ్లి తేమ శాతాన్ని పరిశీలించారు. అందులో 11 ట్రక్కుల్లోని పత్తి కొనుగోలుకు సిద్ధమయ్యారు. కొనుగోలు చేసిన పత్తిని నిల్వ చేసేందుకు కేంద్రాలు లేవని తెలియడంతో అధికారులు జారుకున్నారు. ఎంత సేపటికీ రాకపోవడంతో రైతులంతా మార్కెట్ కార్యాలయానికి వచ్చి అధికారులను కలసినా ఫలితం లేకుండా పోయింది.

చివరికి సీసీఐ అధికారే మధ్యవర్తి అవతారమెత్తి అడ్తిదారుల సంఘం నాయకుడితో రహస్య సంప్రదింపులు జరిపారు. కనీస మద్దతు ధర సగటున రూ.3,500గా నిర్ణయించారు. అక్కడ నిర్ణయం జరిగిన గంటన్నరలో అడ్తిదారులంతా పత్తి కొనుగోళ్లను పూర్తి చేశారు. క్వింటాలు పత్తి ధర రూ.2,750 నుండి 3,750 వరకు కొనుగోలు చేశారు. సాయంత్రం 5 గంటలకు మార్కెట్‌కు వచ్చిన పత్తినంతా జిన్నింగ్ మిల్లులకు తరలించేశారు.

చివరకు సీసీఐ కొనుగోలు చేసేందుకు సిద్ధమైన లూజ్ పత్తినీ ఇదే ధరకు అడ్తిదారులు కొనుగోలు చేయడం గమనార్హం. జిల్లాలో పత్తి నిల్వ చేసేందుకు జిన్నింగ్ మిల్లుల యజమానులతో కుదుర్చుకున్న ఒప్పందం విఫలమైందని తెలి సింది. దీంతో నిల్వ చేసేందుకు కేంద్రాలు లేకపోవడంతో సీసీఐ అధికారులు తేమ శాతం తక్కువున్న పత్తిని కూడా కొనుగోలు చేయకుండా తప్పించుకున్నట్లు సమాచారం.
 
ఆదిలాబాద్‌లో ఇదే దోపిడీ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మద్దతు ధర దక్కకపోవడంతో ఆదిలాబాద్ సీసీఐ కొనుగోలు కేంద్రంలో రైతులు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆందోళన చేశారు. చివరికి మార్కెటింగ్, రెవెన్యూ అధికారులు రైతు సంఘాల నాయకులు, వ్యాపారులతో చర్చలు జరిపారు. మద్దతు ధర క్వింటాలుకు రూ. 4,100 ఉండగా, రూ.325 తగ్గించి, రూ. 3,775కు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. తెచ్చిన పత్తిని తీసుకెళ్లలేని రైతులు ఆ ధరకే పత్తిని అమ్ముకొని వెనుదిరిగారు.
 
మోసం చేశారు
చేతికి వచ్చిన పత్తిని ట్రాలీలో నింపుకొని మార్కెట్‌కు వచ్చిన. సీసీఐ సార్లు తేమ 8 శాతమే ఉందని మెచ్చుకున్నరు. చిట్టి మీద నా పత్తి ఓకే అని రాసుకున్నరు. మద్దతు ధర రూ.4,100 చెప్పిండ్లు. మధ్యాహ్నం 3 అయినా సారు జాడనే లేదు. రేటు అచ్చిందని సంబరపడితే గిట్ల జేస్తుండ్లు. ధర దక్కిందనుకుంటే మోసమే జేసిండ్లు.
- రాచపల్లి మల్లయ్య, బిజిగిరిషరీఫ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement