సాక్షి, జమ్మికుంట(హుజూరాబాద్): భారత పత్తి సంస్థ(సీసీఐ), తెలంగాణ పత్తి మిల్లర్ల మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్‌కు తాత్కాలికంగా తెరపడింది. బేళ్ల తయారీలో విధిస్తున్న నిబంధనలను పునః పరిశీలిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వ్యాపారులు వెనక్కి తగ్గారు. ఈ మేరకు 2019–20 సీజన్ కోసం సీసీఐ మళ్లీ టెండర్లు ఆహ్వానించగా, దాఖలు చేసేందుకు మిల్లర్లు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని మూడు రీజియన్ల పరిధిలో 108 కేంద్రాల నుంచి టెండర్లు పిలవగా.. ఇందులో వరంగల్ పరిధిలో 55 కేంద్రాలు ఉన్నాయి.
సీజన్‌కు ముందే సీసీఐ ఏర్పాట్లు..
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోళ్ల సీజన్‌కు ముందే బేళ్ల తయారీ, రవాణాకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటుంది. ఈ మేరకు జూలై లేదా ఆగస్టులో జిన్నింగు మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లు నుంచి టెండర్లు ఆహ్వానిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే మార్కెట్లో పత్తి కొనుగోళ్లకు దిగుతుంది. ఎప్పటిలాగే ఈ యేడు కూడా 2019–20 సీజన్ కోసం జిన్నింగు, ప్రెస్సింగు, బేళ్ల రవాణాకు జూలై 26న టెండర్లు పిలిచింది. దాఖలుకు ఆగస్టు 14 వరకు గడువిచ్చింది. రాష్ట్రంలోని వరంగల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ రీజియన్ల పరిధిలోని 108 కేంద్రాల వ్యాపారుల నుంచి టెండర్లకు తెర తీయగా.. తెలంగాణ నుంచి ఎవరూ దాఖలు చేయలేదు.
నిరుడు సీసీఐ అమల్లోకి తెచ్చిన నిబంధనలను నిరసిస్తూ రాష్ట్ర పత్తి వ్యాపారుల సంక్షేమ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. లింట్, ట్రాష్, షార్టేజీ శాతం, బేళ్ల తయారీ ఛార్జీపై అసంతృప్తితో ఉన్న మిల్లర్లు టెండర్లకు దూరంగా నిలిచారు. ఈ వ్యవహారంపై గత నెల 18న ‘సాక్షి’లో ‘సీసీఐకి పత్తి మిల్లర్ల షాక్’ శీర్షికన కథనం ప్రచురించింది. స్పందించిన రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ అధికారులు సమస్యపై ఆరా తీశారు. ఈ మేరకు ఆగస్టు 25న హైదరాబాద్ గోల్కొండ హోటల్లో వ్యవసాయశాఖ, మార్కెటింగ్‌శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో ఇరువర్గాలతో చర్చలు జరిపారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కరించుకోవాలని మంత్రి వారికి సూచించారు.
సీసీఐ హామీకి సమ్మతించిన మిల్లర్లు..
సీసీఐ షరతులపై నైరాశ్యంతో ఉన్న రాష్ట్ర పత్తి మిల్లర్ల సంక్షేమ సంఘం.. మంత్రి నిరంజన్‌రెడ్డి సూచనతో వెనక్కి తగ్గింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు ముంబయిలోని సీసీఐ ప్రధాన కార్యాలయంలో ఇప్పటికి రెండుసార్లు చర్చలు జరిపారు. ఇప్పుడున్న దూది, దుమ్ము, తరుగు శాతంతో తమకు నష్టం వాటిల్లినట్లు ప్రతినిధులు సీసీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బేళ్ల తయారీ ఛార్జీ తక్కువగా ఉందని, మిల్లుల నిర్వహణకు ఇవి ఏమాత్రం చాలడం లేదని వివరించారు.
జిన్నింగు మిల్లులు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను పూర్తిగా వివరించారు. ఈ మేరకు సడలించాల్సిన షరతులను విన్నవించగా, అధికారులు సానుకూలంగా స్పందించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక దీనిపై నిర్ణయం తీసుకుంటామని సీసీఐ హామీ ఇవ్వగా, సంఘం ప్రతినిధులు సమ్మతించారు. దీంతో అధికారులు మూడు రీజియన్ల పరిధిలోని పత్తి మిల్లర్ల నుంచి గురువారం మళ్లీ టెండర్లు పిలిచారు. దాఖలుకు ఈ నెల 11 వరకు గడువిచ్చారు. ప్రస్తుతానికి సమస్య తీరడంతో వ్యాపారులు క్రమంగా టెండర్లు వేస్తున్నారు.
వరంగల్ రీజియన్‌లో 55 కేంద్రాలు..
తెలంగాణలో సీసీఐకి మూడు రీజియన్లు ఉన్నాయి. వరంగల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌లో వాటిని నిర్వహిస్తున్నారు. మూడు రీజియన్ల పరిధిలో సీసీఐ ఈసారి 108 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. వరంగల్ రీజియన్లో 55, మహబూబ్‌నగర్లో 29, ఆదిలాబాద్ రీజియన్లో 24 కేంద్రాలను నెలకొల్పేందుకు కసరత్తు పూర్తి చేసింది. పరిస్థితులకు అనుగుణంగా వీటిని పెంచే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట, కరీంనగర్, గోపాల్‌రావుపేట, గంగాధర, చొప్పదండి, హుజూరాబాద్, వేములవాడ, పెద్దపల్లి, కమాన్‌పూర్, సుల్తానాబాద్, మంథని, వెల్గటూర్ కేంద్రాలు సీసీఐ జాబితాలో ఉన్నాయి. ఈ నెలాఖరు నుంచి అన్ని కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లకు సిద్ధంగా ఉండేందుకు సీసీఐ సన్నాహాలు సాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment