రూటు మారిన వేలం పాట | Auction In Cottom Market | Sakshi
Sakshi News home page

రూటు మారిన వేలం పాట

Published Mon, Apr 16 2018 12:03 PM | Last Updated on Mon, Apr 16 2018 12:03 PM

Auction In Cottom Market - Sakshi

జమ్మికుంట(హుజూరాబాద్‌): ఉత్తరతెలంగాణ జిల్లాలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ పత్తి మార్కెట్‌గా పేరుగాంచిన జమ్మికుంటలో వేలంపాట గాడి తప్పింది. రైతులను నిండా ముంచేందుకు అందరూ ఏకమవుతున్నారు. వ్యాపారులందరూ కలిసి పత్తి రైతులను నిలువునా దోచుకుంటున్నారు. పత్తిలోడ్‌తో మార్కెట్‌కు వచ్చే ప్రతివాహనానికి నిబంధనల ప్రకారం వేలం వేసి.. పత్తిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ.. కేవలం ఒకే వాహనానికి వేలం వేసి.. మిగిలిన వాహనాల్లోని పత్తికి ఇష్టారీతిన ధర పెడుతున్నారు. ఇదంతా మార్కెటింగ్‌ శాఖ అధికారుల కళ్లముందే జరుగుతున్నా.. ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. దీంతో రైతులు తెస్తున్న పత్తికి పోటీలేక.. ధరలు తగ్గిపోతున్నాయి. ఆరుగాలం కష్టపడి పత్తినే నమ్ముకున్న రైతు మార్కెట్‌కు వచ్చేసరికి ధర తగ్గిపోవడంతో మోసపోతున్నారు.

దందా ఇలా..
పత్తి మార్కెట్‌కు నిత్యం 150 వాహనాల్లో రైతులు తమ ఉత్పత్తులను విక్రయానికి తెస్తారు. ప్రతిరోజూ వ్యాపారులు వేలంలో పాల్గొని.. నాణ్యతప్రమాణాల మేరకు వేలం వేసి.. ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మార్కెట్‌కు వచ్చిన చివరి వాహనం వరకు వేలం వేయాలి. ఫలితంగా వ్యాపారుల్లో పోటీ పెరిగి రైతుకు మేలు జరుగుతుందని. కానీ.. కొద్దిరోజులుగా ఇక్కడ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మార్కెట్‌కు వచ్చిన వాహనాల్లో మొదటి వాహనానికే వేలం పాట పాడి.. ఆ తర్వాత వ్యాపారులంతా విడిపోయి నచ్చిన వాహనాన్ని చూసుకుని ధర నిర్ణయిస్తున్నాడు. దీంతో అతడు పెట్టిన ధరే రైతుకు దక్కుతోంది. అదే వ్యాపారుల్లో పోటీ పెరిగితే రైతులకు క్వింటాల్‌కు కనీసం రూ.50 నుంచి రూ.100 పెరిగే అవకాశం ఉంది. 

వ్యాపారుల్లో విభేదాలు...?
పత్తి మార్కెట్‌లో వేలం పాట లేకపోవడం.. మంచి పత్తిని కొంత మంది నేరుగా వాహనాల వద్దకు వెళ్లి ఇష్టానుసారంగా ధరలు పెట్టి కొనుగోళ్లు చేస్తుండడంతో కొంద మంది వ్యాపారులకు నచ్చడం లేదు. నిబంధనలను పాటిస్తే వేలం పాట నచ్చిన న్ని వాహనాలను పత్తి కొనుగోళ్లు చేయవచ్చని, వేలంలేక పోవడం వల్ల ఆశించిన పత్తి చేతికి రావడం లేదనే విభేదాలు నెలకొన్నాయి. గత శుక్రవారం పత్తి మార్కెట్‌కు 915 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా గరిష్ట ధర రూ. 4750 పలికింది. కనిçష్ట ధర రూ.3500 చెల్లించారు.

పాట కొనసాగించాలి..
పత్తి మార్కెట్‌లో ప్రతి వాహనానికీ వేలం కొనసాగించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. వ్యాపారుల మధ్య పోటీ లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో అధికారులు నిబంధనలను ఎందుకు అమలు చేయడం లేదో తెలియడం లేదని పేర్కొంటున్నారు. రైతుల పక్షాన ఉండాల్సిందిపోయి.. వేలానికే ఎసరు తెచ్చారని, ఇది సరికాదని, అధికారులు స్పందించి.. వేలం పాటను యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement