Cotton Market
-
ఖమ్మం పత్తి మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం
-
రికార్డు ధర: గజ్వేల్‌లో రూ.8,261 జమ్మికుంటలో రూ.8,150
జమ్మికుంట/ఆదిలాబాద్ టౌన్/ ఖమ్మం వ్యవసాయం/సిద్దిపేట: తెల్ల బంగారం ధరలో రికార్డులు సృష్టిస్తోంది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.6,025 ఉండగా, బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.2 వేలకుపైబడి ధర పలుకుతోంది. మంగళవారం గజ్వేల్ మార్కెట్లో క్వింటాల్ పత్తికి రూ.8,261 ధర లభించింది. ఇంకా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో రూ.8,150, ఆదిలాబాద్ మార్కెట్లో రూ.8,020, వరంగల్ ఏనుమాముల మార్కెట్లో రూ.7,960, జనగామ మార్కెట్లో రూ.7,900, ఖమ్మంలో రూ.7,800 ధరకు వ్యాపారులు కొను గోలుచేశారు. దేశవ్యాప్తంగా పత్తి దిగుబడి తగ్గినందుకే ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. విదేశాల్లో పత్తి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందని, రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. కాగా, మంగళవారం పై ప్రధాన మార్కెట్లకు పెద్దసంఖ్యలో వాహనాల్లో పత్తి వచ్చింది. అన్నిచోట్లా మోడల్ ధర క్వింటాకు రూ.8 వేలకుపైగా, కనిష్టంగా రూ.7,900 చొప్పున వ్యాపారులు రైతులకు చెల్లించారు. (చదవండి: Anthrax At Warangal: ఆంత్రాక్స్ వ్యాధి కలకలం: మటన్ కొంటున్నారా..? జర జాగ్రత్త!) -
రూటు మారిన వేలం పాట
జమ్మికుంట(హుజూరాబాద్): ఉత్తరతెలంగాణ జిల్లాలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ పత్తి మార్కెట్‌గా పేరుగాంచిన జమ్మికుంటలో వేలంపాట గాడి తప్పింది. రైతులను నిండా ముంచేందుకు అందరూ ఏకమవుతున్నారు. వ్యాపారులందరూ కలిసి పత్తి రైతులను నిలువునా దోచుకుంటున్నారు. పత్తిలోడ్‌తో మార్కెట్‌కు వచ్చే ప్రతివాహనానికి నిబంధనల ప్రకారం వేలం వేసి.. పత్తిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ.. కేవలం ఒకే వాహనానికి వేలం వేసి.. మిగిలిన వాహనాల్లోని పత్తికి ఇష్టారీతిన ధర పెడుతున్నారు. ఇదంతా మార్కెటింగ్ శాఖ అధికారుల కళ్లముందే జరుగుతున్నా.. ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. దీంతో రైతులు తెస్తున్న పత్తికి పోటీలేక.. ధరలు తగ్గిపోతున్నాయి. ఆరుగాలం కష్టపడి పత్తినే నమ్ముకున్న రైతు మార్కెట్‌కు వచ్చేసరికి ధర తగ్గిపోవడంతో మోసపోతున్నారు. దందా ఇలా.. పత్తి మార్కెట్‌కు నిత్యం 150 వాహనాల్లో రైతులు తమ ఉత్పత్తులను విక్రయానికి తెస్తారు. ప్రతిరోజూ వ్యాపారులు వేలంలో పాల్గొని.. నాణ్యతప్రమాణాల మేరకు వేలం వేసి.. ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మార్కెట్‌కు వచ్చిన చివరి వాహనం వరకు వేలం వేయాలి. ఫలితంగా వ్యాపారుల్లో పోటీ పెరిగి రైతుకు మేలు జరుగుతుందని. కానీ.. కొద్దిరోజులుగా ఇక్కడ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మార్కెట్‌కు వచ్చిన వాహనాల్లో మొదటి వాహనానికే వేలం పాట పాడి.. ఆ తర్వాత వ్యాపారులంతా విడిపోయి నచ్చిన వాహనాన్ని చూసుకుని ధర నిర్ణయిస్తున్నాడు. దీంతో అతడు పెట్టిన ధరే రైతుకు దక్కుతోంది. అదే వ్యాపారుల్లో పోటీ పెరిగితే రైతులకు క్వింటాల్‌కు కనీసం రూ.50 నుంచి రూ.100 పెరిగే అవకాశం ఉంది. వ్యాపారుల్లో విభేదాలు...? పత్తి మార్కెట్లో వేలం పాట లేకపోవడం.. మంచి పత్తిని కొంత మంది నేరుగా వాహనాల వద్దకు వెళ్లి ఇష్టానుసారంగా ధరలు పెట్టి కొనుగోళ్లు చేస్తుండడంతో కొంద మంది వ్యాపారులకు నచ్చడం లేదు. నిబంధనలను పాటిస్తే వేలం పాట నచ్చిన న్ని వాహనాలను పత్తి కొనుగోళ్లు చేయవచ్చని, వేలంలేక పోవడం వల్ల ఆశించిన పత్తి చేతికి రావడం లేదనే విభేదాలు నెలకొన్నాయి. గత శుక్రవారం పత్తి మార్కెట్‌కు 915 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా గరిష్ట ధర రూ. 4750 పలికింది. కనిçష్ట ధర రూ.3500 చెల్లించారు. పాట కొనసాగించాలి.. పత్తి మార్కెట్లో ప్రతి వాహనానికీ వేలం కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారుల మధ్య పోటీ లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో అధికారులు నిబంధనలను ఎందుకు అమలు చేయడం లేదో తెలియడం లేదని పేర్కొంటున్నారు. రైతుల పక్షాన ఉండాల్సిందిపోయి.. వేలానికే ఎసరు తెచ్చారని, ఇది సరికాదని, అధికారులు స్పందించి.. వేలం పాటను యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నారు. -
కొత్త విపత్తి
వరంగల్ సిటీ : గత ఏడాది మిర్చి సాగు చేసిన రైతులు ధర కోసం పడిన ఇబ్బందులను మరువకముందే పత్తి రైతులు కూడా కనీస ధర కోసం అంతకంటే ఎక్కువ అవస్థలు పడే అవకాశం కనిపిస్తోంది. పత్తి రైతుల మెడపై వ్యాపారుల ధరల కత్తి వేలాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తోంది. రెండేళ్లుగా పత్తి సాగు చేయొద్దని వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో ప్రచారం చేయడంతో రైతులు మిర్చివైపు మొగ్గు చూపారు. దీంతో ప్రత్యామ్నాయంగా మిర్చి సాగు పెరగడంతో మార్కెట్లో ధర అమాంతం పడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది పెద్ద ఎత్తున పత్తి సాగుచేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ సంవత్సరం ఉమ్మడి జిల్లాలో 46 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేసినట్లు, 28 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి రానున్నట్లు ఇప్పటికే మార్కెటింగ్ శాఖ ఓ అంచనాకు వచ్చింది. ‘మద్దతు’ను మించిన ధర 20 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల ఎకరాలకు మించి పత్తిని సాగుచేసిన దాఖలాలు లేవు. అలాగే 2011–12 సంవత్సరంలో అత్యధికంగా 19 లక్షల క్విటాళ్లకుపైగా పత్తి వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకానికి వచ్చింది. ఇప్పటి వరకు అదే రికార్డు. ఇక 2015–16 సంవత్సరంలో 14,76,585 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. ఆ ఏడాది కనీస మద్దతు ధర రూ.4,050 ఉండగా క్వింటాల్‌కు అత్యధికంగా రూ.6,700 ధర పలకడంతో సీసీఐ కొనుగోళ్లను చేపట్టలేదు. అలాగే 2016–17 సంవత్సరంలో 16,99,140 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా ధర గరిష్టంగా రూ.5,810 పలికింది. ఆ ఏడాది కనీస మద్దతు ధర రూ.4,160 మాత్రమే ఉండడంతో సీసీఐ మళ్లీ కొనుగోళ్లకు రాలేదు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేసినట్లు, ఒక వరంగల్ మార్కెట్‌కే దాదాపుగా 23 లక్షల క్విటాళ్లకుపైగా పత్తి అమ్మకానికి రానున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఆదిలోనే హంసపాదు.. గత వారం రోజులుగా వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు రో జుకు 50 బస్తాల వరకు కొత్త పత్తి అమ్మకానికి వస్తోంది. ధర మాత్రం రూ.3,300లోపే పలుకుతోంది. ప్రస్తుతం మార్కె ట్లో పాత పత్తికి రూ.5,100 ధర చెల్లిస్తున్నారు. కాగా ఈ సం వత్సరం పత్తికి కనీస మద్దతు ధరను రూ.4160కు మరో రూ.160 కలిపి రూ.4,320గా నిర్ణయించారు. ప్రస్తుతం కొత్త పత్తికి ధర రూ.3,300 మాత్రమే పలుకుతుండడంతో సీసీఐ రంగప్రవేశం తప్పనిసరి అని తేటతెల్లమవుతోంది. వ్యాపారుల ప్రతిజ్ఞ.. కాగా ఈ సారి పత్తి రాష్ట్రవ్యాప్తంగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, జిల్లాల్లో పెద్ద ఎత్తున సాగుబడి అయినందున, మార్కెట్‌కు భారీగా పత్తి అమ్మకానికి వస్తుందని, తేమ ఉన్న పత్తిని ఎవరు కూడా ముందుపడి కొనవద్దని, చేతనైనంత పత్తి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉండే అవకాశం ఉన్నందున అంతా ఏకతాటిపై ఉండి గత సంవత్సరం అంతగా రాని లాభాలను ఈ సారి దక్కించుకోవాలని పత్తి ఖరీదుదారులు గత వారం రోజుల క్రితమే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోని ప్రతిజ్ఞ చేసినట్లు తెలిసింది. అంతేగాక సీజన్ ప్రారంభమైతే ఏప్రిల్ వరకు తీరిక ఉండదనే ఉద్దేశంతో వ్యాపారులంతా కేరళ టూర్‌కు వెళ్లినట్లు సమాచారం. 15న జౌళిశాఖ కార్యదర్శి రాక అన్ని మార్కెట్లలో కార్యదర్శులంతా పత్తి కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలని, సీసీఐ రంగప్రవేశం చేయడానికి సాఫ్ట్‌వేర్‌తో సహ, తేమను కొలిచే మిషన్లు, వేబ్రిడ్జీలు, అవసరం మేరకు సిబ్బందిని సిద్ధం చేసి ఉంచాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు ఇప్పటికే పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్‌ల్లో ఆదేశించారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అన్ని మార్కెట్లల్లో సీసీఐ కొనుగోళ్లు కేంద్రాలను ఆయా ఎమ్మెల్యేల చేత ప్రారంభించి కొనుగోళ్లను చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 15న జౌళిశాఖ కార్యదర్శి అనంతకుమార్‌సింగ్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి, సీసీఐ కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయనున్నట్లు కూడా ఆదేశాలు అందినట్లు మార్కెటింగ్ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 143 సెంటర్లు.. ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా 143 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మార్కెటింగ్ శాఖ తెలిపింది. ఇది గతంలో ఉన్న 92 సెంటర్లకు 51 సెంటర్లు అదనం. ఏనుమాముల మార్కెట్ రెండు సీసీఐ కేంద్రాలతోపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరో 12 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాక రైతులు మార్కెట్ల వరకు రాకుండా సమీపంలోని జిన్నింగ్ మిల్లుల వద్ద కూడా పత్తిని కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ మద్దతు ధర రూ.4320కి పడిపోకుండా చూడాలని తగిన ఆదేశాలు అందినట్లు కూడా మార్కెటింగ్ అధికారులు, చైర్మన్లు తెలిపారు. -
బ్లూటూత్‌తోనే తూకం లెక్క..!
► పత్తి మార్కెట్లో హ్యాండ్యంత్రాలను ప్రారంభించిన చైర్మన్ రమేశ్ జమ్మికుంట : జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో నామ్ అమలులో భాగంగా ఆన్ లైన్ విధానం అమలు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను ఎంట్రీ గేట్ వద్దే ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారు. తాజాగా ఎలక్ట్రానిక్ తూకాల్లోనూ మార్పులు చేస్తున్నారు. రైతులు బస్తాల్లో తెచ్చిన ఉత్పత్తులను బ్లూటూత్ ద్వారా తూకం వేసి రషీదు ఇచ్చేలా నూతన యాత్రాలను ప్రవేశపెట్టారు. బ్లూటూత్ అనుసంధానంతో ఉన్న ఎలాక్ట్రానిక్ కాంటాలు ఏడింటిని మార్కెట్ కార్యదర్శి వెంకట్‌రెడ్డి, కమిటీ చైర్మన్ పింగిళి రమేశ్‌తో కలిసి ప్రారంభించారు. రైతులు బస్తాల్లో తీసుకొచ్చిన పత్తిని తూకం వేసి మొత్తం బస్తాలకు సంబంధించిన లెక్కతో రైతులకు రషీదు ఇస్తామని చైర్మన్ రమేశ్ తెలిపారు. దీని ద్వారా తూకాల్లో ఎలాంటి తేడాలు రావని పేర్కొన్నారు. వైస్‌చైర్మన్ ఎర్రబెళ్లి రాజేశ్వర్‌రావు, వ్యాపారులు నగునూరి రవీందర్, దొడ్డ శ్యామ్, దేసు రవీందర్, ముక్కా నారాయణ, లింగారావు, స్వామి, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు న్యాయం చేయాలి
► వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేశ్ ► జమ్మికుంట పత్తి మార్కెట్ సందర్శన జమ్మికుంట : ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులు దిగుబడి విక్రరుుంచే క్రమంలో మార్కెట్లో దోపిడీకి గురికాకుండా చర్యలు చేపట్టాలని, ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చొరవ చూపాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోరారు. జమ్మికుంట పత్తి మార్కెట్‌ను నగేశ్‌తో పాటు పార్టీ మహిళ విభాగం అధ్యక్షురాలు బోగ పద్మ, రాష్ట్ర యూత్ కార్యదర్శి దుబ్బాక సంపత్, జిల్లా అధికార ప్రతినిధి మందరాజేశ్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. మార్కెట్లో ధర విషయంలో రైతులను నిలువునా ముంచుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. నంబర్ ధరకు క్వింటాల్‌కు రూ.150 నుంచి 300 వరకు తేడాలు పెట్టి కొనుగోళ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రోజు ఎక్కువ ధర పెట్టి మరుసటి కోత పెట్టుతున్నారని వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ నగేశ్ మాట్లాడుతూ.. జమ్మికుంట మార్కెట్లో జరుగుతున్న దోపిడీ విధానాన్ని అరికట్టేందుకు, రైతులకు మంచి ధర దక్కేలా మంత్రి ఈటల రాజేందర్ చోరవ తీ సుకోవాలని కోరారు. రైతులకు అన్యాయం జరిగితే చూ స్తూ ఉరుకునేది లేదని నగేశ్ హెచ్చరించారు. కార్యక్రమం లో జిల్లా నాయకులు సానా రాజయ్య, దొడ్డె యుగేందర్, జంపాల రితిష్, కొత్తూరి నరేష్, అంబాల హరీష్, గుళ్లి స తీష్, గుళ్లి సందీప్, కనుకం బాబు. ఎండి మహుముద్, కనుకం రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. -
వేలంపాటకు మంగళం
► వ్యాపారులు,అడ్తిదారులదే రాజ్యం ► గాడితప్పుతున్న పత్తి కొనుగోళ్లు ► జమ్మికుంటలో దగాపడుతున్న రైతులు జమ్మికుంట : జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో కొనుగోళ్లు రోజురోజుకు గాడితప్పుతున్నారుు. వందలాది వాహనాల్లో వచ్చిన పత్తికి వేలం వేలంపాట పాడకుండానే ఇష్టానుసారంగా ధరలు నిర్ణరుుస్తూ మిల్లులకు తరలిస్తున్నారు. పోటీ లేక పోవడంతో సేటు చెప్పిన ధరకే పత్తిని అమ్ముకునే దుస్థితి నెలకొందని పలువురు రైతులు వాపోతున్నారు. మార్కెట్‌కు వచ్చే ప్రతి లూజ్ పత్తికి వేలంపాట ద్వారానే ధర నిర్ణరుుంచి కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతా వారి ఇష్టారాజ్యమే.. జమ్మికుంట మార్కెట్‌కు ప్రతి రోజు దాదాపు 150 నుంచి 250 వాహనాల వరకు లూజ్ పత్తి వస్తుంది. గతంలో మొదటి వాహనం నుంచి మొదలుకొని చివరి వాహనం వరకు వ్యాపారులతో వేలంపాట నిర్వహించి అడ్తిదారులు అమ్మకాలు సాగించేవారు. దీంతో వ్యాపారుల పోటీ నెలకొని పత్తికి మంచి ధరలు పలికేవి. ఇటీవల అడ్తిదారులు ఈ విధానానికి స్వస్తి పలికారు. గతకొద్ది రోజులుగా మార్కెట్లో ఇరవై ముప్పై వాహనాలకే వేలంపాడుతూ మిగతా పత్తికి ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణరుుస్తున్నారు. ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో కాని సేటు చెప్పిన ధరకు అడ్తిదారు సై అంటూ చిట్టిపై రాసి మిల్లులకు తరలిస్తున్నారు. వేలం పాడిన పత్తికి ఎక్కువ ధర పలుకుతుండగా.. మిగతా పత్తికి తక్కువ ధర చెల్లిస్తూ రైతులను దోచుకుంటున్నారు. మంగళవారం మార్కెట్‌కు 230 వాహనాల్లో లూజ్ పత్తి రాగా... 200 వాహనాలకు వేలం పాటనే లేదు. లూజ్ పత్తికి రూ.5110 వేలంపాటలో గరిష్ట ధర పాడిన వ్యాపారులు నేరుగా కొనుగోళ్లు చేసిన పత్తికి క్వింటాల్‌కు రూ.4750 నుంచి రూ.5000 వేల వరకు చెల్లించినట్లు రైతులు తెలిపారు. వేలంపాటను కొనసాగించాలి.. మార్కెట్‌కు వాహనాల్లో వచ్చే పత్తికి వేలంపాట ద్వారా ధరలు నిర్ణరుుంచి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. వేలం పాట లేక పోవడం వల్ల ధరల్లో భారీగా వ్యత్యాసాలు వస్తూ తాము నష్టపోతున్నామని సైదాపూర్‌కు చెందిన రవీందర్‌రెడ్డి అవేదన వ్యక్తం చేశారు. నేరుగా ధరలు నిర్ణరుుంచడంతో తొందరగా ఇంటికి వెళ్లొచ్చని అనుకుంటే క్వింటాల్ పత్తికి రూ.100 నుంచి రూ.150 వరకు ధరలు తక్కువ వేస్తున్నారని హుజూరాబాద్ మండలం నర్సింగపూర్‌కు చెందిన తిరుపతిరెడ్డి వాపోయాడు. మార్కెట్లో ప్రతి వాహనానికి వేలంపాట పెట్టాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. ఉదయం 9.30 గంటలకు వేలంపాట మొదలైన గంట వరకే మార్కెట్లో ఒక్క వాహనం లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోందని రైతులు పేర్కొంటున్నారు. -
ఇక రైతులది అరణ్యరోదనే?
పత్తి మార్కెట్లో దోపిడీకి లైన్ క్లియర్? మార్కెట్ సిబ్బందికి రూ.లక్షల్లో మామూళ్లు ఒక్కో అడ్తిదుకాణానికి రూ.2500 వసూళ్లు జమ్మికుంటలో దాదాపు 80 దుకాణాలు జమ్మికుంట : అరుగాలం చెమటోడ్చి పత్తిని పండించిన రైతన్నల వేదన ఇక ఆరణ్య రోదనే కానుంది. మార్కెట్లో రైతులకు అండగా నిలవాల్సిన వారంతా మామూళ్లకు సిద్ధం కావడంతో అడ్తిదారులు దోపిడీదందాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా లైన్ క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు ప్రతి అడ్తి దుకాణం నుంచి రూ. 2000 నుంచి రూ. 2500 వరకు మార్కెట్ సిబ్బందికి గతవారం రోజులుగా ముట్టచెప్తుతున్నట్లు ప్రచారం మొదలైంది. ఇప్పటికే రూ.లక్షకు పైగా మార్కెట్ సిబ్బందికి అడ్తిదారులు అందించినట్లు సమాచారం. ఉత్తర తెలంగాణలో రెండవ పెద్ద మార్కెట్‌గా జమ్మికుంట పత్తి మార్కెట్‌కు గుర్తింపు ఉంది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతోపాటు వివిధ ప్రాంతాల రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఈ మా ర్కెటే పెద్ద దిక్కు. అయితే మార్కెట్లో రైతులను దోచు కునేందుకు అడ్తిదారులు అడ్డదారులు తొక్కుతుంటారు. వీటిని అరికట్టేందుకు మార్కెట్ సిబ్బంది రైతుల పక్షాన నిలవాలి. కాని వారు మామూళ్లు వస్తుండడంతో అడ్తిదారుల దందాకు అండగా నిలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అడ్తిదారులు నాణ్యమైన పత్తికి సైతం భారీ తేడా లు పెట్టి కొనుగోలు చేస్తున్నా మార్కెట్ యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దోపిడీ తీరిది.. వ్యాపారులు నూటికి రూ.2 కమీషన్ వసూళ్లు చేస్తూనే అదనంగా ఇతర విధాలుగా రైతులను ముంచుతుంటారు. లూజ్ పత్తిని తరుగు పేరుతో 15 కిలోల నుంచి 30 కిలోల వరకు తూకాల్లో కోతలు పెడుతుంటారు. లూజ్ పత్తిని వేలంపాట కాకముందే వ్యాపారులతో ధర నిర్ణయించుకొని నేరుగా యార్డు నుంచి మిల్లులకు తరలిస్తుంటారు. పత్తి బస్తాల వద్ద వేలంపాట సమయంలో నెంబర్ పత్తికి పలికిన ధర కంటే మిగతా బస్తాలకు ఇక్కడా క్వింటాల్‌కు రూ.100 - 450 వరకు తేడాలతో అమ్మిస్తుంటారు. దీంతో రైతులు రూ. వేలల్లో నష్టపోతుంటారు. ఇలా రోజుకు రూ. 2,5లక్షల వరకు ధరల్లో వ్యత్యాసాలతోనే రైతులు నష్టపోతున్నట్లు అంచనా. వీటన్నింటిని మార్కెట్ సిబ్బంది అరికట్టాలి. రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. కాని వారి కనుసన్నుల్లోనే రైతులు దోపిడీకి గురవుతుండడంతో ఇక ఎవరికి చెప్పుకోవాలనే ప్రశ్న తలెత్తుతోంది. జమ్మికుంటలో 80 మంది అడ్తిదారులు ఉండగా.. రూ. 2లక్షల వరకు మార్కెట్లో సిబ్బందికి అప్పగించేందుకు టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. పాలకవర్గం మౌనం.. మామూళ్లు వసూళ్లు చేస్తున్నారనే విషయం పాలక వర్గానికి తెలిసినా మౌనంగా ఉంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నారు. కొందరు అడ్తిదారులు తామవి చిన్నదుకాణాలని, ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా కమీషన్ మాత్రమే తీసుకుంటున్నామని, అలాంటప్పుడు తాము ఎందుకు మామూళ్లు ఇవ్వాలని ప్రశ్నినట్లు సమాచారం. అక్రమాలకు పాల్పడేవారే ఇచ్చుకోవాలని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఉన్నతాధికారులు మామూళ్లపై లోతుగా విచారణ జరిపితే అసలు గుట్టు బహిర్గతమవుతుందని భావిస్తున్నారు. వసూళ్లు చేస్తే చర్యలు వ్యవసాయ మార్కెట్లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోవడం లేదు. మార్కెట్ సిబ్బంది అడ్తిదారుల వద్ద మామూళ్లు వసూళ్లు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. వసూళ్ల విషయంపై విచారణ చేస్తా.. నిజమని తెలితే చర్యలు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. - పింగిళి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఈ విషయంపై మార్కెట్ కార్యదర్శి వెంకట్‌రెడ్డిని ఫోన్ లో వివరణ కోరగా మామూళ్ల.. విషయం తనకు తెలియదని, తెలుసుకుంటానని సమాధానం ఇచ్చారు -
జమ్మిగుంట ప్రత్తిమార్కెట్లో ఘరానా మోసం
-
3 కేజీల బంగారం, 30 కేజీల వెండి స్వాధీనం
హైదరాబాద్: భారత పత్తి సంస్థ(సీసీఐ) బయ్యర్ల నివాసాలపై దేశవ్యాప్తంగా సీబీఐ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. రైతులకు కనీస మద్దతుధర చెల్లించకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బయ్యర్ల అక్రమాల నిగ్గుతేల్చాలన్న కోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, గుంటూరు, ముంబై, నాగపూర్ లో 27 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. 3 కేజీల బంగారం, 30 కేజీల వెండి, పలు కీలక పత్రాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పత్తికొనుగోలుదారులతో పాటు అధికారులను సీబీఐ ప్రశ్నిస్తోంది. -
అన్నదాతతో ఆడుకున్నారు...
జమ్మికుంట : జమ్మికుంట పత్తి మార్కెట్లో అధికారులు అన్నదాతతో ఆడుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పత్తిని అమ్ముకునేందుకు మార్కెట్ కొస్తే గాలికి వదిలేస్తున్నారు. సకాలంలోని ఇంటికెళ్లాల్సిన వారిని మార్కెట్లోనే జాగారం చేయూల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నారు. పొదం్దతా కొనుగోళ్ల కోసం ఎదురుచూసినా పత్తిబస్తాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో రైతుల కోపం కట్టలు తెంచుకుంది. దీంతో మార్కెట్‌ను ముట్టడించి లోనికి చొచ్చుకెళ్లడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు గొడవ జరగకుండా అడ్డుకున్నారు. జమ్మికుంట మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు సోమవారం నాలుగువేల బస్తాల్లో పత్తిని అమ్మకానికి తీసుకొచ్చారు. మూడువేల క్వింటాళ్ల లూజ్ పత్తి వచ్చింది. సీసీఐ అధికారులు మొదట లూజ్ పత్తిని కొనుగోలు చేశారు. ఎడ్లబండి కార్మికుల ఆందోళన మూడుగంటల అనంతరం సమస్య సద్దుమణిగింది. అయితే రైతులు తీసుకొచ్చిన పత్తి బస్తాలను కొనుగోలు చేసేందుకు అటు సీసీఐ అధికారులు, ఇటు వ్యాపారులు ముందుకురాలేదు. పొద్దంతా ఎదురుచూసిన రైతులు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఆగ్రహంతో మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో కార్యాలయంలో ఉన్న ఇన్చార్జి కార్యదర్శి అశోక్, సీసీఐ అధికారులు, అడ్తిదారులు బయటకు వచ్చి సీసీఐ పత్తిని కొనుగోళ్లు చేస్తుందని నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. ‘మాతో ఆడుకుంటున్నారా... పొద్దుగాల వస్తే ఇప్పటి వరకు ధరలు, కొనుగోళ్లు ఉండవా..’ అంటూ రైతులు ప్రశ్నించారు. రైతులు లోనికి ప్రవేశించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావారణం ఏర్పడింది. కరీంనగర్‌కు చెందిన ఏఆర్ పోలీసులు కార్యాలయానికి చేరుకుని రైతులను నిలువరించారు. తిండి ఠికానా లేకుండా యార్డులో ఎప్పటి వరకు ఉండాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మద్దతు ధరలతో ప్రతీ రైతు సరుకును కొంటామని సీసీఐ అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.అయితే అప్పటికే చీక టి పడడం, కార్మికులు వెళ్లిపోవడంతో రాత్రంతా రైతులు మార్కెట్లో జాగారం చేయూల్సి వచ్చింది. -
తుపాకీ నీడలో పత్తి కొనుగోళ్లు
సమ్మెలోకి ఎడ్ల బండ్లకార్మికులు తక్‌పట్టీలు ఇవ్వని అధికారులు జమ్మికుంట పత్తి మార్కెట్లో ఎడ్ల బండ్ల కార్మికుల సమ్మె పిలుపుతో కొనుగోళ్లలో అనిశ్చితి ఏర్పడింది. పత్తి కొనుగోళ్లను కార్మికులు అడ్డుకుంటారనే అనుమానంతో పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. కరీంనగర్ నుం చి ఏఆర్ పోలీసులను ఉదయమే మార్కెట్లో దించారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఇలాకాలో పత్తి కొనుగోళ్లకు ఆటంకాలు కలగకుండా తుపాకీ నీడలో మార్కెట్ పహారా కా శారు. ఉదయం 10 గంటలకు వివిధ ప్రాం తాల నుంచి రైతులు లూజ్ పత్తిని వాహనాల్లో మార్కెట్‌కు అమ్మకానికి తీసుకురాగా.. సీసీఐ 400 క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేసింది. క్విం టాల్‌కు రూ.4050, రూ. 3,969 ధరలు పెట్టా రు. ప్రైవేట్ వ్యాపారులు 275 క్వింటాళ్ల పత్తిని రూ.3,980 నుంచి 3880 వరకు కొనుగోళ్లు చే పట్టారు. అరగంటలో లూజ్ పత్తి అమ్మకాలు పూర్తి కాగా.. వాహనాలు సైతం మిల్లులకు తరలిపోయాయి. తుపాకీ నీడలో కొనుగోళ్లు షూరు కావడంతో మార్కెట్లో ఏం జరుగుతుందోననే రైతులు భయంతో గడిపారు. బస్తాల్లో వచ్చిన పత్తిని సీసీఐ కొనుగోళ్లు చేసినా తక్‌పట్టీలు ఇవ్వలేదు. దీంతో రైతులు ఏం చేయలో తోచక ఎదురుచూపులు చూస్తున్నారు.కొందరు ఆరుబయట నుంచే నేరుగా మిల్లుల్లోకి తీసుకెళ్లి అమ్ముకున్నారు. సమ్మె ప్రారంభం జమ్మికుంట పత్తి మార్కెట్లోకి లూజ్పత్తి వాహనాలు రావడంతో ఉపాధి కోల్పోతున్నామని మార్కెట్ అధికారులకు సమ్మె నోటీస్ ఇచ్చామని ఎడ్ల బండ్ల కార్మికులు తెలిపారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె సాగుతుందని కార్మికులు ప్రకటించారు. మొదటి రోజు కార్మికులు మార్కెట్ గేట్ వద్ద సమ్మె చేపట్టారు. వారు రవాణాకు దూరంగా ఉన్నారు. -
సీసీఐ ఎండీని కలిసిన టి.టీడీపీ నేతలు
న్యూఢిల్లీ: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఎండీ డీఏ మిశ్రాను శుక్రవారం తెలంగాణ టీడీపీ నాయకులు కలిశారు. తమ ప్రాంతంలో పత్తికి మద్దతు ధర చెల్లించడం లేదని మిశ్రా దృష్టికి తీసుకొచ్చారు. పత్తిలో 25 శాతం తేమ ఉన్నా రైతుల నుంచి కొనుగోలు చేయాలని కోరారు. సిబ్బంది కొరత కారణంగా సీసీఐ ఇప్పటివరకు 65 క్వింటాళ్ల పత్తి కోనుగోలు చేసిందని తెలిపారు. దీంతో పత్తి దళారులు రైతులను మోసం చేస్తున్నారన్న విషయాన్ని సీసీఐ ఎండీ దృష్టికి తీసుకోచ్చారు. వరంగల్, ఆదిలాబాద్, మార్కెట్లలో పర్యటించాలని మిశ్రాకు విజ్ఞప్తి చేశారు. -
తెల్లబంగారం మెరుస్తోంది
ఖమ్మం గాంధీచౌక్, జడ్చర్ల, జమ్మికుంట- న్యూస్‌లైన్: పత్తి కళకళలాడుతోంది. ఇప్పటి వరకు తుపాను నష్టాలతో నిరాశలో ఉన్న రైతుకు... పెరిగిన ధర ఊరటనిస్తోంది. దిగుబడి తగ్గినప్పటికీ ధర పెరగటంతో ఉపశమనం లభించినట్లయింది. ఏటా సీజన్ ముగిసేటపుడు ధర పెరగటం... అప్పటికే రైతులు తమ దగ్గరున్న పత్తిని అమ్మేయటం మామూలే. ఈసారి మాత్రం సీజన్లోనే పత్తి ధర బాగా పెరిగింది. ఖమ్మం మార్కెట్లో క్వింటాల్ పత్తి అత్యధికంగా రూ.5,200 పలికింది. త్వరలో ఇది రూ.6వేల వరకు చేరొచ్చనేది వ్యాపారుల అంచనా. డిసెంబర్ మొదటి వారం రూ.4,200లు ఉన్న ధర బుధవారం రూ.5,200లకు చేరటం గమనార్హం. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాదేపల్లి మార్కెట్లో కూడా పత్తి క్వింటాలుకు గరిష్టంగా రూ.5072, కనిష్టంగా రూ.4209 పలికింది. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడి పత్తి మార్కెట్‌కు ఐదువేల క్వింటాళ్ల పత్తి ఒకేరోజు విక్రయానికి రావడంతో ఆవరణమంతా బస్తాలతో నిండిపోయింది. ఇక్కడ ఇంత ధర రావటం ఈ సీజన్లో ఇదే తొలిసారి. ప్రభుత్వం పత్తికి గరిష్టంగా రూ.4000, కనిష్టంగా రూ.3800 మద్దతుధరలు నిర్ణయించడం గమనార్హం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో సైతం బుధవారం పత్తికి రికార్డు ధర పలికింది. క్వింటాల్‌కు రూ.5,090 పలకటం ఈ సీజన్లో ఇప్పటిదాకా లేదు. అంతర్జాతీయ మార్కెట్లో బేళ్లు, గింజలు, దారానికి డిమాండ్ వస్తుండడంతో ధర అధికంగా పలుకుతున్నట్లు వ్యాపారులు చెప్పారు. మూడు రోజులుగా క్వింటాల్‌కు రూ.5 వేల లోపు పలికిన ధరలు బుధవారం రూ.5 వేలు దాటడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో స్వీట్లు పంచారు కూడా. గింజలకూ డిమాండ్... పత్తి గింజలకున్న డిమాండ్ వల్లే ధర అమాంతం పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. పత్తిని జిన్నింగ్ మిల్స్ కొనుగోలు చేసి, పత్తి నుంచి గింజను వేరు చేస్తాయి. గింజల నుంచి ఆయిల్ తీస్తారు. దాణాలోనూ వీటిని వాడతారు. అందుకే వీటిక్కూడా డిమాండ్ బావుంది. గతంలో క్వింటా గింజల ధర రూ.1450 ఉండగా, ప్రస్తుతం రూ.1700 పలుకుతోంది. కాగా వాతావరణం అనూకూలించకపోవడం... అధిక వర్షాలు... పంటకు తెగుళ్లు వ్యాపించడం వంటి అనేక కారణాలతో ఈ ఏడాది పంట దిగుబడి తగ్గినట్లు వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల మధ్య దిగుబడి రావాల్సి ఉండగా.. ఈ ఏడాది కేవలం 4 నుంచి 6 క్వింటాళ్ల మధ్యనే వచ్చింది. -
కొనుగోళ్ల జాప్యంపై రైతుల ఆక్రోశం
సిద్దిపేట టౌన్,న్యూస్‌లైన్: పదిరోజుల కింద పత్తిమార్కెట్‌కు తీసుకొచ్చిన మక్కలను ఇంత వరకు మార్క్‌ఫెడ్ వారు కొనుగోలు చేయక పోవడంతో ఆగ్రహించిన రైతులు రెండుసార్లు రాస్తారొకో దిగారు. సిద్దిపేట పత్తి మార్కెట్లో ఓపెన్ ప్లాట్ ఫారాలపై పోసిన 11 కుప్పల మక్కజొన్నలను తేమ పరీక్షలు చేసి బాగున్నాయని మార్క్‌ఫెడ్ వారు ఎంపిక చేశారు. వర్షాలు కురువడం, ఐకేపీకి సమన్వయం లేకపోవడంతో ఇంత వరకు సరుకులను తరలించలేదు. ఆదివారం నుంచి వాతావరణం చక్కబడినప్పడికీ సరుకు తరలించకపోవడంతో సోమవారం ఉదయం రైతులు సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట రాస్తారోకో చేశారు. మార్కెట్ అధికారులు, పోలీసులు రెండు గంటల్లో సరుకులను తరలిస్తారని హామీ ఇవ్వడంతో రైతులు వెళ్లిపోయారు. నాలుగు గంటలైనా పరిస్థితి మారలేదు. దీంతోవారు సమీపంలోని రాజీవ్ రాహదారి చౌరస్తాపై రాస్తారోకోకు దిగారు. దీంతో కరీంనగర్, హైదరాబాద్, సిద్దిపేటవైపు వెళ్తున్న వందలాది వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. వర్షాలతో చెడిపోయిన మక్కలను, మొలక వచ్చిన కంకులను ప్రదర్శించి తమ గొడును వెళ్లబోసుకున్నారు. సీఎం కిరణ్ డౌన్...డౌన్, మక్కలను వెంటనే కొనాలి.. రైతు వ్యతిరేఖ ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు చేశారు. గంట సమయమైన రైతులు ఆందోళన వీడకపోవడంతో టూ టౌన్ ఎస్ఐ చిట్టిబాబు పోలీసులతో అక్కడికి చెరుకొని రాస్తారోకో విరమించాలని కోరారు. రైతు సంఘల సమాఖ్య నేతలకు, ఎస్ఐకి మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి అధికారులతో పోలీసులు మాట్లాడి నిలిచిపోయిన సరుకును వెంటనే తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో రైతు సంఘాల సమాఖ్య నేతలు పాకాల శ్రీహరి రావు, జిల్లా అధ్యక్షుడు హన్మంత రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏవీ రవీందర్‌రెడ్డి, నాయకులు రాంచందర్ రావు, రాంలింగా రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మయ్య, బాల్‌రెడ్డి, మోహన్ రెడ్డి, వెంకట్రాం రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కమలాకర్ రావు, భూపతి రెడ్డి, గడీల భైరవ రెడ్డి, పులి రంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.