ఇక రైతులది అరణ్యరోదనే?
Published Tue, Nov 15 2016 2:21 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
పత్తి మార్కెట్‌లో దోపిడీకి లైన్ క్లియర్?
మార్కెట్ సిబ్బందికి రూ.లక్షల్లో మామూళ్లు
ఒక్కో అడ్తిదుకాణానికి రూ.2500 వసూళ్లు
జమ్మికుంటలో దాదాపు 80 దుకాణాలు
జమ్మికుంట : అరుగాలం చెమటోడ్చి పత్తిని పండించిన రైతన్నల వేదన ఇక ఆరణ్య రోదనే కానుంది. మార్కెట్‌లో రైతులకు అండగా నిలవాల్సిన వారంతా మామూళ్లకు సిద్ధం కావడంతో అడ్తిదారులు దోపిడీదందాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా లైన్ క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు ప్రతి అడ్తి దుకాణం నుంచి రూ. 2000 నుంచి రూ. 2500 వరకు మార్కెట్ సిబ్బందికి గతవారం రోజులుగా ముట్టచెప్తుతున్నట్లు ప్రచారం మొదలైంది. ఇప్పటికే రూ.లక్షకు పైగా మార్కెట్ సిబ్బందికి అడ్తిదారులు అందించినట్లు సమాచారం. ఉత్తర తెలంగాణలో రెండవ పెద్ద మార్కెట్‌గా జమ్మికుంట పత్తి మార్కెట్‌కు గుర్తింపు ఉంది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతోపాటు వివిధ ప్రాంతాల రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఈ మా ర్కెటే పెద్ద దిక్కు. అయితే మార్కెట్‌లో రైతులను దోచు కునేందుకు అడ్తిదారులు అడ్డదారులు తొక్కుతుంటారు. వీటిని అరికట్టేందుకు మార్కెట్ సిబ్బంది రైతుల పక్షాన నిలవాలి. కాని వారు మామూళ్లు వస్తుండడంతో అడ్తిదారుల దందాకు అండగా నిలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అడ్తిదారులు నాణ్యమైన పత్తికి సైతం భారీ తేడా లు పెట్టి కొనుగోలు చేస్తున్నా మార్కెట్ యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
దోపిడీ తీరిది..
వ్యాపారులు నూటికి రూ.2 కమీషన్ వసూళ్లు చేస్తూనే అదనంగా ఇతర విధాలుగా రైతులను ముంచుతుంటారు. లూజ్ పత్తిని తరుగు పేరుతో 15 కిలోల నుంచి 30 కిలోల వరకు తూకాల్లో కోతలు పెడుతుంటారు. లూజ్ పత్తిని వేలంపాట కాకముందే వ్యాపారులతో ధర నిర్ణయించుకొని నేరుగా యార్డు నుంచి మిల్లులకు తరలిస్తుంటారు. పత్తి బస్తాల వద్ద వేలంపాట సమయంలో నెంబర్ పత్తికి పలికిన ధర కంటే మిగతా బస్తాలకు ఇక్కడా క్వింటాల్‌కు రూ.100 - 450 వరకు తేడాలతో అమ్మిస్తుంటారు. దీంతో రైతులు రూ. వేలల్లో నష్టపోతుంటారు. ఇలా రోజుకు రూ. 2,5లక్షల వరకు ధరల్లో వ్యత్యాసాలతోనే రైతులు నష్టపోతున్నట్లు అంచనా. వీటన్నింటిని మార్కెట్ సిబ్బంది అరికట్టాలి. రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. కాని వారి కనుసన్నుల్లోనే రైతులు దోపిడీకి గురవుతుండడంతో ఇక ఎవరికి చెప్పుకోవాలనే ప్రశ్న తలెత్తుతోంది. జమ్మికుంటలో 80 మంది అడ్తిదారులు ఉండగా.. రూ. 2లక్షల వరకు మార్కెట్‌లో సిబ్బందికి అప్పగించేందుకు టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం.
పాలకవర్గం మౌనం..
మామూళ్లు వసూళ్లు చేస్తున్నారనే విషయం పాలక వర్గానికి తెలిసినా మౌనంగా ఉంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నారు. కొందరు అడ్తిదారులు తామవి చిన్నదుకాణాలని, ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా కమీషన్ మాత్రమే తీసుకుంటున్నామని, అలాంటప్పుడు తాము ఎందుకు మామూళ్లు ఇవ్వాలని ప్రశ్నినట్లు సమాచారం. అక్రమాలకు పాల్పడేవారే ఇచ్చుకోవాలని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఉన్నతాధికారులు మామూళ్లపై లోతుగా విచారణ జరిపితే అసలు గుట్టు బహిర్గతమవుతుందని భావిస్తున్నారు.
వసూళ్లు చేస్తే చర్యలు
వ్యవసాయ మార్కెట్‌లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోవడం లేదు. మార్కెట్ సిబ్బంది అడ్తిదారుల వద్ద మామూళ్లు వసూళ్లు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. వసూళ్ల విషయంపై విచారణ చేస్తా.. నిజమని తెలితే చర్యలు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
- పింగిళి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్
ఈ విషయంపై మార్కెట్ కార్యదర్శి వెంకట్‌రెడ్డిని ఫోన్ లో వివరణ కోరగా మామూళ్ల.. విషయం తనకు తెలియదని, తెలుసుకుంటానని సమాధానం ఇచ్చారు
Advertisement
Advertisement