వరంగల్ సిటీ :
గత ఏడాది మిర్చి సాగు చేసిన రైతులు ధర కోసం పడిన ఇబ్బందులను మరువకముందే పత్తి రైతులు కూడా కనీస ధర కోసం అంతకంటే ఎక్కువ అవస్థలు పడే అవకాశం కనిపిస్తోంది. పత్తి రైతుల మెడపై వ్యాపారుల ధరల కత్తి వేలాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తోంది. రెండేళ్లుగా పత్తి సాగు చేయొద్దని వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో ప్రచారం చేయడంతో రైతులు మిర్చివైపు మొగ్గు చూపారు. దీంతో ప్రత్యామ్నాయంగా మిర్చి సాగు పెరగడంతో మార్కెట్‌లో ధర అమాంతం పడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది పెద్ద ఎత్తున పత్తి సాగుచేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ సంవత్సరం ఉమ్మడి జిల్లాలో 46 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేసినట్లు, 28 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి రానున్నట్లు ఇప్పటికే మార్కెటింగ్ శాఖ ఓ అంచనాకు వచ్చింది.
‘మద్దతు’ను మించిన ధర
20 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల ఎకరాలకు మించి పత్తిని సాగుచేసిన దాఖలాలు లేవు. అలాగే 2011–12 సంవత్సరంలో అత్యధికంగా 19 లక్షల క్విటాళ్లకుపైగా పత్తి వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకానికి వచ్చింది. ఇప్పటి వరకు అదే రికార్డు. ఇక 2015–16 సంవత్సరంలో 14,76,585 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. ఆ ఏడాది కనీస మద్దతు ధర రూ.4,050 ఉండగా క్వింటాల్‌కు అత్యధికంగా రూ.6,700 ధర పలకడంతో సీసీఐ కొనుగోళ్లను చేపట్టలేదు. అలాగే 2016–17 సంవత్సరంలో 16,99,140 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా ధర గరిష్టంగా రూ.5,810 పలికింది. ఆ ఏడాది కనీస మద్దతు ధర రూ.4,160 మాత్రమే ఉండడంతో సీసీఐ మళ్లీ కొనుగోళ్లకు రాలేదు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేసినట్లు, ఒక వరంగల్ మార్కెట్‌కే దాదాపుగా 23 లక్షల క్విటాళ్లకుపైగా పత్తి అమ్మకానికి రానున్నట్లు అంచనాలు ఉన్నాయి.
ఆదిలోనే హంసపాదు..
గత వారం రోజులుగా వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు రో జుకు 50 బస్తాల వరకు కొత్త పత్తి అమ్మకానికి వస్తోంది. ధర మాత్రం రూ.3,300లోపే పలుకుతోంది. ప్రస్తుతం మార్కె ట్లో పాత పత్తికి రూ.5,100 ధర చెల్లిస్తున్నారు. కాగా ఈ సం వత్సరం పత్తికి కనీస మద్దతు ధరను రూ.4160కు మరో రూ.160 కలిపి రూ.4,320గా నిర్ణయించారు. ప్రస్తుతం కొత్త పత్తికి ధర రూ.3,300 మాత్రమే పలుకుతుండడంతో సీసీఐ రంగప్రవేశం తప్పనిసరి అని తేటతెల్లమవుతోంది.
వ్యాపారుల ప్రతిజ్ఞ..
కాగా ఈ సారి పత్తి రాష్ట్రవ్యాప్తంగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, జిల్లాల్లో పెద్ద ఎత్తున సాగుబడి అయినందున, మార్కెట్‌కు భారీగా పత్తి అమ్మకానికి వస్తుందని, తేమ ఉన్న పత్తిని ఎవరు కూడా ముందుపడి కొనవద్దని, చేతనైనంత పత్తి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉండే అవకాశం ఉన్నందున అంతా ఏకతాటిపై ఉండి గత సంవత్సరం అంతగా రాని లాభాలను ఈ సారి దక్కించుకోవాలని పత్తి ఖరీదుదారులు గత వారం రోజుల క్రితమే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోని ప్రతిజ్ఞ చేసినట్లు తెలిసింది. అంతేగాక సీజన్ ప్రారంభమైతే ఏప్రిల్ వరకు తీరిక ఉండదనే ఉద్దేశంతో వ్యాపారులంతా కేరళ టూర్‌కు వెళ్లినట్లు సమాచారం.
15న జౌళిశాఖ కార్యదర్శి రాక
అన్ని మార్కెట్‌లలో కార్యదర్శులంతా పత్తి కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలని, సీసీఐ రంగప్రవేశం చేయడానికి సాఫ్ట్‌వేర్‌తో సహ, తేమను కొలిచే మిషన్లు, వేబ్రిడ్జీలు, అవసరం మేరకు సిబ్బందిని సిద్ధం చేసి ఉంచాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు ఇప్పటికే పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్‌ల్లో ఆదేశించారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అన్ని మార్కెట్లల్లో సీసీఐ కొనుగోళ్లు కేంద్రాలను ఆయా ఎమ్మెల్యేల చేత ప్రారంభించి కొనుగోళ్లను చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 15న జౌళిశాఖ కార్యదర్శి అనంతకుమార్‌సింగ్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి, సీసీఐ కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయనున్నట్లు కూడా ఆదేశాలు అందినట్లు మార్కెటింగ్ శాఖ తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా 143 సెంటర్లు..
ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా 143 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మార్కెటింగ్ శాఖ తెలిపింది. ఇది గతంలో ఉన్న 92 సెంటర్లకు 51 సెంటర్లు అదనం. ఏనుమాముల మార్కెట్ రెండు సీసీఐ కేంద్రాలతోపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరో 12 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాక రైతులు మార్కెట్ల వరకు రాకుండా సమీపంలోని జిన్నింగ్ మిల్లుల వద్ద కూడా పత్తిని కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ మద్దతు ధర రూ.4320కి పడిపోకుండా చూడాలని తగిన ఆదేశాలు అందినట్లు కూడా మార్కెటింగ్ అధికారులు, చైర్మన్లు తెలిపారు.
కొత్త విపత్తి
Published Mon, Sep 25 2017 11:50 AM | Last Updated on Mon, Oct 1 2018 2:16 PM
Advertisement
Advertisement