
బ్లూటూత్‌తోనే తూకం లెక్క..!
► పత్తి మార్కెట్‌లో హ్యాండ్‌యంత్రాలను ప్రారంభించిన చైర్మన్ రమేశ్
జమ్మికుంట : జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో నామ్ అమలులో భాగంగా ఆన్ లైన్ విధానం అమలు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను ఎంట్రీ గేట్ వద్దే ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారు. తాజాగా ఎలక్ట్రానిక్ తూకాల్లోనూ మార్పులు చేస్తున్నారు. రైతులు బస్తాల్లో తెచ్చిన ఉత్పత్తులను బ్లూటూత్ ద్వారా తూకం వేసి రషీదు ఇచ్చేలా నూతన యాత్రాలను ప్రవేశపెట్టారు. బ్లూటూత్ అనుసంధానంతో ఉన్న ఎలాక్ట్రానిక్ కాంటాలు ఏడింటిని మార్కెట్ కార్యదర్శి వెంకట్‌రెడ్డి, కమిటీ చైర్మన్ పింగిళి రమేశ్‌తో కలిసి ప్రారంభించారు.
రైతులు బస్తాల్లో తీసుకొచ్చిన పత్తిని తూకం వేసి మొత్తం బస్తాలకు సంబంధించిన లెక్కతో రైతులకు రషీదు ఇస్తామని చైర్మన్ రమేశ్ తెలిపారు. దీని ద్వారా తూకాల్లో ఎలాంటి తేడాలు రావని పేర్కొన్నారు. వైస్‌చైర్మన్ ఎర్రబెళ్లి రాజేశ్వర్‌రావు, వ్యాపారులు నగునూరి రవీందర్, దొడ్డ శ్యామ్, దేసు రవీందర్, ముక్కా నారాయణ, లింగారావు, స్వామి, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.