పత్తి రైతు చిత్తు! | collector sudden audits in Jammikunta market | Sakshi
Sakshi News home page

పత్తి రైతు చిత్తు!

Published Sat, Oct 17 2015 1:41 AM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM

పత్తి రైతు చిత్తు!

పత్తి రైతు చిత్తు!

నిండా ముంచుతున్న వ్యాపారులు, దళారులు
ఇష్టారీతిన ధర నిర్ణయం.. ట్రాక్టర్ పత్తిలో 40 కిలోలు కోత
మార్కెట్ కాంటాతో పనిలేకుండా సొంతంగా తూకం
నూటికి రూపాయిన్నర అదనపు కమీషన్
సాక్షి కథనాలతో స్పందించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్
జమ్మికుంట మార్కెట్‌లో ఆకస్మిక తనిఖీ
అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిక

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ /జమ్మికుంట: వర్షాభావం నుంచి ఎరువుల కొరత దాకా ఎన్నో ఎదురుదెబ్బల్ని తట్టుకున్న రైతన్న... చివరకు వ్యాపారులు, దళారుల చేతిలో చిత్తయిపోతున్నాడు.

అంతో ఇంతో వచ్చిన దిగుబడిని అమ్ముకుందామని మార్కెట్ కేంద్రాలకు వెళితే.. అడుగడుగునా దోపిడీకి గురవుతున్నాడు. తూకం మొదలు కమీషన్ వరకు, మద్దతు ధర మొదలు తరుగు వరకు.. వ్యాపారుల మాయాజాలంలో నిండా మునిగిపోతున్నాడు. మార్కెటింగ్ శాఖ అధికారులే ఈ మోసానికి సహకరిస్తున్నారు. ఈ బాగోతంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనాలపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ స్పందించారు. శుక్రవారం జమ్మికుంట పత్తి మార్కెట్‌లో ఆకస్మిక తనిఖీ చేశారు. మోసాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
 
దళారులకు అప్పగించేశారు!
కరీంనగర్ జిల్లాలో 11 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లను చేపట్టాల్సి ఉన్నా... ఇప్పటివరకు కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, హుస్నాబాద్ మార్కెట్లలోనే ప్రారంభించారు. ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించినట్లు తెలియగానే రైతులు ఆరు రోజులుగా రోజూ దాదాపు 10 వేల క్వింటాళ్ల పత్తిని మార్కెట్లకు తీసుకొస్తున్నారు. కానీ సీసీఐ అధికారులు ఏదో ఒక సాకు చెబుతూ కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు విధిలేక వ్యాపారులు, మిల్లర్లకు  అమ్ముకోవాల్సి వస్తోంది.
 
నిండా మోసం..: నిబంధనల ప్రకారం మార్కెట్ కార్యాలయాల్లోని వేబ్రిడ్జ్‌ల వద్దే తూకం వేయాలి. పత్తి తేమ శాతం, నాణ్యత, ధర నిర్ధారణ విషయంలో మార్కెటింగ్ శాఖ మార్గదర్శకాలను అనుసరించాలి. ఎంత తూకం వేస్తే అంత బరువుకు ధర చెల్లించాలే తప్ప బరువులో కోత విధించడానికి వీల్లేదు. అలాగే 2 శాతం కమీషన్ మాత్రమే తీసుకోవాలి.కానీ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్‌లో ఇవేవీ అమలుకావడం లేదు. మార్కెట్‌లో వేబ్రిడ్జ్ ఉన్నా... వ్యాపారులు అక్కడ తూకం వేయనీయడం లేదు. తమకు అనుకూలమైన కాటన్ మిల్లుల వద్ద తప్పుడు తూకం వేస్తూ దోపిడీ చేస్తున్నారు.

దీనికితోడు ట్రాక్టర్‌లో పత్తిని తెస్తే 40 కిలోలు, ట్రాలీలో తెస్తే 20 కిలోల చొప్పున కోత విధిస్తూ మిగతా బరువుకు మాత్రమే సొమ్ము చెల్లిస్తున్నారు. ఇక 2 శాతం కమీషన్‌కు అదనంగా ‘క్యాష్ కటింగ్’ పేరిట ప్రతి రూ.వందకు మరో రూపాయిన్నర  మినహాయించుకుంటున్నారు. ఇలా రూ.లక్షకు రూ.1,500, ప్రతి ట్రాక్టర్‌కు 40 కిలోల  పత్తి కోతతో మరో రూ.1,600 రైతు నష్టపోతున్నాడు. తప్పుడు తూకం, తక్కువ ధర తో నిండా మునిగిపోతున్నాడు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. కరీంనగర్ జిల్లాలో గత ఆరు రోజులుగా రూ.20 కోట్లకుపైగా పత్తి వ్యాపారం జరగగా.. అందులో రైతులు రూ.5 కోట్లదాకా నష్టపోయినట్లు తెలుస్తోంది.
 
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..
పత్తి కొనుగోళ్లలో మోసాలపై ‘సాక్షి’లో రెండు రోజుల పాటు వరుస కథనాలు రావడంతో.. కరీంనగర్ జిల్లా పాలనా యంత్రాంగంలో కదలిక వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఆకస్మికంగా జమ్మికుంట మార్కెట్‌ను తనిఖీ చేశారు. మార్కెటింగ్ శాఖ ఏడీ ప్రకాష్, తహసీల్దార్ రజనితో కలిసి రైతుల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులంతా మూకుమ్మడిగా తమ బాధను వెళ్లగక్కారు. ‘‘మేం తెచ్చిన పత్తిని సీసీఐ అధికారులు కొనుగోలు చేయడం లేదు.

వ్యాపారులు ఇష్టారీతిన ధర నిర్ణయిస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. రూ.2,500 నుండి రూ.3,750 దాకా మాత్రమే ఇస్తున్నారు తప్ప ఒక్కరికి కూడా సీసీఐ నిర్ణయించిన ధర చెల్లించడం లేదు. పైగా ట్రాక్టర్‌కు 40 కిలోల చొప్పున కోత విధిస్తున్నారు. మార్కెట్ వేబ్రిడ్జ్‌పై కాకుండా సొంత కాంటాలపై తూకం వేస్తున్నారు. కాస్ట్ కటింగ్ పేరిట రూ.వందకు రూపాయిన్నర చొప్పున మినహాయించుకుంటున్నారు. మీరేమో ఆత్మహత్య చేసుకోవద్దు. ధైర్యంగా ఉండండని చెబుతున్నారు. అసలే కాలంలేక బాధపడుతున్నం.

ఇక్కడికొస్తే అడ్తిదారులు, వ్యాపారుల దోపిడీతో చస్తున్నాం. ఇట్లయితే మేం బతికేదెట్లా..?’’అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ నీతూప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ‘‘కాస్ట్ కటింగ్, సొంతంగా తూకం వేసుకోవడం, ట్రాక్టర్‌కు 40 కిలోల చొప్పున పత్తిని మినహాయించుకోవడం వంటివి నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఇకపై అలా జరిగితే లెసైన్సు రద్దు చేస్తాం. క్రిమినల్ కేసు పెడతాం. గతంలో ఇక్కడ సీబీఐ దాడులు చేసి విచారణ జరుపుతున్న విషయాన్ని మర్చిపోవద్దు..’’ అని వ్యాపారులను హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement