ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ‘అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి’ అన్న చందంగా తయారైంది పత్తి రైతుల పరిస్థితి. తేమ శాతం తక్కువగా ఉన్నా ఎక్కువగా చూపాలంటూ.. వ్యాపారులు తాము నిర్ణయించిన ధరనే చెల్లిస్తున్నారు. నాణ్యమైన పత్తిలో తేమ శాతం 3, 4, 5, 6 వచ్చినా 8 నుంచి పది శాతం చూపాలని వ్యాపారుల గుమస్తాలు రైతులకు సూచిస్తున్నారు. తేమ శాతం తక్కువగా ఉంటే జిన్నింగ్ మిల్లు యజమానులు కొనుగోలు చేయడం లేదని, తిప్పి పంపిస్తారని చెబుతూ రశీదులో తేమ శాతం ఎక్కువగా నమో చేయించుకునేలా రైతులను బెదిరిస్తున్నారు. వారి మాటలు నమ్మి రైతులు తేమ శాతం ఎక్కువగా రాయించుకుని నష్టపోతున్నారు.
నిబంధనల ప్రకారం పత్తిలో తేమ శాతం తక్కువగా ఉంటే ఆ రోజు ఉన్న ధరలో ఒక శాతం మొత్తాన్ని అదనంగా రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. అదే తేమ శాత ఎక్కువగా ఉంటే ధరలో ఆ మేరకు కోత విధిస్తుండడం తెలిసిందే. కానీ ఈ నిబంధనలు అమలు కావడం లేదు. దళారులు, మార్కెట్ గ్రేడర్లు కుమ్మక్కై రైతులతో తేమ శాతం ఎక్కువగా రాయిస్తూ.. ఒక శాతానికి రూ.42 చొప్పున క్వింటాల్‌కు రూ.84 నుంచి 168 వరకు నష్టపరుస్తున్నారు. ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో బుధవారం నాటి ధర ప్రకారం నాలుగు నుంచి ఎనిమిది శాతం తేమ వస్తే క్వింటాల్‌కు రూ.4,794 నుంచి రూ.4,962 వరకు చెల్లించాల్సి ఉంది.
కానీ 8 నుంచి 12శాతం తేమ ఉంటే క్వింటాల్‌కు రూ.4,610 చెల్లిస్తూ.. ఎక్కువగా తేమ శాతం ఉంటే పత్తి తీసుకుంటామని కొన్ని జిన్నింగ్ మిల్లుల యజమానులు తిరకాసు పెట్టారు. చేసేదేమీ లేక రైతులు రశీదుపై తేమ శాతం అధికంగా రాయించుకుని పత్తి విక్రయించి నష్టపోయారు. ప్రారంభంలో పత్తిలో తేమ శాతం అధికంగా ఉందంటూ ధరలో కోత విధించిన వ్యాపారులు తేమ శాతం తక్కువగా ఉంటే ఆ మేరకు ఎక్కువ ధర ఎందుకు చెల్లించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.
పత్తి నిల్వ ఉంచితే సాగు కోసం చేసిన అప్పులపై వడ్డీ పెరుగుతుందనే ఆందోళనతో తప్పనిసరి పరిస్థితుల్లో మార్కెట్లో విక్రయిస్తున్నారు. కాగా, తేమ విషయమై ఆదిలాబాద్ మార్కెట్ యార్డు కార్యదర్శి రాజేశ్వర్‌ను సంప్రదించగా.. నాణ్యమై పత్తి తీసుకొస్తే మద్దతు ధర లభిస్తుందని, దళారులు, గ్రేడర్లు తేమ శాతం అధికంగా చూపించి కొనుగోలు చేస్తున్న విషయం తమ దృష్టికి రాలేదని, వస్తే చర్యలు తీసుకుంటామని పాత పాటే వినిపించారు.
అదే దగా..తేమ తిర‘కాసు’..
Published Thu, Feb 20 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM
Advertisement
Advertisement