పత్తి కొనుగోళ్లలో జమ్మికుంట టాప్
-
ముగిసిన ఖరీఫ్ కొనుగోళ్లు
-
4.65 లక్షల క్వింటాళ్ల క్రయవిక్రయాలు
-
రెండోస్థానంలో పెద్దపల్లి..
జమ్మికుంట : ఉత్తర తెలంగాణ జిల్లాలో అతిపెద్ద రెండో వ్యవసాయ పత్తిమార్కెట్ జమ్మికుంట ఖరీఫ్ కొనుగోళ్లలో టాప్‌గా నిలిచింది. జిల్లాలోని పదది మార్కెట్లో జరిగిన పత్తి కొనుగోళ్లలో జమ్మికుంటనే ఆగ్రగామిగా మార్కెటింగ్ శాఖ లెక్కల్లో నమోదైంది. గతేడాది అక్టోబర్ 1నుంచి ఈ నెల 16వరకు జరిగిన పత్తి కొనుగోళ్లలో వ్యవసాయ మార్కెట్‌లో 4లక్షల 65వేల క్వింటాళ్ల పత్తికొనుగోళ్లు జరిగాయి. ప్రయివేట్ వ్యాపారులు రైతులవద్ద 4.28 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేయగా.. సీసీఐ 36,497 క్వింటాళ్లనే కొన్నది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ పత్తి కొనుగోళ్లలో రెండో స్థానంలో నిలిచింది. ప్రయివేట్ వ్యాపారులు లక్షా 37వేల 581 క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేయగా.. సీసీఐ 37,440 క్వింటాళ్లను రైతుల వద్ద సేకరించింది. మూడో స్థానం కరీంనగర్ మార్కెట్‌కు దక్కింది. ప్రయివేట్ వ్యాపారులు 55,751 క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేయగా.. సీసీఐ 32,417 క్వింటాళ్ల పత్తిని రైతుల వద్ద వ్యాపారం జరిగింది. సీసీఐ సంస్థ మాత్రం సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్‌లో ఎక్కువ పత్తిని కొనుగోళ్లు చేసి టాప్‌లో నిలిచింది. రెండోస్థానంలో హుస్నాబాద్ మార్కెట్ దక్కించుకుంది. ఇక్కడా 43,755 క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. జిల్లావ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్‌లో ప్రయివేట్ వ్యాపారులు 6. 44లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేయగా.. సీసీఐ 2లక్షల 29,789 క్వింటాళ్ల పత్తిని సేకరించారు. జిల్లాలో ఎక్కడా పత్తి ఉత్పత్తులు అమ్మకాలకు రాకపోవడంతో మార్కెట్ యార్డులన్నీ బోసిపోతున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్‌లో సాగుచేసిన పత్తి రైతుల చేతికి దిగుబడులు వచ్చిన తర్వాతే మళ్లీ మార్కెట్లు రైతులతో కళకళలాడనున్నాయి.