దోపిడీ మెుదలైంది..
-
తక్కువ ధరలకే పత్తి కొనుగోళ్లు
-
విలవిలాడిన రైతులు
-
కనీస మద్దతు కరువు
-
జమ్మికుంట మార్కెట్‌లో దందా షురూ..!
జమ్మికుంట : జమ్మికుంట వ్యవసాయ పత్తిమార్కెట్‌లో ఆదిలోనే పత్తి రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పత్తిని తీసుకొస్తే కొందరు వ్యాపారులు, అడ్తీదారులు కుమ్మక్కుతో మునుగుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పండుగ ముందు చేతిఖర్చుల కోసం చేతికి వచ్చిన కొత్త పత్తిని అమ్ముకునేందుకు వస్తే కనీస మద్దతు ధర చెల్లించడంలేదంటున్నారు. తేమ,కాయసాకుతో సరైన ధరలు చెల్లించలేదు. పత్తి మద్దతు ధరను ప్రభుత్వం రూ.4,100 నుంచి రూ.4,160 ప్రకటించారు. ఈ సీజన్‌లో రైతులకు కేంద్రం రూ.60 మాత్రమే పత్తికి ధర పెంచింది. ఇలాంటి పరిస్థితిలో జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌కు సోమవారం వివిధప్రాంతాల నుంచి రైతులు ఖరీఫ్‌లో సాగుచేసిన దాదాపు వెయ్యి బస్తాల్లో కొత్త పత్తిని అమ్మకానికి తీసుకొచ్చారు. ఉదయం 10 గంటల సమయంలో బీటైప్ వ్యాపారులు యార్డులో తిరుగుతూ ఉత్పత్తులను పరిశీలించారు. నాణ్యత పేరుతో కనీస ధరలు చెల్లించలేదు. మంచి ధర వస్తుందని ఆశపడ్డ రైతులకు వ్యాపారులు పెట్టిన ధరను చూసి బిత్తరపోయారు. పత్తిలో నాణ్యత లేదని, అంతా తేమ, కాయనే ఉంటే ఎలా కొనేదంటూ కొందరు దబాయించారు. క్వింటాల్ పత్తికి రూ.2000 నుంచి 4600 వరకు చెల్లించారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఎక్కువమంది రైతులకు క్వింటాల్‌కు రూ.3వేల నుంచి 3800 లోపే ధరలు లభించింది.
జాడలేని నామ్
ఈ సీజన్ నుంచి జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం అమల్లోకి తీసుకొస్తున్నామని ప్రచారం చేసిన మార్కెటింగ్ శాఖ ఆదిలోనే నామ్‌కే వాస్త్‌గా మారింది. జమ్మికుంట మార్కెట్‌కు వెయ్యి బస్తాల్లో పత్తి ఉత్పత్తులు వస్తే కేవలం గేట్ ఎంట్రీతోనే సరిపుచ్చుకున్నారు. ఆన్‌లైన్ కొనుగోళ్లతో పోటీ ఏర్పడి మంచిధర వస్తుందని ఆశపడ్డ పత్తి రైతులకు నిరాశనే మిగిలింది. మార్కెట్‌లో బీటైప్ వ్యాపారులు కనీసం వేలంపాడకుండా పత్తిని కొనుగోళ్లు చేసి ధరల్లో నిండా ముంచారు. నామ్ కొనుగోళ్లు ఈసారి కేవలం గేట్ ఎంట్రీ, గ్రేడింగ్‌తోనే కొనసాగుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ సీజన్‌లో స్థానిక వ్యాపారులతోనే కొనుగోళ్లు జరుగుతాయని వివరిస్తున్నారు.
గీదేం ధరలు
–బచ్చయ్య, మోత్కులగూడెం
జమ్మికుంట మార్కెట్‌కు కొత్త పత్తిని అమ్మకానికి తీసుకవచ్చిన. సేట్లు బస్తాల్లో తీసుకవచ్చిన పత్తిని చూసి మొదలు ధరనే చెప్పలే. చివరకు కింటాల్ పత్తికి రూ. 3200 ధరలే రైతులకు చెల్లించారు. కొత్త పత్తిలో తేమ, కాయ ఉందంటూ ముక్కువిరుస్తూ కొన్నరు. గిప్పుడే గీట్ల జేస్తే రైతులకు ఏలా పెట్టుబడులు వచ్చేది. మద్దతు ధరైనా దక్కలే...