మార్క్‌ఫెడ్ తీరే వేరు..!
జమ్మికుంట:
జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లారెడ్డికి మార్క్‌ఫెడ్ షాక్ ఇచ్చింది. ఆయనకున్న మూడెకరాల భూమిలో మక్క పంట సాగు చేశాడు. చేతికి వచ్చిన మక్కలను అమ్ముకునేందుకు సోమవారం జమ్మికుంట మార్కెట్‌కు వచ్చాడు. మంగళవారం మార్కెట్లో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా ప్రారంభిస్తుండటంతో.. అధికారులు మల్లారెడ్డి తీసుకవచ్చిన మక్కలు నాణ్యతగా ఉన్నాయని గుర్తించి మంత్రి చేతుల మీదుగా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
మక్కలను ఎలాక్ట్రానిక్ కాంటా ద్వారా తూకం వేసి కొనుగోళ్లు ప్రారంభించారు. తనతోనే మక్కల కొనుగోలు ప్రారంభించడంతో మల్లారెడ్డి ఎంతో సంతోషించాడు. సర్కారు మద్దతు ధర రూ.1310 పలుకుతుందని ఆశపడ్డాడు. తీరా మంత్రి మార్కెట్ నుంచి గేటు దాటాడో లేదో.. అధికారులు సరుకులో నాణ్యత లేదని, తూకం వేసిన బస్తాను కుప్పలో పోసేశారు. అధికారుల తీరుతో మల్లారెడ్డి బిత్తరపోయాడు. 140 బస్తాల మక్కలు తీసుకవస్తే కేవలం ప్రారంభోత్సవానికే తన సరుకును ఉపయోగించి మోసం చేశారని మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో ‘సాక్షి’తో వాపోయాడు.
పొద్దంతా సరుకు బాగుందని పొగిడిన అధికారులు.. మంత్రి వెళ్లాక బాగా లేదని కొనుగోలు చేయలేదని అవేదన చెందాడు. దీంతో అతడు రాత్రంతా మక్కల వద్దనే పడిగాపులు కాశాడు. బుధవారం మక్కలను శుద్ధి చేసిన తర్వాత మద్దతు ధరకు కొనుగోలు చేశారు. కానీ.. వాటిని తరలించకపోవడంతో రాత్రి కూడా మక్కలకు కాపలా కాస్తూ అక్కడే ఉన్నాడు.
మార్క్‌ఫెడ్ కేంద్రంలో మద్దతు ధర లభిస్తుందని కలలుగన్న తమకు నిరాశే మిగులుతోందని పలువురు రైతులు వాపోయారు. బుధవారం వివిధ ప్రాంతాల రైతులు రెండు వేల క్వింటాళ్ల మక్కలు తీసుకురాగా.. మార్క్‌ఫెడ్ అధికారులు 800 క్వింటాళ్లు మద్దతు ధరకు కొనుగోలు చేశారు. నాణ్యత సాకుతో మార్క్‌ఫెడ్ తిరస్కరించిన మక్కలను ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.గరిష్టంగా రూ.1078, కనిష్టంగా రూ.1067 చెల్లించి కొన్నారు. ఆరంభంలోనే మార్క్‌ఫెడ్ కొర్రీలు పెడుతుండటంతో మున్ముందు ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.