పత్తి రైతుల ఆక్రందన పట్టదా?
♦ యార్డులకు వచ్చిన పత్తిలో సీసీఐ కొనుగోలు చేసినది 15.96 శాతమే
♦ కనీస ధర మించకుండా సిండికేట్ అయిన ప్రైవేటు వ్యాపారులు
♦ నిబంధనల సాకుతో సహకరిస్తున్న సీసీఐ అధికారులు
♦ పొరుగు రాష్ట్రాల్లో భారీగా పలుకుతున్న పత్తి
♦ అక్కడికి తరలించి అమ్ముకుంటున్న వ్యాపారులు
♦ రాష్ట్రంలో ‘మద్దతు’ దక్కక నిండా మునుగుతున్న రైతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి రైతు ఆక్రందన ఎవరికీ పట్టడం లేదు.. విత్తనాల దగ్గరి నుంచి వర్షాభావం దాకా ఎన్నో కష్టనష్టాల కోర్చి పండించిన పత్తి చివరికి వ్యాపారుల పాలవుతోంది.. రైతన్న నిలువునా దోపిడీకి గురవుతున్నాడు.. పత్తి రైతుకు మద్దతు ధర కల్పించాల్సిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిబంధనలను సాకుగా చూపుతూ కొనుగోలు చేయడం లేదు. ఇప్పటి వరకు మార్కెట్ యార్డులకు వచ్చిన పత్తిలో సీసీఐ కొనుగోలు చేసింది 15.96 శాతం మాత్రమే. దీంతో వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లు, కూలీలకు తక్షణమే చెల్లింపులు జరపాల్సిన పరిస్థితిలో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అయినకాడికి అమ్ముకుంటున్నారు. మరోవైపు ఇదే అదునుగా తక్కువ ధరకు భారీగా పత్తిని కొనుగోలు చేస్తున్న వ్యాపారులు పొరుగు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
తొలి నుంచీ నిర్లక్ష్యమే
రాష్ట్రంలో ఈ ఏడాది 16.76 లక్షల హెక్టార్లలో పత్తిసాగు చేయగా.. 284 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. పత్తి మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.4,100గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం సేకరణ బాధ్యత సీసీఐకి అప్పగించింది. రాష్ట్రంలో గత ఏడాది 83 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన సీసీఐ.. ఈ ఏడాది 84 కేంద్రాల ఏర్పాటుకు అంగీకరించింది. అక్టోబర్ 20వ తేదీ నాటికే వీటిని ప్రారంభించాల్సి ఉండగా... ఇప్పటివరకు 67 కేంద్రాలనే తెరిచారు. వీటిలోనూ 41 కేంద్రాల్లోనే పత్తి కొనుగోళ్లు కొంత చురుగ్గా సాగుతున్నట్లు మార్కెటింగ్ శాఖ చెబుతోంది. అసలు ఇప్పటివరకు సీసీఐ 1.82 ల క్షల క్వింటాళ్ల పత్తిని (యార్డులకు వచ్చిన దానిలో 15.96 శాతం) మాత్రమే కొనుగోలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
నిబంధనల పేరిట మడతపేచీ
పత్తికి కనీస మద్దతు ధర మొదలుకుని తేమ శాతం వరకు అడ్డగోలు సాకులు చూపుతుండడంతో సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలకు రైతులు ఆసక్తి చూపడం లేదు. తేమ శాతం 12కు మించకూడదని, ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 40 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ వర్గాలు తెగేసి చెబుతున్నాయి. అయితే క్వింటాల్ పత్తికి రూ. ఐదు వేలు మద్దతు ధర చెల్లించాలని, తేమ శాతాన్ని 20కి పెంచాలని, రైతుల నుంచి 40 క్వింటాళ్లకు మించి కొనుగోలు చేయాలని మంత్రి హరీశ్‌రావు కేంద్ర టెక్స్‌టైల్ శాఖ మంత్రి సంతోష్ కుమార్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్రం.. పరిమితిపై ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు, జిన్నింగు మిల్లుల వద్ద కూడా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. కానీ తేమ శాతం సడలించడం, మద్దతు ధర పెంచడం అసాధ్యమని సీసీఐ వర్గాలు తెగేసి చెప్తున్నాయి.
ప్రైవేటు వ్యాపారులదే జోరు
సీసీఐ వైఖరితో విసిగిపోయిన ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వారు గ్రామాల్లో నేరుగా రైతుల నుంచి క్వింటాల్‌కు రూ. 3,600 నుంచి రూ. 3,700 వరకు చెల్లిస్తున్నారు. డబ్బు చెల్లింపుపై వారం నుంచి నెల దాకా వాయిదాకు అంగీకరిస్తే రూ. 3,900 వరకు లెక్కగడుతున్నారు. ఇక యార్డుల్లో సగటున క్వింటాల్ పత్తి ధర రూ.3,950 నుంచి రూ.3,970 లోపే పలుకుతోంది. క్వింటాల్ ధర రూ. 4 వేలు మించకుండా ప్రైవేటు వ్యాపారులు సిండికేట్‌లా వ్యవహరిస్తున్నారని... వారితో సీసీఐ అధికారులు కుమ్మక్కై మద్దతు ధర దక్కకుండా చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు తెల్లదోమ మూలంగా మహారాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాల్లో పత్తి పంట దెబ్బతినడంతో అక్కడి జిన్నింగు మిల్లులు రాష్ట్రంపై దృష్టి సారించాయి. ఇక పత్తి విత్తనాలకు కూడా మంచి ధర పలుకుతుండటంతో ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు వేగవంతం చేశారు. గుజరాత్‌లో జిన్నింగ్ మిల్లులు క్వింటాలు పత్తిని క్వింటాల్ రూ. 4,700 వరకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.