చితికిన టమాటా
చేవెళ్ల: మార్కెట్‌లో టమాటా ధర ఒక్కసారిగా పడిపోరుుంది. కిలో ధర రూ.2 కూడా పలకడం లేదు. దీంతో పంట కోసం పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను తెంపేందుకు కూలీలు, మార్కెట్‌కు తరలించేందుకు రవాణా చార్జీలు పెట్టుకునే పరిస్థితి లేకపోవడంతో చాలా చోట్ల అన్నదాతలు చేలల్లోనే పంటలను వదిలేస్తున్నారు. మరికొన్ని చోట్ల పశువులకు మేతగా వినియోగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌లో శనివారం 25 కిలోల టమాటా బాక్స్ ధర నాణ్యతను బట్టి రూ.40 నుంచి రూ.60 రూపాయలలోపే పలికింది. దీంతో రైతులు ఏమిచేయాలో దిక్కతోచని స్థితిలో ఉన్నారు.
మండలంలోని గుండాల, చనువల్లి, పామెన, అల్లవాడ, ఇబ్రహీంపల్లి, దేవునిఎరవ్రల్లి, కమ్మెట, ఊరెళ్ల, తదితర గ్రామాల్లో టమాటా అధికంగా సాగు చేస్తారు. ఇక్కడి నుంచి చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌తో పాటుగా నగరంలోని గుడిమల్కాపూర్, సికింద్రాబాద్ సమీపంలోని బోరుున్ పల్లి కూరగాయల మార్కెట్లకు టమాటాను తరలిస్తారు. ధరలు బాగా ఉన్నప్పుడు గిట్టుబాటవుతున్నా.. పతనమైనప్పుడు మాత్రం అన్నదాతలు అప్పులపాలవుతున్నారు. నెలరోజులుగా టమాటా బాక్సు ధర (25 కిలోలు) రూ.100 పలుకగా.. గడచిన 15 రోజులుగా రూ. 60కి పడిపోరుుంది. దీనికి తోడు ఇటీవల కురిసిన వర్షాలకు టమాటా పండ్లుగా మారి చితికిపోతుండడంతో వాటిని చేలవద్దే వదిలేస్తున్నారు. తక్కువ ధర ఉన్న టమాటాను మార్కెట్‌కు తరలించి రవాణా, కూలీల చార్జీలు జేబు నుంచి పెట్టుకోవాల్సి వస్తుందని చేసేది లేక అక్కడే వదిలేయడమో, పశువులకు మేతగా వేయడమో చేస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా బహిరంగ మార్కెట్లో మాత్రం కిలో రూ. 5 నుంచి రూ.6 ధర పలుకుతుండడం గమనార్హం.
రూ. 5కు కొనుగోలు ఏమైనట్లు..
ధర తక్కువగా ఉండడంతో టమాటా రైతులు నష్టపోకుండా ఉండడానికి ప్రభుత్వమే కిలో రూ. 5 చొప్పున కొనుగోలు చేస్తుందని ఇటీవల మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించిన సంగతి విదితమే. దీంతో రైతులు మార్కెట్ అధికారులను సంప్రదించగా తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు, సూచనలుగాని ప్రభుత్వం నుంచి రాలేదని చెబుతున్నారని ఇబ్రహీంపల్లికి చెందిన రైతు వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలును ప్రారంభిస్తే తమకు కొంతమేరకై నా లాభం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కిలో టమాటా కనీసం రూ. 10 చొప్పున చేను వద్దనే కొనుగోలు చేస్తే రవాణా చార్జీలు మిగులుతాయని రైతులు పేర్కొంటున్నారు.
ఇంకా ఆదేశాలు రాలేదు
టమాటా కిలో రూ.5 కు కొనుగోలు చేసే విషయంలో తమకు ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వారు సూచించిన ధరకు కొనుగోలు చేస్తాం. త్వరలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
- భగవంతు, ఇన్ చార్జి కార్యదర్శి,చేవెళ్ల వ్యవసాయ మార్కెట్