దాదాపు ఎనిమిది దశాబ్దాల కిందట కొందరు మిత్రుల మధ్య సరదా వేడుకగా ప్రారంభమైంది. అనతి కాలంలోనే ఇది అతిపెద్ద ఆహార యుద్ధ వేడుకగా పేరు పొందింది. జనాలంతా వీథుల్లోకి చేరి, ఒకరిపై మరొకరు టమాటోలను విసురుకుంటూ, వీథుల్లో మడుగులు కట్టే టమాటో రసంలో మునిగి తేలుతూ సంబరాలు చేసుకునే ఈ వేడుక పేరు ‘లా టమాటినా’. స్పెయిన్‌లోని బునోల్ పట్టణంలో ఏటా ఆగస్టు నెలలో ఆఖరి బుధవారం రోజున ఈ వేడుక జరుగుతుంది. ‘లా టమాటినా’లో పాల్గొనే జనాలు టన్నుల కొద్ది టమాటోలను ఒకరిపై ఒకరు విసురుకోవడంతో, రోడ్లన్నీ టమాటో రసంతో నెత్తుటేర్లను తలపిస్తాయి.
ఈ సందర్భంగా దాదాపు 1.50 లక్షల కిలోల టమాటోలను ఒకరిపైకి ఒకరు విసురుకుంటారు. ఈసారి ‘లా టమాటినా’ వేడుకను ఘనంగా నిర్వహించడానికి బునోల్ పట్టణ సంస్థ ఏర్పాట్లు చేసింది. బునోల్ పట్టణ జనాభా దాదాపు తొమ్మిదివేలు మాత్రమే! అయితే, ఏటా జరిగే ఈ టమాటోల సరదా యుద్ధం తిలకించడానికి విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ఈ వేడుకలో భాగంగా సంగీత, నృత్య కార్యక్రమాలు, విందు వినోదాలు కూడా జరుగుతాయి. ఈ వేడుక చూడటానికి విదేశాల నుంచి విపరీతంగా జనాలు వచ్చిపడుతుండటంతో బునోల్ పట్టణంలో హోటళ్లు కిటకిటలాడిపోయేవి.
స్థానికులకు మంచినీటి సరఫరాకు కూడా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ పరిస్థితిని నివారించడానికి 2013 నుంచి ఈ వేడుకను తిలకించడానికి వచ్చే సందర్శకుల సంఖ్య ఇరవైవేలకు మించరాదంటూ బునోల్ స్థానిక సంస్థ పరిమితి విధించింది. సందర్శకుల సంఖ్యను కట్టడి చేయడానికి అప్పటి నుంచి టికెట్లు కూడా ప్రవేశపెట్టారు. టికెట్లు పెట్టినా సరే సందర్శకులు ఏమాత్రం వెనుకాడకుండా ఈ వేడుకను చూడటానికి నెలల ముందుగానే బుకింగ్‌లు చేసుకుంటుండటం విశేషం. ‘లా టమాటినా’ స్ఫూర్తితో అమెరికాలోని కొలరడో–టెక్సస్‌ల మధ్య 1982 నుంచి ‘కొలరడో–టెక్సస్ టమాటో వార్’ వేడుక జరుపుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత కొలంబియా, చైనా తదితర దేశాల్లోనూ ఇలాంటి టమాటో యుద్ధాల నిర్వహణ మొదలు పెట్టారు. మన దేశంలో కర్ణాటకలోని బెంగళూరు, మైసూరు నగరాల్లోను, బిహార్ రాజధాని పట్నాలోను దాదాపు దశాబ్దంగా ఏటా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment