రైతన్నకు భరోసా
వినియోగదారులకు తాజా కూరగాయలు
‘మన కూరగాయల పథకం’ లక్ష్యమిదే: హరీశ్
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన పంటకు కచ్చితమైన మార్కెట్ సదుపాయం కల్పించి, లాభదాయకమైన ధర చెల్లించటంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన తాజా కూరగాయలు అందించేందుకు ‘మన కూరగాయల పథకం’ ప్రవేశపెట్టామని మార్కెటింగ్ శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. మన కూరగాయల పథకం కింద హైదరాబాద్‌లో 100 రిటైల్ ఔట్‌లెట్లు ఏర్పాటు చేసి, అవి కుదురుకున్న తర్వాత రాష్ట్రం అంతటికీ విస్తరిస్తామని చెప్పారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు సుధీర్‌రెడ్డి, ఎం.కృష్ణారావు, బాలరాజు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ పథకం కింద మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో 21 కూరగాయల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి రోజుకు 100 క్వింటాళ్ల కూరగాయలను సేకరిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లోని బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో పంపిణీ కేంద్రం ఏర్పాటు చేసి నగరంలో 19 రిటైల్ ఔట్‌లెట్ల ద్వారా కూరగాయలు విక్రయిస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్ర నుంచి వచ్చే డీఎస్పీలను తీసుకోం: నాయిని
కమలనాథన్ కమిటీ సిఫారసు మేరకు ఆంధ్ర ప్రాంతం నుంచి 28 మంది డీఎస్పీలను తెలంగాణకు కేటాయిస్తున్నారని, వారిని తీసుకుంటే భవిష్యత్తులో భారీ నష్టం జరుగుతుందని, వారిని ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంటుందా? లేదా అని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అడిగారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సమాధానం చెప్తూ ..ఆంధ్ర నుంచి వచ్చిన డీఎస్పీలను తీసుకోబోమని స్పష్టంచేశారు. జాతీయ రహదారులకు ఇరువైపులా ఉన్న బార్లను, మద్యం దుకాణాలను సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా త్వరలోనే తొలగిస్తామని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.