20 నుంచి పత్తి కొనుగోళ్లు | From 20 cotton purchases | Sakshi
Sakshi News home page

20 నుంచి పత్తి కొనుగోళ్లు

Published Mon, Sep 7 2015 2:36 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

20 నుంచి పత్తి కొనుగోళ్లు - Sakshi

20 నుంచి పత్తి కొనుగోళ్లు

- కొనుగోళ్లపై సన్నాహక సమావేశం
- అన్యాయం జరిగితే మంత్రుల ఇళ్లనే ముట్టడిస్తాం
- రాస్తారోకోలతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టం
- పత్తికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ ఇవ్వాలి
- కొనుగోళ్లలో అక్రమాలు జరగకుండా చూడాలి
- రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :
ఈ నెల 20వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్లు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మార్కెట్‌యార్డుల్లో కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఖరీఫ్ పత్తి కొనుగోళ్లపై సన్నాహక సమీక్ష సమావేశం ఆదివారం స్థానిక కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో జరిగింది. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సీజనులో అక్టోబర్ 5 నుంచి కొనుగోళ్లను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామని సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) బ్రాంచ్ మేనేజర్ మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

పత్తి విక్రయాల డబ్బులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తామని అన్నారు. సీసీఐ నిర్ధేశించిన నాణ్యత ప్రమాణాల మేరకు ఉన్న పత్తి కొనుగోలుకు తాము సిద్ధంగా ఉన్నామని వ్యాపారుల సంఘం ప్రతినిధి జి.వినోద్ పేర్కొన్నారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులను చిన్న చూపు చూస్తోంది. ఉద్యోగుల జీతభత్యాలను 40 శాతానికిపైగా ఫిట్‌మెంట్ ప్రకటించిన సర్కారు., పత్తి కనీస మద్దతు ధర క్వింటాళుకు రూ.50 పెంచి ఒక శాతంతో సరిపెట్టింది.. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.4,100కు అదనంగా రూ.500 రాష్ట్రప్రభుత్వం బోనస్‌గా చెల్లించాలి..’’ అని డిమాండ్ చేశారు.

జైనథ్, కాగజ్‌నగర్, బేల, బజార్‌హత్నూర్‌లలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. ‘‘మార్కెట్‌యార్డుల్లోనే పత్తి కొనుగోళ్లు జరిగేలా చూస్తేనే రైతులకు మేలు జరుగుతుంది.. సీసీఐ లీజుకు తీసుకున్న జిన్నింగుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు కొనుగోళ్లకు జరుగకుండా చూడాలి.. గత ఏడాది ఈ చర్యలు తీసుకోవడంలో విఫలం కావడంతో పెద్ద ఎత్తున అక్రమ కొనుగోళ్లు జరిగి, రైతులు తీవ్రంగా నష్టపోయారు.. అధికారులు, ప్రజాప్రతినిధులు ట్రేడర్లకు మేలు చేసేలా చూడొద్దు... ఈసారి మాకు అన్యాయం జరిగితే రాస్తారోకోలు చేసి, ప్రజలు, చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టేది లేదు.. ఏకంగా జిల్లా మంత్రులు, కలెక్టర్ ఇళ్లను ముట్టడిస్తాం..’’ అని రైతులు, రైతు ప్రతినిధులు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
 
తప్పు జరిగితే సర్కారు బదునాం : మంత్రులు
‘ఈసారి పత్తి కొనుగోళ్లలో ఏ చిన్న తప్పు జరిగినా ప్రభుత్వమే బదునాం అవుతుంది.. పత్తి కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలి. ఈసారి సీసీఐతోపాటు, కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ద్వారా కూడా పత్తి కొనుగోళ్లు జరిగేలా ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తాం..’ అని మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు.
 
రైతులకు ప్రత్యేక కార్డులు..: కలెక్టర్
బార్ కోడింగ్ విధానం కలిగిన ప్రత్యేక కార్డులను పత్తి రైతులకు జారీ చేసి పత్తి కోనుగోళ్లు జరుపుతామని కలెక్టర్ ఎం.జగన్మోహన్ పేర్కొన్నారు. ‘‘గత ఏడాది తూకాల్లో భారీ మోసాలు జరిగాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు.. ఈసారి తరచూ కాంటాలను తనిఖీ చేయండి. మీ లోపం కారణంగా తూకాల్లో వ్యత్యాసం రాకుండా ఆకస్మిక తనిఖీలు చేపట్టండి..’ అని తూనికల కొలతల అధికారులను ఆదేశించారు. మార్కెట్‌యార్డుల్లో రైతులకు భోజన వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. పశుగ్రాసం, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీ గోడాం నగేష్, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, జి.విఠల్‌రెడ్డి, రాథోడ్ బాపూరావు, కలెక్టర్ ఎం.జగన్మోహన్, జేసీ సుందర్‌అబ్నార్, సీసీఐ, మార్కెటింగ్ శాఖ అధికారులు జేడీ శ్యాముల్‌రాజు, శ్రీనివాస్, ఏఎస్పీ పనసారెడ్డి, రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement