Marketing department officials
-
20 నుంచి పత్తి కొనుగోళ్లు
- కొనుగోళ్లపై సన్నాహక సమావేశం - అన్యాయం జరిగితే మంత్రుల ఇళ్లనే ముట్టడిస్తాం - రాస్తారోకోలతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టం - పత్తికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ ఇవ్వాలి - కొనుగోళ్లలో అక్రమాలు జరగకుండా చూడాలి - రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఈ నెల 20వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్లు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మార్కెట్‌యార్డుల్లో కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఖరీఫ్ పత్తి కొనుగోళ్లపై సన్నాహక సమీక్ష సమావేశం ఆదివారం స్థానిక కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో జరిగింది. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సీజనులో అక్టోబర్ 5 నుంచి కొనుగోళ్లను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామని సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) బ్రాంచ్ మేనేజర్ మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పత్తి విక్రయాల డబ్బులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తామని అన్నారు. సీసీఐ నిర్ధేశించిన నాణ్యత ప్రమాణాల మేరకు ఉన్న పత్తి కొనుగోలుకు తాము సిద్ధంగా ఉన్నామని వ్యాపారుల సంఘం ప్రతినిధి జి.వినోద్ పేర్కొన్నారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులను చిన్న చూపు చూస్తోంది. ఉద్యోగుల జీతభత్యాలను 40 శాతానికిపైగా ఫిట్మెంట్ ప్రకటించిన సర్కారు., పత్తి కనీస మద్దతు ధర క్వింటాళుకు రూ.50 పెంచి ఒక శాతంతో సరిపెట్టింది.. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.4,100కు అదనంగా రూ.500 రాష్ట్రప్రభుత్వం బోనస్‌గా చెల్లించాలి..’’ అని డిమాండ్ చేశారు. జైనథ్, కాగజ్‌నగర్, బేల, బజార్‌హత్నూర్‌లలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. ‘‘మార్కెట్‌యార్డుల్లోనే పత్తి కొనుగోళ్లు జరిగేలా చూస్తేనే రైతులకు మేలు జరుగుతుంది.. సీసీఐ లీజుకు తీసుకున్న జిన్నింగుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు కొనుగోళ్లకు జరుగకుండా చూడాలి.. గత ఏడాది ఈ చర్యలు తీసుకోవడంలో విఫలం కావడంతో పెద్ద ఎత్తున అక్రమ కొనుగోళ్లు జరిగి, రైతులు తీవ్రంగా నష్టపోయారు.. అధికారులు, ప్రజాప్రతినిధులు ట్రేడర్లకు మేలు చేసేలా చూడొద్దు... ఈసారి మాకు అన్యాయం జరిగితే రాస్తారోకోలు చేసి, ప్రజలు, చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టేది లేదు.. ఏకంగా జిల్లా మంత్రులు, కలెక్టర్ ఇళ్లను ముట్టడిస్తాం..’’ అని రైతులు, రైతు ప్రతినిధులు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తప్పు జరిగితే సర్కారు బదునాం : మంత్రులు ‘ఈసారి పత్తి కొనుగోళ్లలో ఏ చిన్న తప్పు జరిగినా ప్రభుత్వమే బదునాం అవుతుంది.. పత్తి కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలి. ఈసారి సీసీఐతోపాటు, కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ద్వారా కూడా పత్తి కొనుగోళ్లు జరిగేలా ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తాం..’ అని మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు ప్రత్యేక కార్డులు..: కలెక్టర్ బార్ కోడింగ్ విధానం కలిగిన ప్రత్యేక కార్డులను పత్తి రైతులకు జారీ చేసి పత్తి కోనుగోళ్లు జరుపుతామని కలెక్టర్ ఎం.జగన్మోహన్ పేర్కొన్నారు. ‘‘గత ఏడాది తూకాల్లో భారీ మోసాలు జరిగాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు.. ఈసారి తరచూ కాంటాలను తనిఖీ చేయండి. మీ లోపం కారణంగా తూకాల్లో వ్యత్యాసం రాకుండా ఆకస్మిక తనిఖీలు చేపట్టండి..’ అని తూనికల కొలతల అధికారులను ఆదేశించారు. మార్కెట్‌యార్డుల్లో రైతులకు భోజన వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. పశుగ్రాసం, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీ గోడాం నగేష్, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, జి.విఠల్‌రెడ్డి, రాథోడ్ బాపూరావు, కలెక్టర్ ఎం.జగన్మోహన్, జేసీ సుందర్‌అబ్నార్, సీసీఐ, మార్కెటింగ్ శాఖ అధికారులు జేడీ శ్యాముల్‌రాజు, శ్రీనివాస్, ఏఎస్పీ పనసారెడ్డి, రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
స్వల్పంగా తగ్గిన ఉల్లి ధర
* హోల్‌సేల్ మార్కెట్లో ధరలు తగ్గుముఖం * రూ.7.25 కోట్లతో సబ్సిడీ ఉల్లి సేకరణ సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ ఎగబాకి చుక్కలను తాకిన ఉల్లి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో ప్రధాన మార్కెట్ అయిన హైదరాబాద్‌లోని మలక్‌పేటలో శనివారం కిలో గరిష్టంగా రూ. 67 పలికిన ఉల్లి ధర మంగళవారం రూ. 60కి తగ్గింది. కర్నూలు, కర్ణాటక ఉల్లి రకాలు రెండు రోజుల వ్యవధిలోనే కిలోకు రూ. 10 చొప్పున తగ్గినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలోనే అతి పెద్ద ఉల్లి మార్కెట్ లాసల్గావ్ (మహారాష్ట్ర) నుంచి రాష్ట్రానికి ఉల్లి దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. ఉత్తర భారతదేశంలో ఉల్లికి డిమాండ్ పెరగడంతో మహారాష్ట్ర రైతులు, వ్యాపారులు అటువైపు దృష్టి సారించారు. గతంలో రోజుకు మహారాష్ట్ర నుంచి 5వేలకు పైగా ఉల్లి బస్తాలు రాగా, ప్రస్తుతం రెండు వేల బస్తాలకు మించి రావడం లేదు. ఇదే సమయంలో కర్ణాటక, కర్నూలు నుంచి ఉల్లి నిల్వలు పెద్దమొత్తంలో రాష్ట్రానికి వస్తున్నాయి. అయితే హోల్‌సేల్ మార్కెట్లో ధరలు కిలోకు రూ. 10 మేర తగ్గడంతో రైతులు అమ్మకాలపై వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నా రు. మార్కెట్‌కు సరుకు చేరుకున్నా లావాదేవీలు ఆశించిన స్థాయిలో లేవని అధికారులు చెబుతున్నారు. అయితే విదేశాలకు ఉల్లి ఎగుమతి ధరలు భారీ గా పెంచడం, విదేశాల నుంచి 10 వేల టన్నుల ఉల్లి దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించడం, నల్లబజారుకు తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం, సబ్సిడీ ధరలపై విక్రయాలు వంటి కారణాలతో ఉల్లి హోల్‌సేల్ మార్కెట్లలో పరిస్థితి కొంత మెరుగైందని అధికారులు పేర్కొంటున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటే.. ధరలు అదుపులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 88 సబ్సిడీ విక్రయ కేంద్రాలకు సరఫరా చేసేందుకు రూ. 7.25 కోట్లతో 1737.29 టన్నుల ఉల్లిని సేకరించింది. విక్రయాల ద్వారా తిరిగి రూ. 3.47 కోట్లు వచ్చినట్లు మార్కెటింగ్ విభాగం అధికారులు వెల్లడించారు. -
ధరల స్థిరీకరణనిధి విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్: ఉల్లి ధరలను నియంత్రించేందుకు ధరల స్థిరీకరణ నిధి నుంచి నిధులు విడుదల చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. శుక్రవారం శాసనసభ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉల్లిని అందరికీ అందుబాటులోకి తెచ్చేలా చేపడుతున్న చర్యలను వివరించారు. ఉల్లి సేకరణకు కేంద్రం నుంచి సకాలంలో నిధులు విడుదల కాని పక్షంలో రాష్ట్ర ఖజానా నుంచి రూ.100 కోట్ల మేర వినియోగించే యోచనలో ఉన్నామన్నారు. రూ.20కే కిలో ఉల్లిని అందుబాటులోకి తెస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 80 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో 40 విక్రయ కేంద్రాలు ఏర్పా టు కాగా, రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో మరో 40 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని హైదరాబాద్‌లో రైతు బజార్లతో పాటు ‘మన కూరగాయల’ అవుట్లెట్ల ద్వారా ఉల్లి విక్రయాలు ప్రారంభించామన్నారు. మిగతా తొమ్మిది జిల్లాల్లో ఈ నెల ఐదో తేదీ నుంచి ప్రభు త్వ అవుట్లెట్లు ప్రారంభమయ్యేలా సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఉల్లి సేకరణ, విక్రయాలపై సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాలశాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. కుటుంబానికి రెండు కిలోలు మహారాష్ట్రలోని నాసిక్‌తోపాటు కర్నూలు, హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్ల నుంచి ఉల్లి కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు హరీశ్ ప్రకటిం చారు. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.40 నుంచి రూ.50 వరకు ఉందన్నారు. ప్రభుత్వ ఔట్లెట్ల ద్వారా రోజూ 100 టన్నుల ఉల్లి అందుబాటులోకి తెస్తామన్నారు. కుటుంబానికి గరిష్టంగా రెండు కిలోల వంతున సరఫరా చేస్తామని చెప్పారు. వాట్సప్ ద్వారా ఉల్లి ధరలపై ఎప్పటికప్పుడు మార్కెటింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. -
ఇక కిరోసిన్‌కు నగదు బదిలీ!
రంగం సిద్ధం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు, ఆయిల్ కంపెనీల నుంచి అభిప్రాయ సేకరణ హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల్లో గ్యాస్‌కు నగదు బదిలీని ప్రారంభించిన కేంద్రం, ఇక కిరోసిన్‌కు నగదు బది లీపై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా కిరోసిన్‌పై భరిస్తున్న రూ.30వేల కోట్ల రాయితీలో సుమారు 35 శాతం పక్కదారి పడుతోందని గుర్తించిన కేంద్రం, అక్రమాలకు కళ్లెం వేయాలంటే నగదు బదిలీనే ఉత్తమ మార్గం అని భావిస్తోంది. కిరోసిన్‌కు నగదు బదిలీపై సెప్టెం బర్‌లోనే రాష్ట్రాల అభిప్రాయం కోరిన కేంద్రం, ఇప్పుడు ఈ ప్రక్రియను వేగం చేస్తోంది. తాజా గా పెట్రోలియం శాఖ మార్కెటింగ్ విభాగపు అధికారులు రాష్ట్రంలో పర్యటించి ప్రభుత్వ అధికారులు, ఆయిల్ కంపెనీ ప్రతినిధుల నుం చి అభిప్రాయ సేకరణ జరిపి వెళ్లారు. రాష్ట్రం లో ప్రస్తుతం రేషన్‌కార్డుపై ఒక్కో లబ్ధిదారునికి మున్సిపల్ ప్రాంతంలో 4 లీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 2 లీటర్ల మేర కిరోసిన్‌ను సరఫరా చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో లీటరు కిరోసిన్ ధర రూ.49 ఉండగా ప్రస్తుతం కేంద్రం రూ.34 రాయితీని భరించి రూ.15 కే లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి నెల 16,164 కిలో లీటర్ల మేర కిరోసిన్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. దీనిపై కేంద్రం నెలకు రూ.54.95కోట్ల మేర రాయితీని భరిస్తుండగా ఏడాదికి ఆ మొత్తం రూ.659.4 కోట్లు వరకు ఉంటుంది. దేశ వ్యాప్తంగా చూస్తే కేంద్రం అందిస్తున్న రాయితీ సుమారు రూ.30 వేల కోట్ల ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తంలో సుమారు 35 శాతం మేర దుర్వినియోగం అవుతుందని ఇటీవలే ఓ సర్వే ద్వారా గుర్తించిన కేంద్రం నగదు బదిలీ అంశాన్ని తెరపైకి తెచ్చి రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సైతం సమ్మతం తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్రంలో చేపట్టిన బోగస్ కార్డుల ఏరివేత ద్వారా 11.71లక్షల కార్డులను తొలగించడం వల్ల 7,406 కిలో లీటర్ల కిరోసిన్‌ను ఆదా చేశామని, దీని ద్వారా ప్రతి నెలా ప్రభుత్వానికి రూ.25కోట్ల మేర రాయితీ మిగులుతోందని కేంద్రం దృష్టికి తెచ్చింది. బోగస్ కార్డుల ఏరివేత ద్వారా ఆదా చేసిన కిరోసిన్ రాయితీని తమ రాష్ట్రానికే తిరిగి ప్రోత్సాహకంగా ఇవ్వాలని, ఆ మొత్తాలను దీపం వంటి పథకాలకు వెచ్చించుకునే వెసులుబాటు ఇవ్వాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. దీనిపై కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది. తాజాగా కేంద్ర బృందం పర్యటన.. ఇదిలా ఉండగా తాజాగా కిరోసిన్‌కు నగదు బదిలీ అంశంపై రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకునేందుకు కేంద్ర బృందం ఎంపిక చేసిన రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. దీనిలో భాగంగానే పెట్రోలియం శాఖలోని మార్కెటింగ్ విభాగానికి చెందిన జాయింట్ డెరైక్టర్‌తో కూడిన బృందం ఒకటి రాష్ట్రంలో పర్యటించి వివిధ శాఖల అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో భేటీ నిర్వహించింది. కిరోసిన్‌కు నగదు బదిలీకోసం ఆధార్‌ను కచ్చితం చేయాలని భావిస్తున్న కేంద్రం, రాష్ట్రంలో ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతాలు గల లబ్ధిదారులు, జిల్లాల వారీగా వివరాలను పరిశీలించింది. హైదరాబాద్‌లో తొలి దశలో ఈ పథకాన్ని కొన్ని కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించి చూడాలనే భావనలో కేంద్రం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.