స్వల్పంగా తగ్గిన ఉల్లి ధర
* హోల్‌సేల్ మార్కెట్లో ధరలు తగ్గుముఖం
* రూ.7.25 కోట్లతో సబ్సిడీ ఉల్లి సేకరణ
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ ఎగబాకి చుక్కలను తాకిన ఉల్లి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో ప్రధాన మార్కెట్ అయిన హైదరాబాద్‌లోని మలక్‌పేటలో శనివారం కిలో గరిష్టంగా రూ. 67 పలికిన ఉల్లి ధర మంగళవారం రూ. 60కి తగ్గింది. కర్నూలు, కర్ణాటక ఉల్లి రకాలు రెండు రోజుల వ్యవధిలోనే కిలోకు రూ. 10 చొప్పున తగ్గినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు.
దేశంలోనే అతి పెద్ద ఉల్లి మార్కెట్ లాసల్‌గావ్ (మహారాష్ట్ర) నుంచి రాష్ట్రానికి ఉల్లి దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. ఉత్తర భారతదేశంలో ఉల్లికి డిమాండ్ పెరగడంతో మహారాష్ట్ర రైతులు, వ్యాపారులు అటువైపు దృష్టి సారించారు. గతంలో రోజుకు మహారాష్ట్ర నుంచి 5వేలకు పైగా ఉల్లి బస్తాలు రాగా, ప్రస్తుతం రెండు వేల బస్తాలకు మించి రావడం లేదు. ఇదే సమయంలో కర్ణాటక, కర్నూలు నుంచి ఉల్లి నిల్వలు పెద్దమొత్తంలో రాష్ట్రానికి వస్తున్నాయి.
అయితే హోల్‌సేల్ మార్కెట్లో ధరలు కిలోకు రూ. 10 మేర తగ్గడంతో రైతులు అమ్మకాలపై వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నా రు. మార్కెట్‌కు సరుకు చేరుకున్నా లావాదేవీలు ఆశించిన స్థాయిలో లేవని అధికారులు చెబుతున్నారు. అయితే విదేశాలకు ఉల్లి ఎగుమతి ధరలు భారీ గా పెంచడం, విదేశాల నుంచి 10 వేల టన్నుల ఉల్లి దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించడం, నల్లబజారుకు తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం, సబ్సిడీ ధరలపై విక్రయాలు వంటి కారణాలతో ఉల్లి హోల్‌సేల్ మార్కెట్లలో పరిస్థితి కొంత మెరుగైందని అధికారులు పేర్కొంటున్నారు.
మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటే.. ధరలు అదుపులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 88 సబ్సిడీ విక్రయ కేంద్రాలకు సరఫరా చేసేందుకు రూ. 7.25 కోట్లతో 1737.29 టన్నుల ఉల్లిని సేకరించింది. విక్రయాల ద్వారా తిరిగి రూ. 3.47 కోట్లు వచ్చినట్లు మార్కెటింగ్ విభాగం అధికారులు వెల్లడించారు.