ఉల్లి వెక్కిరిస్తోంది
♦ మార్కెట్‌లో తగ్గిపోతున్న నిల్వలు
♦ అకాల వర్షాలతో తగ్గిన దిగుబడి
సాక్షి, ముంబై : నగరంలో ఉల్లి ధరలు కంటతడి పెట్టిస్తున్నాయి. మార్కెట్‌లో ఉల్లి నిల్వలు తగ్గిపోవడంతో ధరలు మండిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులు వీయడంతో ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో పంట దిగుబడి తగ్గింది. ఫలితంగా జూన్‌లో అదుపులో ఉన్న ధరలు జూలైలో పెరగడం ప్రారంభమైంది. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)కి ముంబై ప్రజలకు కోసం ప్రతి రోజు 125 ట్రక్కుల ఉల్లి వస్తుండగా ప్రస్తుతం వంద వరకు మాత్రమే వస్తున్నాయి. దీంతో నగరంలో ఉల్లి కొరత ఏర్పడింది.
ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్‌లో కేజీ రూ. 35-37 పలుకుతన్న ఉల్లి కొనుగోలుదారుల చెంతుకు వచ్చేసరికి రూ. 50 అవుతోంది. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ధర రూ. 90-100కి పెరగడం ఖాయమని వ్యాపారులు చెబుతున్నా రు. మరోవైపు దా దర్, వాషి ఏపీఎంసీ మార్కెట్లలో వ్యాపారులు నాసిరకం ఉల్లిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో నాసిక్ జిల్లాలోని నిఫాడ్, లాసల్‌గావ్ ప్రాంతాల్లో ఉల్లి ఎక్కువగా పండుతుంది. ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు కూడా రైళ్లలో ఎగుమతి అవుతుంది. అయితే ప్రస్తుతం రైతుల వద్ద నిల్వలు అయిపోవడం, అకాల వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గడం వల్ల ఉల్లికోసం ఇతర రాష్ట్రాలపై ఆదారపడాల్సిన పరిస్థితి వచ్చింది.