బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.85
కొనాలంటే జంకుతున్న ప్రజలు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): అన్ని వంటకాల్లో వాడే ఉల్లిగడ్డ ధరలు రోజురోజుకూ పెరగడంతో ఉల్లిగడ్డ ప్రియులు వాటిని కొనాలంటేనే ఉలిక్కిపడుతున్నారు. ఒక్కసారిగా ఉల్లిగడ్డ ధరలు పెరగడంతో ప్రజలు, వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం హోల్‌సెల్‌లో చిన్న ఉల్లిగడ్డ ధర కిలో రూ.50, పెద్ద ఉల్లిగడ్డ కిలో రూ.70 ఉండగా బయట మార్కెట్‌లో కిలో రూ.85 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. ధరలు పెరగడంతో చాలా మంది ఉల్లి జోలికి పోవడంలేదు.
ప్రధానంగా హోటల్‌లు, ఫాస్ట్‌పుడ్ సెంటర్‌లలో ఆహారంతోపాటు ఉల్లిగడ్డలను ఇస్తుంటారు. ధరలు పెరగడంతో దాని స్థానంలో కీరాను అందిస్తున్నారు. ఎక్కువగా ఉల్లిగడ్డలు మహారాష్ట్రలోని సోలాపూర్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ నుంచి దిగుమతి అవుతున్నాయి. ధరలు పెరగడంతో కూరగాయల వ్యాపారస్తులు కొద్దిరోజులుగా ఉల్లిగడ్డలను అమ్మడంలేదు. దాని వల్ల తమకు నష్టమే తప్ప లాభం రావడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద వ్యాపారస్తులు ఉల్లిగడ్డలను బ్లాక్ మార్కెట్ చేయడం వల్లే ధరలు పెరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. మరి కొందరు ప్రభుత్వం ధరలను నియంత్రించిలేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. వేసవిలో ఉల్లి ధర కిలో రూ.15 నుంచి రూ.18 వరకు ఉండేది. దానికి కారణం అదే సమయంలో ఉల్లి పంట రావడం వల్ల ధరలు తక్కువగా ఉంటాయని కూరగాయల వ్యాపారస్తులు చెబుతున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి పూర్తిస్థాయిలో ఉల్లిగడ్డ ధరలను నియంత్రించలేకపోతే పేదవాడు ఉల్లిఘాట్‌కు దూరంకావాల్సివస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment