ఇక కిరోసిన్‌కు నగదు బదిలీ!
రంగం సిద్ధం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు, ఆయిల్ కంపెనీల నుంచి అభిప్రాయ సేకరణ
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల్లో గ్యాస్‌కు నగదు బదిలీని ప్రారంభించిన కేంద్రం, ఇక కిరోసిన్‌కు నగదు బది లీపై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా కిరోసిన్‌పై భరిస్తున్న రూ.30వేల కోట్ల రాయితీలో సుమారు 35 శాతం పక్కదారి పడుతోందని గుర్తించిన కేంద్రం, అక్రమాలకు కళ్లెం వేయాలంటే నగదు బదిలీనే ఉత్తమ మార్గం అని భావిస్తోంది. కిరోసిన్‌కు నగదు బదిలీపై సెప్టెం బర్‌లోనే రాష్ట్రాల అభిప్రాయం కోరిన కేంద్రం, ఇప్పుడు ఈ ప్రక్రియను వేగం చేస్తోంది. తాజా గా పెట్రోలియం శాఖ మార్కెటింగ్ విభాగపు అధికారులు రాష్ట్రంలో పర్యటించి ప్రభుత్వ అధికారులు, ఆయిల్ కంపెనీ ప్రతినిధుల నుం చి అభిప్రాయ సేకరణ జరిపి వెళ్లారు. రాష్ట్రం లో ప్రస్తుతం రేషన్‌కార్డుపై ఒక్కో లబ్ధిదారునికి మున్సిపల్ ప్రాంతంలో 4 లీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 2 లీటర్ల మేర కిరోసిన్‌ను సరఫరా చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో లీటరు కిరోసిన్ ధర రూ.49 ఉండగా ప్రస్తుతం కేంద్రం రూ.34 రాయితీని భరించి రూ.15 కే లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి నెల 16,164 కిలో లీటర్ల మేర కిరోసిన్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు.
దీనిపై కేంద్రం నెలకు రూ.54.95కోట్ల మేర రాయితీని భరిస్తుండగా ఏడాదికి ఆ మొత్తం రూ.659.4 కోట్లు వరకు ఉంటుంది. దేశ వ్యాప్తంగా చూస్తే కేంద్రం అందిస్తున్న రాయితీ సుమారు రూ.30 వేల కోట్ల ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తంలో సుమారు 35 శాతం మేర దుర్వినియోగం అవుతుందని ఇటీవలే ఓ సర్వే ద్వారా గుర్తించిన కేంద్రం నగదు బదిలీ అంశాన్ని తెరపైకి తెచ్చి రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సైతం సమ్మతం తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్రంలో చేపట్టిన బోగస్ కార్డుల ఏరివేత ద్వారా 11.71లక్షల కార్డులను తొలగించడం వల్ల 7,406 కిలో లీటర్ల కిరోసిన్‌ను ఆదా చేశామని, దీని ద్వారా ప్రతి నెలా ప్రభుత్వానికి రూ.25కోట్ల మేర రాయితీ మిగులుతోందని కేంద్రం దృష్టికి తెచ్చింది. బోగస్ కార్డుల ఏరివేత ద్వారా ఆదా చేసిన కిరోసిన్ రాయితీని తమ రాష్ట్రానికే తిరిగి ప్రోత్సాహకంగా ఇవ్వాలని, ఆ మొత్తాలను దీపం వంటి పథకాలకు వెచ్చించుకునే వెసులుబాటు ఇవ్వాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. దీనిపై కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది.
తాజాగా కేంద్ర బృందం పర్యటన..
ఇదిలా ఉండగా తాజాగా కిరోసిన్‌కు నగదు బదిలీ అంశంపై రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకునేందుకు కేంద్ర బృందం ఎంపిక చేసిన రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. దీనిలో భాగంగానే పెట్రోలియం శాఖలోని మార్కెటింగ్ విభాగానికి చెందిన జాయింట్ డెరైక్టర్‌తో కూడిన బృందం ఒకటి రాష్ట్రంలో పర్యటించి వివిధ శాఖల అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో భేటీ నిర్వహించింది. కిరోసిన్‌కు నగదు బదిలీకోసం ఆధార్‌ను కచ్చితం చేయాలని భావిస్తున్న కేంద్రం, రాష్ట్రంలో ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతాలు గల లబ్ధిదారులు, జిల్లాల వారీగా వివరాలను పరిశీలించింది. హైదరాబాద్‌లో తొలి దశలో ఈ పథకాన్ని కొన్ని కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించి చూడాలనే భావనలో కేంద్రం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.